మెడికల్ కాలేజీలు, ఆరోగ్య శ్రీ ప్రైవేటీకరణ ? సర్కార్ పై వైసీపీ ఫైర్..!
ఏపీలో కొత్తగా 10 మెడికల్ కాలేజీల్ని పీపీపీ విధానంలో నిర్మించాలని, ఆరోగ్యశ్రీ పథకాన్ని హైబ్రిడ్ మోడ్ లో అమలు చేయాలని నిన్న కేబినెట్ తీసుకున్న నిర్ణయాలపై వైసీపీ మండిపడింది. ఈ రెండు నిర్ణయాలతో ప్రజారోగ్యం ప్రైవేటుపాలై పేదలు ఇబ్బందులు ఎదుర్కోవడం ఖాయమని వైసీపీ అధికార ప్రతినిధి శైలజానాథ్ మండిపడ్డారు. ఈ రెండు నిర్ణయాల వెనుక ఉన్న కారణాల్ని ఆయన ఇవాళ అనంతపురంలో వివరించారు.
వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్తులపై కన్నేసిన చంద్రబాబు వాటిని దోచుకోవడానికే పీపీపీ విధానం తీసుకొచ్చారని, ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి మరీ ట్రస్టు మోడ్‌లో ఉన్న ఆరోగ్యశ్రీని హైబ్రిడ్ మోడ్‌లోకి మారుస్తున్నారని మాజీ మంత్రి సాకె శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పీపీపీ మోడ్ లో మెడికల్ కాలేజీల నిర్మాణంపై ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఉచితంగా మెరుగైనా వైద్యాన్ని అందించాల్సిన బాధ్యత నుంచి క్రమంగా తప్పుకునేందుకే సీఎం చంద్రబాబు ఇటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు.

ప్రతి పార్లమెంట్ పరిధిలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలన్న ఉద్దేశంతో జగన్ శ్రీకారం చుట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటుకు అప్పగించేందుకు చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దుర్మార్గమన్నారు. మొదటి విడతలో 10 మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటు సంస్థలకు అప్పగించే విధంగా కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని వైయస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటుపరం చేయడమంటే ప్రజారోగ్యాన్ని వారి చేతుల్లో పెట్టడమే అన్నారు.
విద్య, వైద్య రంగాన్ని పూర్తిగా కార్పొరేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేయడమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నాడన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మెడికల్ సీట్లన్నీ ఉచితంగానే ఇస్తామని ఎన్నికలప్పుడు చంద్రబాబు ప్రచారం చేసుకున్నారని గుర్తుచేశారు. కానీ అధికారంలోకి వచ్చాక అందుకు విరుద్ధంగా ఏకంగా కాలేజీలనే పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేస్తున్నారన్నారు. డాక్టర్లు కావాలన్న పేద విద్యార్థుల ఆశలను చిదిమేస్తున్నారన్నారు.

మరోవైపు పేదవాడికి సంజీవనిగా నిలిచిన ఆరోగ్యశ్రీని ట్రస్ట్ మోడ్ నుంచి హైబ్రిడ్ మోడ్‌కి తీసుకెళ్లడం చంద్రబాబు చేస్తున్న మరో దుర్మార్గమైన చర్య అని శైలజానాథ్ విమర్శించారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ఏడాదిన్న పాలనలో పూర్తిగా నిర్వీర్యం చేశారని, ప్రజల ఆరోగ్యంపైన కూడా వ్యాపారం చేయాలని చంద్రబాబుకి నీచ బుద్ధి కలగడం బాధాకరమన్నారు. విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు, గత 2014-19 మధ్య 1054 ప్రొసీజర్లకే ఆరోగ్యశ్రీలో చికిత్సలు అందించేవారని, వైయస్ జగన్ ఆ ప్రొసీజర్ల సంఖ్యను 3257కి పెంచి పేదవాడికి అండగా నిలిచారన్నారు.












Click it and Unblock the Notifications