Botsa Satyanarayana: బొత్స హెల్త్ అప్ డేట్ ఇదే-వైసీపీ ట్వీట్..!
ఏపీలో వైసీపీ సీనియర్ నేతల్లో ఒకరైన ఉత్తరాంధ్ర నాయకుడు బొత్స సత్యనారాయణ ఇవాళ అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. విశాఖలో పార్టీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న వెన్నుపోటు దినం నిరసనల్లో పాల్గొంటున్న సమయంలో బొత్స అకస్మాత్తుగా కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో వైసీపీ నేతలు ఆయన్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. ఈ నేపథ్యంలో ఆందోళనలో ఉన్న పార్టీ శ్రేణులకు ఊరట కలిగించేలా వైసీపీ బొత్స హెల్త్ అప్ డేట్ ను వెల్లడించింది.
బొత్స సత్యనారాయణ తాజా ఆరోగ్య పరిస్ధితిపై వైసీపీ కొద్దిసేపటి క్రితం ఓ ట్వీట్ చేసింది. ఇందులో ఆయన ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించింది. అంతే కాదు ఆస్పత్రిలో బొత్స నడుస్తూ మాట్లాడుతున్న వీడియోను సైత పోస్ట్ చేసింది. దీంతో బొత్స హెల్త్ అప్ డేట్ పై వైసీపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే బొత్స ఆరోగ్య పరిస్ధితిపై పదుల సంఖ్యలో ఫోన్లు వస్తుండటంతో వైసీపీ అధికారికంగా వివరాలు వెల్లడించి వారికి ఊరటనిచ్చింది.

Botsa Satyanarayana Garu is fine. pic.twitter.com/F3uSKSGIlW
— YSR Congress Party (@YSRCParty) June 4, 2025
బొత్స సత్యనారాయణ గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక ఆయన్ను వైసీపీ ఎమ్మెల్సీగా గెలిపించుకుని మండలిలో విపక్ష నేత హోదా కూడా ఇచ్చింది. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలకంగా ఉన్న బొత్స సత్యనారాయణకు గతంలో గుండె ఆపరేషన్ కూడా జరిగింది. దీంతో ఇవాళ ఆయన కుప్పకూలగానే ఏం జరిగిందో తెలియక వైసీపీ శ్రేణులు కాసేపు టెన్షన్ పడ్డాయి. చివరికి విశాఖలో ఆస్పత్రిలో ప్రాధమిక చికిత్స అందించిన తర్వాత ఆయన కోలుకున్నట్లు తెలుస్తోంది. ఆయన ఆస్పత్రి నుంచి ఎప్పుడు డిశ్చార్జ్ అయి ఇంటికి తిరిగి వెళ్తారో ఇంకా డాక్టర్లు వెల్లడించలేదు.












Click it and Unblock the Notifications