అందరి దృష్టీ రఘురామ కృష్ణంరాజు మీదే - ఏం చేయబోతున్నారు..!!
అమరావతి/హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ కలకలానికి దారి తీసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ సైతం ఈ విచారణను ఎదుర్కొంటోన్నారు. నోటీసులను అందుకున్నారు. విచారణ విషయంలో తెలంగాణ హైకోర్టులో ఆయనకు ఊరట లభించింది. డిసెంబర్ 5వ తేదీ వరకు స్టే లభించింది. సిట్ జారీ చేసిన నోటీసులు రద్దు చేయాలనేది ఆయన వాదన.

విచారణకు రఘురామ..
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుగుబాటు నాయకుడు, లోక్‌సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు విచారణను ఎదుర్కొంటోన్నారు. ఈ కేసును విచారిస్తోన్న ప్రత్యేక దర్యాప్తు బృందం- ఇదివరకే ఆయనకు నోటీసులను కూడా పంపించింది. నిందితులతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉండటం, వారితో ఫోన్‌లో మాట్లాడటం వంటి పరిణామాల నేపథ్యంలో రఘురామకు నోటీసులు ఇచ్చారు సిట్ అధికారులు.

వస్తారా లేదా?
ఇవ్వాళ ఆయన సిట్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. 41ఏ సీఆర్పీసీ కింద ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈ ఉదయం 10:30 గంటలకు హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో కాంప్లెక్స్‌లో ఉన్న సిట్ కార్యాలయానికి రఘురామ కృష్ణంరాజు వెళ్లాల్సి ఉంటుంది. ఆయన హాజరవుతారా? లేదా? అనే విషయంపై స్పష్టత రావట్లేదు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రమేయం ఉన్న నిందితులతో రఘురామ దిగిన ఫొటోలు ఇదివరకు సోషల్ మీడియాలో విస్తృతంగా సర్కులేట్ అయిన విషయం తెలిసిందే.

బీఎల్ సంతోష్..
టీఆర్ఎస్‌కు చెందిన అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్ శాసన సభ్యుడు బీరం హర్షవర్ధన్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డిలను పార్టీ ఫిరాయించేలా ప్రలోభ పెట్టటానికి ప్రయత్నించినట్టుగా ఆరోపణలను ఎదుర్కొంటోన్న బీజేపీ నాయకులకు సీవీ ఆనంద్ సారథ్యంలోని సిట్.. ఇప్పటికే నోటీసులను జారీ చేసింది. నోటీసులను అందుకున్న వారిలో కర్ణాటకకు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు, జాతీయ కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ఉన్నారు.

జాతీయ స్థాయి నేతలతో..
వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన లోక్‌సభకు ఎన్నికైనప్పటికీ- ఢిల్లీ స్థాయిలో బీజేపీ నేతలతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తూ వస్తోన్నారు రఘురామ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. వంటి కీలక నేతలను ఆయన అవలీలగా కలుసుకోగలరనే పేరుంది. ఇదే క్రమంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో విచారణను ఎదుర్కొంటోన్న బీఎల్ సంతోష్‌తోనూ రఘురామకు సన్నిహిత సంబంధాలే ఉన్నాయి.

సన్నిహిత సంబంధాలు..
ఆ సన్నిహిత సంబంధాలతోనే రఘురామ కృష్ణంరాజు.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితులను కలుసుకునేవాడని, తరచూ ఫోన్‌లో సంభాషించే వాడని చెబుతున్నారు. ఆ కాల్ లిస్ట్ ఆధరంగానే సిట్ అధికారులు కూడా ఆయన నోటీసులను పంపించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయన ఎంత మేర జోక్యం చేసుకున్నారు? ఆయన ప్రమేయం ఎంత వరకు ఉందనే విషయంపై ఆరా తీయడానికి విచారణకు పిలిపించారు.