రఘురామపై జగన్ సర్కారు సంచలనం -ఆ హక్కుంది కానీ, రక్తపాతం తలెత్తితే? -సుప్రీంలో కౌంటర్, ఇంకొద్ది గంటల్లో
సొంత పార్టీపై తిరుగుబావుటా ఎగరేసి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను మళ్లీ జైలుకు పంపేదాకా ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టబోనని శపథం చేసి, చివరికి దేశద్రోహం కేసులో అరెస్టయిన నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఉదంతం రోజుకో మలుపు తిరుగుతోంది. ఎంపీ రాజుపై రాజద్రోహం కేసు నిర్ణయం రాత్రికి రాత్రే తీసుకున్నది కాదని, సుదీర్ఘ కాలంగా ఆయన ప్రకటనలు, కార్యాచరణను నిశితంగా పరిశీలించిన తర్వాతే చర్యలకు ఉపక్రమించామని జగన్ సర్కారు సుప్రీంకోర్టుకు తెలిపింది. ఏపీ హైకోర్టు బెయిల్ రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ రఘురామ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ కు జగన్ సర్కారు వేసిన కౌంటర్ లో పలు సంచలన అంశాలను పేర్కొంది..

ఇంకొద్ది గంటల్లో బెయిల్‌పై..
ఏపీ సర్కారు తనపై మోపిన రాజద్రోహం కేసులు అనుచితమైనవని, కల్పిత ఆధారాలపై పెట్టిన సదరు కేసుల నుంచి బెయిల్ ఇప్పించాలంటూ వైసీపీ ఎంపీ రఘురామ ఏపీ హైకోర్టును ఆశ్రయించడం, ఆ వాదనతో ఏకీభవించని కోర్టు బెయిల్ వినతిని కొట్టేయడం, హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఎంపీ సుప్రీంకోర్టును ఆశ్రయించడం, ఏపీ సీఐడీ కస్టడీలో పోలీసులు టార్చర్ చేసి గాయపర్చారని చెప్పడంతో చలించిన సుప్రీంకోర్టు.. ఎంపీని సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి తరలించాలని ఆదేశించడం తెలిసిందే.
రఘురామ బెయిల్ పిటిషన్ పై ఇంకొద్ది గంటల్లో, అంటే, శుక్రవారం(మే21న) విచారణ జరుగనుండటంతో ఈ వ్యవహారానికి సంబంధించి ఏపీ సర్కారు కౌంటర్ దాఖలు చేసింది. అందులో రఘురామ కుట్రలకు సంబంధించి ప్రభుత్వం కీలక అంశాలను కోర్టు దృష్టికి తెచ్చింది..

చీలికలు, ధ్వంస రచనకు పిలుపు..
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు చాలా కాలంగా తన ప్రకటనల ద్వారా సమాజంలోని పలు వర్గాల మధ్య, కులమతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని, సమూహాల మధ్య చీలకలు సృష్టించడం, బాధ్యత గల హోదాను మర్చిపోయి నేరుగా ధ్వంస రచనకు, దాడులకు పిలుపునివ్వడం ద్వారా రాష్ట్రప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు స్థిరమైన, ఉద్దేశపూర్వక ప్రయత్నాలు చేశాడని జగన్ సర్కారు సుప్రీంకోర్టుకు తెలిపింది.
రాజుపై రాజద్రోహం కేసు అల్లాటప్పాగా నమోదు చేసింది కాదన్న ఏపీ సర్కారు.. దాని వెనకున్న హిస్టరీ మొత్తాన్ని పొందుపర్చిన ఎఫ్ఐఆర్ కాపీలను సైతం కోర్టుకు సమర్పించింది.

రక్తపాతం జరిగేదాకా కూర్చోవాలా?
ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఎంపీ రఘురామ కుట్ర పన్నారని కౌంటర్‌లో పేర్కొన్న ప్రభుత్వం.. రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు రఘురామ ప్రయత్నించారని, వాటికి కొనసాగింపుగా నిజంగా నెత్తుటిపాతం లాంటి పరిస్థితులు నిజంగానే జరిగి, ఆ మేరకు వాస్తవ ఫిర్యాదులు నమోదయ్యేంత వరకూ ప్రభుత్వం చేతులు ముడుచుకొని కూర్చోలేదని సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది.
కొవిడ్ పరిస్థితుల నిర్వహణలో జగన్ సర్కారు వైఫల్యాలను ఎత్తిచూపినందుకే తనపై కక్ష కట్టి కుట్రపూరిత కేసు పెట్టారన్న రఘురామ వాదనలో అర్థమేలేదన్న జగన్ సర్కారు.. ఎంపీకి బెయిల్ ఇవ్వరాదని పిటిషన్ లో కోరింది. అంతేకాదు..

విమర్శించే హక్కుంది కానీ..
కేవలం సీఎం జగన్ ను, వైసీపీ సర్కారును విమర్శించిన కారణంగానే ఎంపీ రఘురామపై కేసు పెట్టారనే వాదనను ప్రభుత్వం గట్టింగా కౌంటర్ చేసింది. ''పార్లమెంట్ సభ్యుడికి తక్కువకాకుండా ప్రతి వ్యక్తికీ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఉంది. దాన్నెవరూ కాదనలేరు కూడా. అయితే, అలాంటి హక్కును ప్రజాస్వామ్య విచ్ఛిత్తికి, ప్రజా క్రమాన్ని చెడగొట్టడానికీ వాడుకుంటామంటే కుదరదు. నిజానికి వాక్ స్వాతంత్ర్యం వర్ధిల్లాలంటే పబ్లిక్ ఆర్డర్ అమలులో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది'' అని జగన్ సర్కారు సుప్రీంకోర్టుకు తెలిపింది.

కారులో రఘురామ కాళ్లెత్తడం వెనుక..
రాజద్రోహం కేసులో ఎంపీ రఘురామకు బెయిల్ ఇవ్వొద్దంటూ దాఖలు చేసిన కౌంటర్ లో తాజా ఘటనలను సైతం ఏపీ సర్కారు పొందుపర్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎంపీని గుంటూరు జైలు నుంచి సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి తరలించే క్రమంలో కారులో ప్రయాణిస్తూ రఘురామ కాళ్లుపైకెత్తి తన గాయాలను చూపించడం వెనుక ప్రభుత్వంపై బ్యాడ్ ఇప్రెషన్ క్రియేట్ చేయాలనే ఉద్దేశమున్నట్లు స్పష్టంగా తెలుస్తోందని, నిజానికి కస్టడీలో పోలీసులు ఆయనను కొట్టారని చెప్పడం శుద్ధ అవాస్తవమని, తన అరెస్టు చుట్టూ ఒక అసాధారణ వాతావరణాన్ని సృష్టించాలనే లక్ష్యంతోనే ఆయన చర్యలకు ఒడిగట్టాడని, జ్యూడీషియల్ కస్టడీలో ఉండీ మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నించారని ఏపీ ప్రభుత్వం నిందించింది.
మొత్తానికి రఘురామను సుదీర్ఘకాలంపాటు నిర్బంధంలోనే ఉంచేలా జగన్ సర్కారు కౌంటర్ ను ఫైల్ చేసింది. రఘురామ ఒంటిపై అనుమానిత గాయాలకు సంబంధించిన మెడికల్ రిపోర్టులు, వాటికి సంబంధించి వీడియో ఫుటేజీలు ఇప్పటికే సుప్రీంకోర్టుకు అందగా, జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనం వాటిని శుక్రవారం పరిశీలించి, రఘురామ బెయిల్ పై ఆదేశాలు జారీ చేయనుంది.












Click it and Unblock the Notifications