ఎస్.. నేను తోపునే- నువ్వు సీఎం అయితే గుండు కొట్టించుకుంటా- తోపుదుర్తి సవాల్
అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు తనపై చేసిన విమర్శలను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస పార్టీకి చెందిన రాప్తాడు శాసన సభ్యుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తిప్పికొట్టారు. చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేశారు.
పెనుకొండ నియోజకవర్గంలో రోడ్ షోలో పాల్గొన్న చంద్రబాబు.. తోపుదుర్తిపై పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తోపుదుర్తి 2,000 కోట్ల రూపాయల ఆస్తులను అక్రమంగా కూడబెట్టుకున్నారని విమర్శించారు. కరవు జిల్లాను వైఎస్ఆర్సీపీ నాయకులు దోచుకుంటున్నారంటూ ధ్వజమెత్తారు.

ఈ విమర్శలపై తోపుదుర్తి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. తనకు 2,000 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు ఉంటే వాటిని రాయలసీమ ప్రాజెక్టుల కోసం ఖర్చుచేస్తానని సవాల్ చేశారు. అందులో నుంచి ఓ 20 కోట్ల రూపాయలను తనకు ఇస్తే చాలని ఎద్దేవా చేశారు. చంద్రబాబు రాయలసీమ ద్రోహి అంటూ మండిపడ్డారు. 14 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న చంద్రబాబు రాయలసీమకు ఏం చేశారని నిలదీశారు.
నిజంగా చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే తన సవాల్‌ను స్వీకరించాలంటూ తోపుదుర్తి డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వ హాయంలో 50,000 ఎకరాల్లో పంట భూమి బీడుగా మారిందని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు కరవుకు బ్రాండ్ అంబాసిడర్ అంటూ చురకలు అంటించారు. ఆ బీడు భూములన్నింటినీ తాను సాగులోకి తీసుకొచ్చానని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఈ విషయంలో తాను తోపునేని తేల్చి చెప్పారు.
రాప్తాడు ప్రజలు తనను గుండెల్లో పెట్టుకున్నారని, వారికోసం ఆస్తులను ధారపోయగలమని తోపుదుర్తి అన్నారు. చంద్రబాబు బుడ్డ బెదిరింపులకు భయపడేవాడెవ్వడూ లేడని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రభుత్వ హయాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఓ కసాయి కుటుంబం దౌర్జన్యాలను ఎదరించి నిలిచామని పరోక్షంగా పరిటాల కుటుంబాన్ని ఉద్దేశించి చెప్పారు.

తనను బెదిరించేంతటి సీన్ చంద్రబాబుకు లేదని తోపుదుర్తి సెటైర్లు వేశారు. ఇక చంద్రబాబు జన్మలో సీఎం కాలేడని జోస్యం చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే గుండు కొట్టించుకుంటానని సవాల్ విసిరారు. గొంతు చించుకుని అరిచినంత మాత్రాన భయపడేవాడెవ్వడూ లేడని అన్నారు. చంద్రబాబు తాను దోపిడీ చేస్తూ దాన్ని ఇతరులకు అంటగట్టడం అలవాటేనని చెప్పారు.
రాయలసీమలోనే అతిపెద్ద చిత్తూరు డెయిరీని మూసివేయించిన ఘనత చంద్రబాబుదని గుర్తు చేశారు. తన హెరిటేజ్ కంపెనీ కోసం విజయా డెయిరీని నామరూపాల్లేకుండా చేశాడని అన్నారు. హెరిటేజ్ కోసం రైతుల నుంచి 25,000 కోట్ల రూపాయలను చంద్రబాబు దోచుకున్నాడని ఆరోపించారు. చంద్రబాబు మూసేయించిన చిత్తూరు డెయిరీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పునరుద్ధరించారని చెప్పారు.












Click it and Unblock the Notifications