టీడీపీలోకి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే - లిస్టులో నెక్స్ట్, ఆట మొదలు..!!
ఏపీలో ఎన్నికల జంపింగ్స్ మొదలయ్యాయి. ముఖ్యమంత్రి జగన్ గెలుపే ప్రామాణికంగా ఇంఛార్జ్ ల మార్పు కసరత్తు చేస్తున్నారు. సీట్లు మార్చే వారికి ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. సీట్లు దక్కదని తేలిన వారు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఏపీలో అధికారం దక్కాలంటే కీలకమైన గోదావరి జిల్లాల్లో పార్టీల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు టీడీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు.
మారుతున్న లెక్కలు : గోదావరి జిల్లాల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. టీడీపీ, జనసేన పొత్తుతో ఈ రెండు జిల్లాల్లో వైసీపీని దెబ్బ తీయాలని..ఇక్కడ మెజార్టీ సీట్లు గెలవటం ద్వారా అధికారం దక్కించుకోవాలనేది చంద్రబాబు వ్యూహం. 2019 ఎన్నికల్లో పశ్చిమ గోదావరిలో రెండు, తూర్పులో నాలుగు సీట్లు మాత్రమే టీడీపీ గెలుచుకుంది. ఇప్పుడు జనసేనతో పొత్తుతో సానుకూల ఫలితాలు వస్తాయని ఆశిస్తోంది. ఇదే సమయంలో జగన్ ఆ రెండు జిల్లాలో సామాజిక సమీకరణాలే అధారంగా అభ్యర్దుల ఎంపిక చేస్తున్నారు. అందులో భాగంగా జగ్గంపేట సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానంలో మాజీ మంత్రి తోట నర్సింహం ను బరిలోకి దించాలని జగన్ నిర్ణయించారు. దీంతో..ఇప్పుడు ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పార్టీ వీడటానికి సిద్దమయ్యారు.

టీడీపీలోకి చంటిబాబు : జ్యోతుల చంటిబాబు 2009, 2014 ఎన్నికల్లో జగ్గంపేట నుంచి టీడీపీ అభ్యర్దిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక, ఇప్పుడు జగన్ తీసుకుంటున్న నిర్ణయాల్లో భాగంగా గోదావరి జిల్లాల్లో సీట్ల మార్పు పైన సంకేతాలు ఇచ్చారు. అందులో జగ్గంపేట నుంచి మాజీ మంత్రి, ఎంపీగా పని చేసిన తోట నర్సింహం కు ఇవ్వాలని జగన్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది 2004, 2009 లో తోట నర్సింహం ఇక్కడ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో కాకినాడు నుంచి టీడీపీ ఎంపీగా గెలుపొందారు. 2019 లో వైసీపీలో చేరారు. నర్సింహం సతీమణి వాణి పెద్దాపురం నుంచి ఆ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు సమీకరణాల్లో భాగంగా నర్సింహం పేరును జగన్ ఖరారు చేసారు. దీంతో..సీటు దక్కదని డిసైడ్ అయిన చంటిబాబాబు టీడీపీలో చేరేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

మార్పులు - చేర్పులు : వైసీపీ నుంచి అభ్యర్ది మార్పు పైన అధికారికంగా ప్రకటన వచ్చిన తరువాత పార్టీకి రాజీనామా చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. జవనరి 5,6 తేదీల్లో చంటిబాబు టీడీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం. ఇప్పటికే పిఠాపురంలోనూ సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చాలని నిర్ణయించటంతో ఎమ్మెల్యే దొరబాబు జనసేనతో టచ్ లో ఉన్నట్లు చెబుతున్నారు. చంటిబాబు కుమార్తె జనసేన నుంచి పిఠాపురం బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది. అయితే, పిఠాపురం సీటు కోసం టీడీపీ - జనసేన నుంచి పోటీ ఉంది. దీంతో..గోదావరి జిల్లాల్లో అభ్యర్దుల మార్పు వ్యవహారం.. నేతల పార్టీ మార్పు అంశంతో ఎన్నికల రాజకీయం గోదావరి గట్టున ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications