నారాయణ అరెస్టు కథకు జనాన్ని నిద్రలేపాలా ? చంద్రబాబు-పవన్ భల్లూకం కథ-సాయిరెడ్డి ట్వీట్స్
ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగుతున్న రాజకీయాల్లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబును టార్గెట్ చేసుకుని పెట్టే ట్వీట్లు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. ఇందులో సాయిరెడ్డి సంధించే సెటైర్లకు టీడీపీ నేతల నుంచి ఘాటు కౌంటర్లు కూడా పడుతూనే ఉంటాయి. అయినా సాయిరెడ్డి మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గినట్లు కనిపించరు. తాజాగా చంద్రబాబును టార్గెట్ చేస్తూ సాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు.
తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్నారు. కుప్పం పరిధిలోకి వచ్చే గ్రామాల్లో చంద్రబాబు పర్యటిస్తూ వైసీపీ సర్కార్ వైఫల్యాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే క్రమంలో మాజీ మంత్రి, ఆయన మాజీ కేబినెట్ సహచరుడు నారాయణను పదో తరగతి పరీక్షా పత్రం లీక్ కేసులో జగన్ సర్కార్ అరెస్టు చేయడాన్ని తప్పుబట్టారు. దీన్ని టార్గెట్ చేస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ ట్వీట్ లో సెటైర్లు వేశారు.

కుప్పంలోని బోయినపల్లెకు చంద్రబాబు రాత్రి 10 గంటలకు వెళ్లారని, బాబు వచ్చారంటూ ఆక్కడి జనాన్ని స్ధానిక టీడీపీ నేతలు నిద్రలేపి తరలించారని, తీరా అక్కడికి వెళ్తే నారాయణను ఎలా అరెస్టు చేస్తారని వారిని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారని సాయిరెడ్డి ట్వీట్ లో పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా శ్రీలంకలోలా జనం తిరగబడాలని సందేశం కూడా ఇచ్చివచ్చారని చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ఇదేం హింస బాబూ అంటూ ఆయన్ను సాయిరెడ్డి ట్వీట్ లో ప్రశ్నించారు.
మరో ట్వీట్ లో ఓసారి పులి తరిమితే బాబు చెట్టెక్కారని, పైన ఎలుగుబంటి కనిపించిందని, గతంలో తనకు ద్రోహం చేశాడు కాబట్టి కిందకు తరిమేయమని పులి భల్లూకాన్ని కోరిందని సాయిరెడ్డి పేర్కొన్నారు. అయినా నా ఇంటికొచ్చాడు కాబట్టి హాని చేయనని భల్లూకం చెప్పిందని, బాబుతో పొత్తుపెట్టుకుంటే జరిగేది ఇదే అని పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి సాయిరెడ్డి వ్యాఖ్యలు చేశారు.

విపక్ష నేత చంద్రబాబు వైసీపీ ప్రారంభించిన గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమానికి ముందే బాదుడే బాదుడు కార్యక్రమంతో జనంలోకి వెళ్తున్నారు. దీనిపై మంచి స్పందనే వస్తోంది. అయితే పొత్తులపై చంద్రబాబు, పవన్ చేసిన వ్యాఖ్యలతో వారు ఒక్కసారిగా వైసీపీకి టార్గెట్ గా మారిపోయారు. ఇప్పుడు చంద్రబాబుతో పాటు పవన్ నూ వైసీపీ నేతలు ఉమ్మడిగా టార్గెట్ చేస్తున్నారు. ఇదే క్రమంలో చంద్రబాబు వ్యాఖ్యల్ని తప్పుబడుతూ సాయిరెడ్డి ట్వీట్లు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications