జగన్ వచ్చాక లక్షల్లో ఉద్యోగాలు-జాబ్ మేళాలో విజయసాయిరెడ్డి కితాబు...
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. గుంటూరు నాగార్జున యూనివర్శిటీలో మెగా జాబ్‌మేళాను సాయిరెడ్డి ఇవాళ ప్రారంభించారు. తాము గత సంవత్సరంలో ఇక్కడే వైఎస్‌ఆర్‌సీపీ తరఫున జాబ్ మేళా నిర్వహించామని, తాము నాంది పలికిన ఈ కార్యక్రమాన్ని యూనివర్శిటీ వీసీ కొనసాగించడం సంతోషంగా ఉందన్నారు.
మెగా జాబ్ మేళాకు హాజరైన వారికి ఇంటర్వ్యూల్లో ప్రశ్నలకు ఎటువంటి బెరుకు లేకుండా ధైర్యంగా సమాధానాలివ్వాల్సి ఉంటుందని సాయిరెడ్డి తెలిపారు. అలాగే ఇంటర్వ్యూ చేసే వారిని మెప్పించేందుకు అవసరమైన కమ్యూనికేషన్స్ స్కిల్స్ పట్ల విద్యార్థులు శ్రద్ధతీసుకోవాలన్నారు. లాంగ్వేజెస్‌లో కమ్యూనికేషన్స్ స్కిల్స్‌ను ఎంతగా ఇంప్రూవ్ చేసుకుంటారో.. మీ భవిష్యత్ అంత బాగుంటుందన్నారు. అనుకున్నది ఎఫెక్టివ్‌గా చెప్పడం, ఎదుటివారికి అర్ధమయ్యేలా మీ అభిప్రాయాన్ని వివరించడమనేది కమ్యూనికేషన్స్ స్కిల్స్‌లో ముఖ్యమన్నారు.

ఉమ్మడి ఏపీలో 13 జిల్లాలు ఉంటే అందులో నాలుగు జిల్లాల్లో ఇప్పటికే జాబ్ మేళాలు నిర్వహించామని, మిగతా 9 చోట్ల త్వరలో నిర్వహిస్తామని సాయిరెడ్డి తెలిపారు. ఈ జాబ్‌మేళాల్లో ఆయా జిల్లాల విద్యార్థులు గానీ, ప్రస్తుతం ఇక్కడకొచ్చి అవకాశాలు రాని విద్యార్థులు కూడా పాల్గొనవచ్చన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక 1.75 లక్షల మందికి సచివాలయ ఉద్యోగాలు, జాబ్ మేళాల ద్వారా మరో 40 వేల ఉద్యోగాలు కల్పించామన్నారు. వచ్చే ఏడెనిమిది నెలల కాలంలో మరో 9 చోట్ల మెగా జాబ్‌మేళాలను నిర్వహించి కనీసం 50 వేల నుంచి 60 వేల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.
రాష్ట్రంలో ఎక్కడా నిరుద్యోగ సమస్య అనేది ఉండకూడదని, చదువుకున్న ప్రతీ యువకుడికి ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉండాలనేది సీఎం జగన్ తపన అని సాయిరెడ్డి తెలిపారు. అలాంటి ధృఢనిశ్చయంతో పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి ఆలోచనకు తగ్గట్టు మనవంతు భాగస్వామ్యంతో ఉద్యోగవకాశాల్ని సద్వినియోగం చేసుకుందామన్నారు. ఉద్యోగ, ఉపాధిరంగాల్లో మరింత మెరుగైన రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకుందాం అని పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications