జగన్ ను జనంలోకి రాకుండా ఆపుతుందెవరు - తెర వెనుక.!!
ఏపీలో రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న కూటమి పార్టీలు వైసీపీని లక్ష్యంగా చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం పైన ఊహించని వ్యతిరేకత ఉందనేది మాజీ సీఎం జగన్ అంచనా. ప్రభుత్వం ఇచ్చిన హామీలు విస్మరించి.. రెడ్ బుక్ పాలన కే పరిమితం అయిందని జగన్ ప్రతీ సందర్భంలో విమర్శిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలకు నిర్ణయిస్తున్నారు. జగన్ మాత్రం బయటకు రావటం లేదు. కొందరి సలహాలను జగన్ పాటిస్తున్నారనే చర్చ మొదలైంది. ఇంతకీ అసలు ఏం జరుగుతోంది..
ఓటమి తరువాత
2024 ఎన్నికల్లో పరాజయం తరువాత జగన్ లో మార్పు రావాలని పార్టీ నేతలు కోరుకున్నారు. జగన్ సైతం తాను అధికారంలో ఉన్న సమయంలో పార్టీ కార్యకర్తలను పట్టించుకోలేదని.. ఈ సారి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇస్తున్నారు. దాడులకు గురైన కార్యకర్తలను గతం కంటే భిన్నంగా పరామర్శిస్తున్నారు. ప్రభుత్వం పైన గతంలోనూ జగన్ రైతులు, విద్యార్ధుల సమస్యల పైన నిరసనలకు పిలుపు ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయని కారణంగా జూన్ 4న వెన్నుపోటు దినం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు నిర్వహించాలని జగన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు పార్టీ ముఖ్య నేతలు పోస్టుర్లు విడుదల చేసారు. అన్ని మండలా కేంద్రాల నుంచి జిల్లా స్థాయి వరకు నిరసనలు నిర్వహిస్తామని ప్రకటించారు.

ప్రకటనలకే పరిమితం
అయితే, కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయినా పరామర్శలకు మినహా.. ప్రజా సమస్యల పై జగన్ బయటకు రాలేదు. కేవలం ట్వీట్ల ద్వారా తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. పార్టీ నేతల సమావేశాల్లో ప్రభుత్వానికి వార్నింగ్ లు ఇస్తున్నారు. సంక్రాంతి నుంచే జిల్లాల పర్యటన లు.. కార్యకర్తలతో సమావేశాలు ఉంటాయని గతంలో ప్రకటించారు. ఇప్పటి వరకు అవి ఎప్పుడు మొదలవుతాయనేది స్పష్టత లేదు. వారంలో మూడు రోజులు మాత్రమే తాడేపల్లిలో అందుబాటు లో ఉంటున్నారు. ఇక, ఏడాది పూర్తయిన వేళ నిర్వహిస్తున్న వెన్నుపోటు దినం నిరసనలోనూ జగన్ పాల్గొనే అవకాశం కనిపించటం లేదు. అసలు జగన్ బయటకు వచ్చి.. రాష్ట్రంలో ఏ ప్రాం తంలో అయినా భారీ ధర్నా నిర్వహించాల్సిన అవసరం ఉందని పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. దీని ద్వారా పార్టీలో కొత్త జోష్ రావటంతో పాటుగా ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతందని విశ్లేషణ చేస్తున్నారు.
జనంలోకి ఎప్పుడు
జగన్ మాత్రం ఇంకా సమయం ఉందనే ధోరణితో వ్యవహరిస్తున్నారు. 2014-19 కాలంలో ప్రతిపక్ష నేతగా జగన్ ఎంత దూకుడుగా వ్యవహరించిదీ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. అనేక అంశాల పైన జగన్ దీక్షలు.. ధర్నాల్లో పాల్గొన్నారు. ప్రజలతో మమేకం అయ్యే కార్యక్రమాలు నిర్వ హించారు. ముఖ్యమంత్రి అయిన తరువాత జగన్ నేరుగా జనంతో కలిసే అవకాశం విస్మరించారు. పార్టీ కేడర్ కు అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు అధికారం కోల్పోయి ఏడాది పూర్తయింది. ఇంకా, జగన్ తాడేపల్లి - బెంగళూరుకే పరిమితం కావటం పైన పార్టీలో చర్చ జరుగుతోంది. జగన్ లో వచ్చిన మార్పు కేవలం ప్రకటలకే పరిమితం కావటమా అనే డౌట్ మొదలైంది. జగన్ నమ్మిన నేతలే జగన్ కు ఇప్పుడే ప్రజల్లోకి వద్దని సలహాలు ఇచ్చి ఆపుతున్నారనే చర్చ వినిపిస్తోంది. మరి.. జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications