జనాల బాదుడు-చంద్రబాబు దింపుడు కల్లం ఆశలు-కుప్పంలో ఇల్లుపై సాయిరెడ్డి ట్వీట్
ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగుతున్న రాజకీయాల్లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్లు ఎప్పుడూ చర్చనీయాంశం అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా ప్రతపక్ష నేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ ను ఉద్దేశించి సాయిరెడ్డి పెట్టే ట్వీట్లపై ఇరు పార్టీల్లోనూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇదే క్రమంలో తాజాగా సొంత నియోజకవర్గం కుప్పంలో ఇల్లు కట్టుకునేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలపై వైసీపీ ఎంపీ సాయిరెడ్డి ఇవాళ ట్వీట్లో సెటైర్లు వేశారు.
2019 ఎన్నికల్లో ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వీచిన వైసీపీ గాలిలో చంద్రబాబు తనతో పాటు మరో 22 మందిని మత్రమే గెలిపించుకోగలిగారు. ఆ తర్వాత కుప్పంపైనా ఫోకస్ పెట్టిన వైసీపీ.. స్ధానిక ఎన్నికల్లో వరుస విజయాలతో చంద్రబాబు ఉనికిని ప్రశ్నార్ధకంగా మార్చేసింది. దీంతో సొంత నియోజకవర్గంపై దృష్టి పెట్టకపోతే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయే పరిస్దితి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ మధ్య వరుసగా కుప్పంలో పర్యటనలు చేస్తుూన్న చంద్రబాబు ఇప్పుడు ఇల్లు కట్టుకునేందుకు కూడా సిద్ధమయ్యారు. దీనిపై వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.

ఇదే క్రమంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా చంద్రబాబు ఇంటి నిర్మాణాన్ని ఉద్దేశించి ట్వీట్ చేశారు. 30 ఏళ్ల తర్వాత ఇప్పుడు కుప్పంలో ఇల్లు కట్టుకుంటాడట.. ఏడుసార్లు గెలిపించిన కుప్పం గ్రామాల పేర్లు తెలియదు. ఎవరో రాసిచ్చిన కాగితం చూసి చదువుతున్నాడంటూ ట్వీట్ లో చంద్రబాబుపై సాయిరెడ్డి సైటెర్లు వేశారు. సమీకరించిన జనం తప్ప స్వచ్ఛందంగా ఎవరూ రావడం లేదన్నారు. జనాల బాదుడు చూసి వాస్తవంలోకి వచ్చినట్లున్నాడని, దింపుడు కల్లం ఆశ ఇలాగే ఉంటుందని సాయిరెడ్డి ట్వీట్లో రెచ్చిపోయారు.