రాష్ట్రపతి ఎన్నికల ప్రాసెస్‌లో వైసీపీ కీలకం: ఆ ముగ్గురి పైనే ఫోకస్: 21న ఢిల్లీకి
అమరావతి: రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ ముగిసింది. దీనికి సంబంధించిన ఫలితాలు ఈ నెల 21వ తేదీన వెలువడనున్నాయి. దేశ రాజధానిలో ఓట్ల లెక్కింపు ఉంటుంది. పార్లమెంట్ ప్రాంగణంలోనే ఓట్ల లెక్కింపు కేంద్రం ఏర్పాటయింది. దేశవ్యాప్తంగా అన్ని పార్టీలకు చెందిన లోక్‌సభ, రాజ్యసభ, శాసన సభల సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా 99.18 శాతం మేర పోలింగ్ శాతం నమోదైంది.

అంచనాలివే..
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ అభ్యర్థిగా ఒడిశాకు చెందిన గిరిజన మహిళ ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల తరఫు నుంచి కేంద్ర ఆర్థిక, రక్షణ శాఖ మంత్రి యశ్వంత్ సిన్హా పోటీ పడ్డారు. ఈ ఇద్దరిలో విజయం ఎవరిని వరిస్తుందనేది ఈ నెల 21వ తేదీన తేలిపోతుంది. ద్రౌపది ముర్ముకే విజయావకాశాలు అధికంగా ఉన్నాయంటూ అప్పుడే అంచనాలు సైతం వ్యక్తమౌతోన్నాయి. ఎన్డీఏకు సంపూర్ణ బలం ఉండటమే దీనికి కారణం. దీనితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్టీ, బిజూ జనతాదళ్ వంటి తటస్థ పార్టీలు కూడా ముర్ముకే మద్దతు తెలిపాయి.

టీడీపీ నుంచి ఇద్దరు డుమ్మా..
కాగా- ఏపీ శాసనసభలో మొత్తం 175 మంది సభ్యుల బలం ఉండగా.. ఇద్దరు ఓటింగ్‌కు హాజరు కాలేదు. మొత్తంగా 173 ఓట్లు పోల్ అయ్యాయి. గైర్హాజరయిన ఆ ఇద్దరు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి చెందిన సభ్యులే. హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. సినిమా షూటింగ్‌ల కోసం బాలకృష్ణ విదేశాలకు వెళ్లారు. వ్యక్తిగత పనుల నిమిత్తం బుచ్చయ్య చౌదరి అమెరికాలో ఉంటోన్నారు.

ముగ్గురు ప్రతినిధుల బృందం..
తెలుగుదేశం పార్టీ నుంచి 21 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టయింది. కాగా- ఈ నెల 21వ తేదీన కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్వహించబోయే ఓట్ల లెక్కింపు కోసం వైఎస్ఆర్సీపీ ముగ్గురు సభ్యులు బృందాన్ని దేశ రాజధానికి పంపించనుంది. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, చీఫ్ విప్ ప్రసాద రాజు, శాసన సభ కోఆర్డినేటర్ గడికోట శ్రీకాంత్ రెడ్డి- ఏపీ ప్రతినిధులుగా ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ ఏజెంట్లుగా హాజరవుతారు.

కోఆర్డినేటర్‌గా..
రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ సమయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున బుగ్గన రాజేంద్రనాథ్ ఏజెంట్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియ మొత్తాన్నీ ఆయనే దగ్గరుండి పర్యవేక్షించారు. ఆయన సమక్షంలోనే బ్యాలెట్ బాక్సులను భద్రపరిచారు. ఈ ప్రాసెస్ మొత్తానికీ బుగ్గన సమన్వయకుడిగా వ్యవహరించారు. ఇక ఈ నెల 21వ తేదీన నిర్వహించబోయే ఓట్ల లెక్కింపు కార్యక్రమానికీ కౌంటింగ్ ఏజెంట్‌గా హాజరు కానున్నారు.












Click it and Unblock the Notifications