మోడీ రాక వేళ అమిత్ షాకు వైసీపీ ఫిర్యాదు..!
ఏపీలో అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభం కోసం ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి వస్తున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ ప్రకారం అందరికీ ఆహ్వానాలు పంపింది. ఇదే క్రమంలో వైసీపీ అధినేత జగన్ కు కూడా ఆహ్వానం పంపినా ఆయన మాత్రం రావడం లేదు. ఈ నేపథ్యంలో మరో అంశంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వైసీపీ ఫిర్యాదు చేసింది.
ఏపీ పుణ్యక్షేత్రాల్లో భద్రతా లోపాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు వైసీపీ ఎంపీ గురుమూర్తి ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. రాష్ట్రంలోని ముఖ్యమైన దేవాలయాల్లో పరిపాలనా లోపాలు, తరచూ జరుగుతున్న భద్రతా వైఫల్యాలపై వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని గురుమూర్తి కోరారు. విశాఖపట్నం జిల్లా సింహాచలం దేవాలయంలో చందనోత్సవం సందర్భంగా గోడ కూలి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయిన అంశాన్ని ప్రస్తావింంచారు. గోడ నిర్మాణంలో సరైన ఇంజనీరింగ్ పద్ధతులు పాటించక పోవడం, నాణ్యత లేని మెటీరియల్ ఉపయోగించడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన ఆక్షేపించారు.

రాష్ట్రంలోని పలు పుణ్యక్షేత్రాలలో ఇటీవల జరిగిన సంఘటనలని వైసీపీ ఎంపీ తన లేఖలో ప్రస్తావించారు. శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మంలోని శ్రీ కూర్మనాథ స్వామి ఆలయంలో భక్తులు పవిత్రంగా భావించే అరుదైన నక్షత్ర తాబేళ్లు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం, పోస్టుమార్టం చేయకుండానే వీటి దహనం చేయడం చట్టాలను, సంప్రదాయాలను ఉల్లంఘించడమే అని ఎంపీ తెలిపారు.

అలాగే తిరుమలలో భద్రతా వ్యవస్థ పూర్తిగా తలకిందులైందని పేర్కొన్నారు. జనవరి 8న వైకుంఠ ద్వార దర్శన కౌంటర్ల క్యూ లైన్లలో జరిగిన దురదృష్టకరమైన తొక్కిసలాట తర్వాత కూడా టీటీడీ పరిపాలనలో ఎలాంటి మార్పు రాకపోవడం బాధాకరం అన్నారు. ఇటీవల కాలంలో మూడంచెల భద్రతా వ్యవస్థను దాటి ఒక భక్తుడు పాదరక్షలతో సింహ ద్వారం వరకు వెళ్లడం వ్యవస్థలోని లోపాలకు నిదర్శనం అన్నారు. టిటిడి గోశాలలో 100కు పైగా గోవులు చనిపోవడాన్ని కూడా ప్రస్తావించారు. గోశాల నిర్వహణలో నిర్లక్ష్యం, గోవులకి నాణ్యతలేని దాణా అందించడం, వైద్య సేవల లోపం, అజాగ్రత్త గోవుల మరణానికి కారణమాయ్యాయని తెలిపారు.
ఈ నేపథ్యంలో ఆలయాల్లో భద్రతా వైఫల్యాలపై వెంటనే ప్రత్యేక విచారణకు ఆదేశించాలని ఎంపీ గురుమూర్తి అమిత్ షాను కోరారు. బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. భక్తుల విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు, భద్రతను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వ జోక్యం అవసరమని ఎంపీ తెలిపారు. భారత దేశం యొక్క ఆధ్యాత్మిక వారసత్వాన్ని రక్షించాల్సిన బాధ్యత అందరి మీద ఉందన్నారు.












Click it and Unblock the Notifications