
చంద్రబాబుకు ఆ రెండూ వదలని జగన్ -ఎక్స్ అఫీషియో వ్యూహం -టీడీపీకి సున్నా -ఎస్ఈసీ లెక్కలివే
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార వైసీపీ ప్రభంజనం సృష్టించింది. ఫలితాలు ప్రకటించిన 11 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీల్లో ఫ్యాను గాలి హోరెత్తింది. కాగా, కార్పొరేషన్లు అన్నింటినీ గెలుచుకున్న వైసీపీకి.. రెండు మున్సిపాలిటీల్లో మెజార్టీ దక్కక పోవడంతో అచ్చంగా క్లీన్ స్వీప్ చేసిన ఘనత దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. తద్వారా ప్రతిపక్ష టీడీపీకి కనీసం రెండు పురపాలికలైనా దక్కే అవకాశం ఏర్పడింది. కానీ ఆ చిన్న ఆనందాన్ని కూడా చంద్రబాబుకు వదలొద్దని వైసీపీ అధినేత డిసైడయ్యారు.
వైసీపీ గెలుపుపై సీఎం జగన్ కీలక కామెంట్లు -ఆ ఇద్దరికే క్రెడిట్ -3రాజధానులకు అనుకూలమన్న సాయిరెడ్డి

ఆ రెండు చోట్ల వైసీపీకి షాక్
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఆదివారం వెలువడిన ఫలితాల్లో 11 కార్పొరేషన్లనూ వైసీపీ తన ఖాతాలోకి వేసుకుంది. కొత్త కార్యనిర్వాహక రాజధానిగా భావిస్తోన్న విశాఖపట్నం కార్పొరేషన్ లో టీడీపీ నుంచి వైసీపీకి గట్టిపోటీ ఎదురుకాగా, విజయవాడ, గుంటూరు, కర్నూలు కార్పొరేషన్లలో టీడీపీ నామమాత్రపు పోటీ ఇవ్వగలిగింది. ఇక మిగతా కార్పొరేషన్లలోనైతే వైసీపీ 80 నుంచి 90 శాతం డివిజన్లలో విజయం సాధించింది. మున్సిపాలిటీల విషయానికి వస్తే, మొత్తం 75కుగానూ 73చోట్ల ఫ్యానుకు క్లీన్ మెజార్టీ దక్కింది. కానీ సీఎం సొంత జిల్లా కడపలోని మైదుకూరు మున్సిపాలిటీ, అనంతపురం జిల్లాలోని తాడిపత్రి మున్సిపాలిటీల్లో మాత్రం అధికార పార్టీకి షాక్ తగిలింది. ఆ రెండు చోట్లా ప్రతిపక్ష టీడీపీ మెజార్టీ వార్డుల్ని కైవసం చేసుకుంది. కానీ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలను మాత్రం టీడీపీకి దక్కబోనివ్వమని మంత్రులు బాహాటంగానే చెబుతున్నారు..

మైదుకూరులో జనసైనికుడే కీలకం
కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులకుగానూ టీడీపీ 12, వైసీపీ 11, జనసేన 1 స్థానాలు గెలుచుకున్నాయి. ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠగా మారింది. 19వ వార్డులో జనసేన నుంచి గెలిచిన అభ్యర్థిపై టీడీపీ ఆశలు పెట్టుకోగా, వైసీపీ మాత్రం ఎక్స్ అఫిషియో ఓట్లతో పోస్టుల్ని ఈజీగా సాధిస్తామని చెబుతోంది. మైదుకూరు మున్సిపాలిటీలో స్థానిక ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి ఎక్స్ అఫిషియో ఓట్లు ఉన్నాయి. జనసేన కౌన్సిలర్ గనుక టీడీపీకి జై కొడితే వైసీపీ, టీడీపీలకు చెరో 13 ఓట్లు వచ్చి డ్రా అవుతుంది. అప్పుడు లాటరీ ద్వారా ఫలితాన్ని తేలుస్తారు. ఒకవేళ జనసేన టీడీపీకి మద్దతు పలకని పక్షంలో చైర్‌పర్సన్ పీఠం వైసీపీకి దక్కుతుంది. దీంతో ఆ ఒక్కడు కీలకంగా మారాడు. సీఎం సొంత జిల్లాలో క్లీన్ స్వీప్ లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ.. ఆ ఒక్కడినీ ఎలాగైనా మేనేజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక

