జగన్-షర్మిల మధ్య రాజీ వార్తలపై వైవీ క్లారిటీ ! ఆమె రాకతో ఇబ్బంది లేదు- దాడి రాజీనామాపై స్పందన !
కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల ఎంట్రీ ఏపీలో రాజకీయంగా కలకలం రేపుతోంది. షర్మిల ఎంట్రీతో ఏ పార్టీకి ప్రయోజనం, ఏ పార్టీకి రాజకీయంగా నష్టం అన్న చర్చ కూడా జరుగుతోంది. మరోవైపు షర్మిల ఎంట్రీతో వైసీపీకి నష్టం జరుగుతున్న అంచనాల నేపథ్యంలో ఆమె సోదరుడు, సీఎం వైఎస్ జగన్ రాయబారాలు మొదలుపెట్టినట్లు కూడా ప్రచారం జరిగింది. దీనికి బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని పంపినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై వైవీ సుబ్బారెడ్డి ఇవాళ క్లారిటీ ఇచ్చారు.
సీఎం జగన్ కూ, వైఎస్ షర్మిల మధ్య తాను ఎలాంటి రాయబారాలు చేయలేదని వైవీ సుబ్బారెడ్డి ఇవాళ వెల్లడించారు.నెల రోజుల తరువాత విజయమ్మని కలిసేందుకు హైదరాబాద్ వెళ్ళానన్నారు. కుటుంబ సభ్యులను కూడా కలవకుడదా అని ఆయన ప్రశ్నించారు. షర్మిల కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. తెలంగాణ ఎన్నికల సమయంలోనే షర్మిల కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరిగిందన్నారు. ఎవరు ఏ పార్టీలో చేరినా తమకు ఇబ్బంది లేదని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. షర్మిల కాంగ్రెస్లో చేరినా తమకు ఇబ్బంది లేదన్నారు.

మరోవైపు కొందరు వ్యక్తిగత కారణాలతో పార్టీ మారుతున్నారని తాజాగా జరిగిన విశాఖ వైసీపీ నేతల రాజీనామాలపై వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. జగన్ చేసిన సంక్షేమ కార్యక్రమాలు వైసీపీని గెలిపిస్తాయన్నారు. వచ్చే ఎన్నికల్లో కొంత మందికి టికెట్ ఇచ్చే అవకాశం లేదన్నారు. వారికి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అనకాపల్లి లో ప్రత్యేక పరిస్థితులు వున్నాయని, దాడి వీర భద్ర రావు కి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదన్నారు. అయన రాజీనామా చేసిన విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. ఎన్నికల సమయంలో పార్టీలు మారడం సహజమని, టిక్కెట్ లేని వారికి వేరే విధంగా అవకాశం ఇస్తామన్నారు.












Click it and Unblock the Notifications