YV Subba Reddy: వైవీ సుబ్బారెడ్డికి హైకోర్టులో భారీ ఊరట..! సర్కార్ కు కీలక ఆదేశం..!
ఏపీలో తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం నేపథ్యంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కూటమి సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వంలో భారీ భద్రత నడుమ కొనసాగిన వైసీపీ కీలక నేతలందరికీ వరుసగా భద్రతను ఉపసంహరిస్తోంది. ఇందులో భాగంగా అప్పట్లో జగన్ చుట్టూ ఉంటూ చక్రం తిప్పిన సజ్జల, పెద్దిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి వంటి వారికి భద్రతను తగ్గించడమూ, పూర్తిగా ఉపసంహరించడమో చేసింది. దీనిపై వీరు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు.
ఇదే క్రమంలో తన భద్రతను 2 ప్లస్ 2 నుంచి 1 ప్లస్ 1 కు తగ్గిస్తూ కూటమి సర్కార్ తీసుకున్న నిర్ణయంపై వైసీపీ రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనకు ఎప్పటిలాగే 2 ప్లస్ 2 భద్రత కల్పించాలన కోరారు. అయితే ప్రభుత్వం మాత్రం వైవీ సుబ్బారెడ్డి భద్రతకు ఎలాంటి ముప్పు లేదని, అలాంటి ఆధారాలు కూడా లేవని వాదించింది. కానీ ఎంపీగా తనకు 2 ప్లస్ 2 భద్రత అవసరమని సుబ్బారెడ్డి లాయర్లు వాదించారు. దీనిపై హైకోర్టు స్పందించింది.

వైవీ సుబ్బారెడ్డికి నాలుగు వారాల పాటు 2 ప్లస్ 2 భద్రత కొనసాగించాలని హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర పోలీసులు ప్రస్తుతం వైవీ సుబ్బారెడ్డికి ఉన్న 2 ప్లస్ 2 భద్రత కొనసాగించాల్సి ఉంటుంది. నాలుగు వారాల తర్వాత హైకోర్టు దీనిపై విచారణ కొనసాగించి తదుపరి నిర్ణయం తీసుకోనుంది. వైసీపీలో ఇతర కీలక నేతలతో పోలిస్తే సుబ్బారెడ్డికి మాత్రమే ఈ మాత్రం భద్రత కొనసాగింపు ద్వారా ఊరట లభించినట్లయింది.












Click it and Unblock the Notifications