ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు 9 నెలల ముందు..: సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు, పార్లమెంటరీ పార్టీ చీఫ్ వీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రం సంక్షేమాభివృద్ధి రంగాల్లో పరుగులు పెడుతోందని అన్నారు.
సాధారణంగా ఎన్నికల ఏడాదిలో ప్రవేశించినప్పుడు ఏ రాష్ట్రంలో అయినా అధికార పార్టీలో ఆందోళనకర పరిస్థితులు నెలకొంటూ ఉంటాయని, ఏపీలో మాత్రం దీనికి పూర్తిగా భిన్నమైన వాతావరణం నెలకొందని చెప్పారు. ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గం, అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్తి విశ్వాసంతో, ఎన్నికల కోసం ఎదురు చూస్తోన్నారని అన్నారు.

2019 ఎన్నికల ప్రచార సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో 98 శాతం నెరవేర్చామని విజయసాయి రెడ్డి గర్తు చేశారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించి అన్ని రంగాల్లోనూ తమ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పుల వల్ల రాష్ట్రం 11.23 శాతం వృద్ధిని నమోదుచేసుకుందని, ఏ ఇతర రాష్ట్రాల్లో ఈ స్థాయి గణాంకాలు లేవని చెప్పారు.
వివిధ సంక్షేమ పథకాల కింద లబ్దిదారులకు 1,97,473 కోట్ల రూపాయలను ప్రభుత్వం అందజేసిందని, ఇది సరి కొత్త రికార్డు అని వివరించారాయన. తెలుగుదేశం హయాంలో రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలు ఉండగా ఇప్పుడు కొత్తగా 17 వైద్య కళాశాలలను ప్రభుత్వం నిర్మిస్తోందని అన్నారు. ఈ క్రమంలో వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాల అభివృద్ధి సమంగా జరిగేలా చర్యలు తీసుకుంటోందని సాయిరెడ్డి చెప్పారు.

కోస్తా తీరం పొడవునా విశాఖపట్నం- చెన్నై పారిశ్రామిక కారిడార్ నిర్మాణం పూర్తయితే దక్షిణాదిలోనే ఏపీ అత్యుత్తమ పారిశ్రామిక కేంద్రంగా మారుతుందని సాయిరెడ్డి అన్నారు. ఈ కోస్తా కారిడార్ అభివృద్ధి ప్రణాళికలో విశాఖపట్నం, మచిలీపట్నం, దొనకొండ, ఏర్పేడు-శ్రీకాళహస్తి పారిశ్రామిక కేంద్రాలు మారుతాయని పేర్కొన్నారు.
2019 నాటికి 1,10,000 వరకు మాత్రమే ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సంఖ్య ఈ నాలుగేళ్లలో 1,56,000కు పెరిగిందని అన్నారు. అధికార వికేంద్రీకరణ, ప్రజా సేవల విస్తరణలో భాగంగా ఏర్పాటు చేసిన 15,000 పైగా గ్రామ, వార్డు సచివాలయాలు, దాదాపు 11 వేల రైతు భరోసా కేంద్రాలు ప్రజలకు 600లకు పైగా పౌర సేవలు అందిస్తున్నాయని చెప్పారు.












Click it and Unblock the Notifications