తాడిపత్రిలో టఫ్.. అయినా ఊదేస్తామంటూ..
వైసీపీకి అందకుండా పోయిన మరో మున్పిపాలిటీ.. అనంతపురం జిల్లాలోని తాడిపత్రి. ఇక్కడ మొత్తం 36 వార్డులుండగా టీడీపీ 18చోట్ల, వైసీపీ 16 చోట్ల విజయం సాధించాయి. సీపీఐ, స్వతంత్ర అభ్యర్థి చెరొక చోట గెలిచారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇప్పటికే ఎక్స్ అఫీషియో ఓటరుకాగా, అనంతపురం ఎంపీ రంగయ్య ఇప్పటి దాకా తన ఎక్స్ అఫిషియో ఓటును ఎక్కడా నమోదు చేసుకోలేదు. మున్సిపల్ ఎన్నికల చట్టం సెక్షన్-5 క్లాజ్ (3) ప్రకారం.. పొలింగ్ తర్వాత 30 రోజుల్లోపు ఆయన ఎక్కడో ఒకచోట తన పేరును ఎక్స్ అఫిషియో సభ్యునిగా నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. అలా ఎంపీ రంగయ్య తన ఓటును తాడిపత్రి మున్సిపాలిటీలో నమోదు చేసుకుంటే వైఎస్సార్‌సీపీ బలం 18కు పెరుగుతుంది. అప్పుడు..

హైదరాబాద్‌కు టీడీపీ కౌన్సిలర్లు..
టీడీపీ, వైసీపీ చెరో 18 సీట్లతో సమానంగా మారి, సీపీఐ, స్వతంత్ర సభ్యుల ఓట్లు కీలకంగా మారతాయి. సీపీఐ ఇప్పటికే టీడీపీతో కలిసున్నందున ఆ కౌన్సిల్ ఓటు వైసీపీకి పడే అవకాశాలు తక్కువ. ఒక వేళ స్వతంత్రుడు వైసీపీకి మద్దతిచ్చినా మళ్లీ సంఖ్య సమానమై టాస్ తప్పదు. ఆ ఇద్దరూ(సీపీఐ, ఇండిపెండెంట్) కలిసి ఏ పార్టీకి మద్దతిస్తే ఆ పార్టీ చైర్‌పర్సన్ పీఠం దక్కించుకుంటుంది. మరోవైపు ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఎక్స్ అఫిషియో ఓటుపైనా టీడీపీ ఆశలు పెట్టుకుంది. ప్రలోభాల భయంతో టీడీపీ తన కౌన్సిలర్లను ఇప్పటికే హైదరాబాద్ తరలించింది. కాగా, ఎక్స్ అఫీషియో ఓట్లతో తాడిపత్రిని గెలుస్తామని మంత్రి బొత్సా సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. తాడిపత్రిని కాపాడుకోడానికే జనం టీడీపీని గెలిపించారిన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించడం తెలిసిందే. కాగా,

డివిజన్లు/ వార్డుల వారీగా ఎస్ఈసీ లెక్కలివి..
ఏపీలోని 11 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు కలిపి మొత్తం 2,742 డివిజన్లు/ వార్డులుండగా, అధికార వైసీపీ ఏకంగా 2,265 చోట్ల గెలుపొందగా, ప్రతిపక్ష టీడీపీకి కేవలం 348 స్థానాలు దక్కాయి. ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఈసీ వెలువరించిన అధికారిక లెక్కల ప్రకారం.. 11 కార్పొరేషన్లలో 623డివిజన్లకుగానూ వైసీపీ- 516, టీడీపీ -80, జనసేన - 07, బీజేపీ -01, సీపీఎం -02, సీపీఐ -01, ఇండిపెండెంట్స్ -16 డివిజన్లలో గెలిచారు. ఇక మున్సిపాటీలకు వస్తే, వైసీపీ -1740 వార్డుల్లో,
టీడీపీ - 278, జనసేన- 23, బీజేపీ -08, కాంగ్రెస్ -02, సీపీఐ -02, ఇండిపెండెంట్స్ - 68 వార్డుల్లో విజయం సాధించారు. ఏలూరు కార్పొరేషన్ లోని 47 డివిజన్ల కౌంటింగ్ చేపట్టలేదు. అలాగే తిరుపతి 7 వార్డు ఎన్నిక నిర్వహించలేదు. అద్దంకి లో 8 వార్డులో అభ్యర్థులు విత్ డ్రా చేసుకున్నారు.