ఏపీలోనూ త్వరలో ఎస్ఐఆర్..! వైసీపీ నేతలకు సజ్జల బిగ్ అలర్ట్..!
బీహార్ తరహాలో ఏపీలోనూ త్వరలో ఎన్నికల ఓటర్ల జాబితాల సవరణకు ఈసీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో విపక్ష వైసీపీ అలర్ట్ అయింది. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీకి అనుకూలంగా పనిచేస్తూ విపక్షాల ఓటర్లను ఈసీ టార్గెట్ చేస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో వైసీపీ తమ నాయకుల్ని అప్రమత్తం చేస్తోంది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఇందులో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ల నియామకంపై పార్టీ నాయకులంతా సీరియస్‌గా దృష్టిపెట్టాలని సజ్జల సూచించారు. ఎన్నికల కమిషన్ కూడా దీనిపై దృష్టిపెట్టిందని, దేశమంతా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయబోతున్నారని ఆయన తెలిపారు. ఇందులో పోలింగ్ బూత్ నెంబర్, లొకేషన్, పోలింగ్ బూత్‌లకు అనుసంధానించిన ఓటర్ల రీలొకేషన్ వంటి కీలక అంశాలపై ఇప్పటికే అధికారుల నుంచి రాజకీయ పార్టీలకు సమాచారం వచ్చిందన్నారు.

అనంతపురం జిల్లాలో మొత్తం 330 పోలింగ్ బూత్‌లు పెరుగుతున్నాయని, ఏ బూత్ లోనైనా ఓటర్లు ఎక్కువగా ఉంటే అందులో నుంచి కొంతమందిని కొత్త బూత్‌లోకి మార్చడం వంటి ప్రతిపాదనలు సిద్దమయ్యాయన్నారు. దీనిపై అధినేత జగన్ అందరూ అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే చెప్పారని, మనమంతా పూర్తి అవగాహనతో ఉండాలన్నారు. ఓటర్ల జాబితాలకు సంబంధించి బూత్ లెవల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని, వీరంతా బూత్ లెవల్ ఆఫీసర్‌తో సమన్వయం చేసుకుంటూ ఉండాలన్నారు. ఏ మాత్రం ఏమరుపాటు వద్దన్నారు.
బూత్ కమిటీలను నియమించుకోవడం ప్రధాన కర్తవ్యమని, ఓటర్ లిస్ట్‌పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని నేతల్ని సజ్జల కోరారు. ఇప్పటినుంచే దీనిపై దృష్టిపెట్టినప్పుడే ఎన్నికల సమయంలో కీలకంగా ఉపయోగపడుతుందన్నారు. గ్రౌండ్ లెవల్‌లో బలంగా ఉండాలని, దీనికి సంబంధించి కేంద్ర కార్యాలయం నుంచి ఇప్పటికే అందరికీ సమాచారం ఇచ్చామన్నారు. ఆగష్టు 31 నాటికి బూత్‌లెవల్ ఏజెంట్ల పేర్ల జాబితాలను కేంద్ర కార్యాలయానికి పంపాలన్నారు. సమర్ధులైన, ఉత్సాహవంతులైన వారిని గుర్తించి నియమించాలన్నారు.

అలాగే 20 బూత్‌లకు ఒక సీనియర్ లీడర్‌ను నియమించుకుని టాస్క్‌ఫోర్స్ టీమ్ ఏర్పాటు చేసుకోవాలని, ఓటర్ల జాబితాలో ఏ మార్పులు జరిగినా వెంటనే తెలుస్తుందని, పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సీనియర్ లీడర్స్ సహకారం ఉంటుందని సజ్జల వారికి తెలిపారు. అనంతరం టెలికాన్ఫరెన్స్‌లో పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మాట్లాడారు. బూత్ లెవల్ ఏజెంట్లకు సంబంధించిన విధులు, పార్టీ గైడ్‌లైన్స్ అందరూ పాటించాలన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులు కలెక్టరేట్‌తో సమన్వయం చేసుకుంటే మరింత ఉపయోగకరంగా ఉంటుందన్నారు. దీనిపై అప్రమత్తంగా ఉండాలన్నారు.












Click it and Unblock the Notifications