రఘురామ నిర్ణయంలో సడన్ ఛేంజ్ - ఢిల్లీలో మారుతున్న సమీకరణాలు : వైసీపీ ధీమా అదే..!!
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ తన నిర్ణయం మార్చుకున్నారు. మారుతున్న సమీకరణాలతో రఘురామ సైతం తన నిర్ణయాల్లో మార్పులు చేస్తున్నారు. ఇప్పటి వరకు రఘురామ రాజు వైసీపీకి పదే పదే ఒక సవాల్ చేస్తూ వచ్చారు. పార్లమెంట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం అవుతున్న వేళ... ఫిబ్రవరి 5వ తేదీ వరకు వైసీసీకి సమయం ఇస్తున్నానని..ఈ లోగా తన పైన అనర్హత వేటు పడేలా ప్రయత్నం చేసుకోవాలని సవాల్ చేసారు. లేకుంటే, తాను 5వ తేదీన రాజీనామా చేస్తానని.. నర్సాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. కానీ, ఇప్పుడు నిర్ణయం మారింది.

మారుతున్న సమీకరణాలు
అయితే, వైసీపీ కొంత కాలంగా పార్టీ ఫిరాయింపు చట్టం కింద ఎంపీ రఘురామ మీద అనర్హత వేటు వేయాంటూ లోక్ సభ స్పీకర్ కు అనేక ఫిర్యాదులు చేసింది. ఆధారాలు ఇచ్చింది. దీంతో..తాజాగా స్పీకర్ వైసీపీ ఇచ్చిన ఫిర్యాదును ప్రివిలేజ్ కమిటీకి పంపారు. దీని పైన విచారించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దీని పైన రఘురామ స్పందించారు. వైసీపీ ఇచ్చిన ఫిర్యాదు పైన ప్రివిలేజ్ కమిటీని స్పీకర్ నివేదిక కోరటంతో..ప్రివిలేజ్ కమిటీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు హాజరై తాను చెప్పదలచుకున్నది చెబుతానని స్పష్టం చేసారు. ఒక వేళ వైసీపీ నేతలు చెబుతున్నట్లుగా... ప్రివిలేజ్ కమిటీ తనకు వ్యతిరేకంగా నివేదిక ఇస్తే...తన పైన వేటు వేస్తారని..అయితే, తాను ఇప్పటికే రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకోవటంతో దానిని సీరియస్ గా తీసుకోవాల్సిన అసవరం లేదని చెప్పుకొచ్చారు.

11వ తేదీకి రాజీనామా మార్పు
ఇదే సమయంలో తనకు నోటీసు ఇచ్చిన అంశం పైన ప్రచారం చేస్తున్న వైసీపీకి...పార్లమెంట్ తొలి విడత సమావేశాలు జరిగే ఫిబ్రవరి 11వ తేదీ వరకు సమయం ఇస్తున్నట్లుగా తాజాగా వెల్లడించారు. వచ్చే నెల 11వ తేదీ లోగా తన పైన అనర్హత వేటు పడేలా వైసీపీ నేతలు ప్రయత్నాలు చేసుకోవచ్చన్నారు. అప్పటికీ సాధ్యం కాకుంటే ఆ తరువాత తాను రాజీనామా చేస్తానని స్పష్టం చేసారు. అయితే, ఢిల్లీలో సమీకరణాలు వేగంగా మారుతున్నట్లుగా కనిపిస్తోంది. రఘురామకు గతంలో ఉన్న అనుకూల పరిస్థితులు ఇప్పుడు లేవని వైసీపీ నేతలు చెబుతున్నారు.

వైసీపీ సైతం వ్యూహాత్మకంగా
అసలు రఘురామ రాజీనామా చేసిన తరువాత మాత్రమే నర్సాపురం ఉప ఎన్నిక గురించి మాట్లాడుదామంటూ వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. గతంలో రఘురామ తనను అరెస్ట్ చేసిన సమయంలో తనతో వ్యవహరించిన తీరు పైన స్పీకర్ కు ఫిర్యాదు చేసారు. దాని పైన ఇప్పటి వరకు చర్యలు లేవని..అదే సమయంలో తెలంగాణ బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఇటువంటి ఫిర్యాదే చేయగానే.. వెంటనే స్పందించారని చెబుతున్నారు. దీంతో... రఘురామ రాజీనామా అంశం ప్రస్తుతం ఫిబ్రవరి 11వ తేదీకి వాయిదా పడింది. ఇప్పటికే తాను నర్సాపురం నుంచి పోటీ చేయటం ఖాయమని రఘురామ పదే పదే చెబుతున్నారు. అన్ని పార్టీలు.. ప్రజలు తనకు మద్దతుగా నిలవాలని కోరుతున్నారు.

ప్రతిష్ఠాత్మకంగా నర్సాపురం బై పోల్
అయితే, అసలు రఘురామ రాజీనామా చేయరంటూ వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. తాను పోటీ చేసినా గెలుపు తనదే అంటూ రఘురామ ధీమా వ్యక్తం చేస్తున్నారు. తనకు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న అన్ని పార్టీలు మద్దతుగా నిలుస్తాయని అంచనా వేస్తున్నారు. ఇటు వైసీపీ సైతం రఘురామ నిర్ణయాలను జాగ్రత్తగా గమనిస్తోంది. నర్సాపురం ఉప ఎన్నిక గురించి ఇప్పటికిప్పుడు స్పందించాల్సిన అవసరం లేదని భావిస్తోంది. దీంతో..పార్లమెంట్ సమావేశాల్లోనూ.. ఆ తరవాత రఘురావ వర్సెస్ వైసీపీ ఎంపీల అడుగులు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తి కరంగా మారుతున్నాయి.












Click it and Unblock the Notifications