చంద్రబాబు 'పొత్తు'తిరుగుడు పువ్వు; పార్టీల గడప గడపకూ టీడీపీ: పరువు తీస్తున్న సాయిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య తాజా పరిణామాల నేపథ్యంలో మాటల తూటాలు పేలుతున్నాయి. టిడిపి వర్సెస్ వైసీపీ అన్నట్టుగా ఏపీలో పొలిటికల్ రచ్చ కొనసాగుతుంది. తాజాగా తెలుగుదేశం పార్టీ పొత్తులపై వైసిపి, వైసిపి సర్కార్ నిర్వహిస్తున్న గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంపై తెలుగుదేశం పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నాయి. ఇక తెలుగుదేశం పార్టీ పై మాటల దాడి చేయడంలో ముందువరుసలో నిలిచే వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా మరోమారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
బాదుడే బాదుడు అని మీరు ప్రోగ్రాం పెడితే జనం మిమ్మల్ని బాదడం ఏందయ్యా
తాజాగా బాదుడే బాదుడు కార్యక్రమంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మండిపడిన విజయసాయిరెడ్డి తుక్కుతుక్కుగా ఓడి మూడేళ్లయినా చంద్రబాబుకు బుద్ది రాలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఉప్పూ, కారం తినడంలేదా? ఈ ప్రభుత్వంపై మీకెందుకు కోపం రావడం లేదు అంటూ అర్ధరాత్రి ప్రజలపై చిందులేస్తున్నాడు. బాదుడే బాదుడు కార్యక్రమంలో బాబునే జనం బాదుతుండటంతో ఆయన ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు పోతోందని విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో నాకౌట్ పేరుతో గతంలో చంద్రబాబు వద్దకు మహిళలు వెళ్లి ఏడ్చిన ఫోటోను, చంద్రబాబు ఏడుస్తున్న ఫోటోలను కలిపి పోస్ట్ చేసిన విజయసాయిరెడ్డి బాదుడే బాదుడు అని మీరు ప్రోగ్రాం పెడితే జనం మిమ్మల్ని బాదడం ఏందయ్యా అంటూ మహిళలు ఏడుస్తున్నట్లుగా పోస్ట్ పెట్టి సెటైర్ వేశారు.
పొత్తుల కోసం చంద్రబాబు వెంపర్లాట పై సాయిరెడ్డి పొలిటికల్ మిర్చి
ఇక పొలిటికల్ మిర్చి అంటూ చేసిన మరో పోస్టులో విజయసాయిరెడ్డి పొద్దు ఎటు ఉంటే అటు వైపు తిరిగే పొద్దు తిరుగుడు పువ్వు.. పొత్తుకు ఎక్కడ అవకాశం ఉంటే అటు తిరిగే పొద్దు తిరుగుడు పువ్వు అంటూ.. చంద్రబాబు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని టార్గెట్ చేశారు. అంతేకాదు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో వైసీపీ మంత్రులు, నేతలు ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటుంటే చంద్రబాబు మాత్రం బలం లేక పొత్తు కోసం ప్రతి పార్టీ గడపగడపకు టిడిపి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు.
నమ్ముతారో నవ్వుతారో మీ ఇష్టం అంటూ ఆసక్తికర పోస్ట్
ఇక మరో ఆసక్తికరమైన పొలిటికల్ మిర్చి పోస్టులో నమ్ముతారో నవ్వుతారో మీ ఇష్టం అంటూ పేర్కొన్న విజయసాయిరెడ్డి నారాయణ విద్యాసంస్థల తో నారాయణ కు సంబంధం ఉండదు. ఓటుకు నోటు కేసు తో చంద్రబాబు కు సంబంధం ఉండదు. హెరిటేజ్ తో నారా ఫ్యామిలీ కి సంబంధం ఉండదు. పచ్చ పార్టీ కి పచ్చ మీడియా తో సంబంధం ఉండదు అంటూ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. తెలుగుదేశం పార్టీ పై, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై నిత్యం విమర్శలు గుప్పిస్తున్న విజయసాయిరెడ్డి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పొలిటికల్ హీట్ ను మరింత పెంచుతున్నారు.












Click it and Unblock the Notifications