నిమ్మగడ్డ ఓ మెంటల్ కేసు.. ఎస్ఈసీగా పనికిరాడు.. చంద్రబాబే లకలకా అనిపిస్తున్నారు : విజయసాయి రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. నిమ్మగడ్డ ఓ మెంటల్ కేసు అని... ఆయన మానసిక స్థితి సరిగా లేదని విమర్శించారు. అలాంటి వ్యక్తి అసలు రాజ్యాంగబద్దమైన పదవిలో ఉండకూడదని అన్నారు. నిమ్మగడ్డ మానసిక స్థితి సరిగా ఉందా లేదా అన్న దానిపై మెడికల్ బోర్డుతో విచారణ జరగాలన్నారు. ఎస్ఈసీ ఉద్యోగానికి నిమ్మగడ్డ పనికిరారని అన్నారు. కలెక్టర్లు,ఎస్పీలు,పంచాయతీ రాజ్ కమిషనర్,ముఖ్య కార్యదర్శిలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీ కోరడాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు.

చంద్రబాబుపై చర్యలు తీసుకోరా...?
నిమ్మగడ్డ రమేష్ కుమార్‌లో చంద్రబాబు చంద్రముఖి రూపంలో ప్రవేశం చేశాడని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. శరీరం మాత్రమే నిమ్మగడ్డది అని... చంద్రముఖి రూపంలో ఆయనలో దాగున్న చంద్రబాబు లకాలకా అనిపిస్తున్నాడని ఎద్దేవా చేశారు.ప్రతీరోజూ ప్రెస్ మీట్లు పెట్టి అందరినీ బెదిరింపులకు గురిచేసే నిమ్మగడ్డ... చంద్రబాబు టీడీపీ మేనిఫెస్టోని ప్రకటిస్తే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికలు పార్టీల రహితంగా జరుగుతాయని తెలిసి కూడా మేనిఫెస్టో విడుదల చేయడంపై నిమ్మగడ్డ చర్యలు తీసుకోరా అని నిలదీశారు.

కులపిచ్చి,చంద్రబాబు తొత్తు...
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని తొలగించమని గవర్నర్‌కు లేఖ రాసిన నిమ్మగడ్డ... ఆయనకు నిజంగా చిత్తశుద్ది ఉంటే చంద్రబాబుపై చర్యలేవీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2018లో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఈ మూడేళ్లు నిమ్మగడ్డ కళ్లు మూసుకుని ఉన్నారా అని విమర్శించారు. నిమ్మగడ్డ చంద్రబాబు తొత్తు అని... ఆయన చేసే ప్రతీ పని,కార్యక్రమం చంద్రబాబుకు మేలు చేసేదిగానే ఉంటుందని విమర్శించారు. ప్రవచనాలు చెప్పడంలో నిమ్మగడ్డ చాగంటిని,గరికపాటిని మించిపోయారని ఎద్దేవా చేశారు. నిమ్మగడ్డ కులపిచ్చి వ్యక్తి అని... మెంటల్ కేసు అని తీవ్ర విమర్శలు చేశారు. ఎర్రగడ్డకు తరలించాల్సిన లక్షణాలు ఆయనలో చాలానే ఉన్నాయన్నారు.

బడ్జెట్ సమావేశాలపై విజయసాయి..
ఇక బడ్జెట్ సమావేశాల గురించి మాట్లాడుతూ... ఈసారి ప్రవేశపెట్టబోయే బడ్జెట్ అభివృద్దికి పెద్దపీట వేసేలా ఉండాలని తాము ఆకాంక్షిస్తున్నామన్నారు. వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలన్నారు. అలాగే అప్పులు చేసైనా సరే పారిశ్రామిక,వ్యవసాయ,సేవా రంగంలో ప్రభుత్వం ఎక్కువగా ఖర్చు పెట్టాలన్నారు. తద్వారా ఆ డబ్బు చలామణిలోకి వస్తుందని... ఆ సొమ్ముతో ప్రతీ ఒక్కరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. 'నేషనల్ కమిషన్ ఫర్ ఫార్మర్స్' ఏర్పాటుకై ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. అలాగే నదుల అనుసంధానం ద్వారా ప్రతీ 15 రోజులకు ఒకసారి ప్రాజెక్టుల్లో ఇన్‌ఫ్లోని పరిశీలించి... ఆయా రాష్ట్రాల భౌగోళికత ఆధారంగా నీటి కేటాయింపులు జరపాలని కేంద్రాన్ని తాము కోరబోతున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications