Escape: కొత్త సీఎంకు అసమ్మతి సెగ ?, అజ్ఞాతంలో బళ్లారి బ్రదర్, ఐటీ హబ్ లో సందడి, వాట్ నెక్ట్స్ !
బెంగళూరు/బళ్లారి: కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి బీఎస్. యడియూరప్ప రాజీనామా చెయ్యడంతో ఆ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజ్ బోమ్మయ్ సీఎంగా ఈ రోజు ప్రమాణస్వీకారం చేశారు. మంత్రి పదవులు దక్కించుకోవడానికి అందరూ ఇప్పుడు కొత్త సీఎం బసవరాజ్ బోమ్మయ్, మాజీ సీఎం బీఎస్, యడియూరప్ప ఇంటి చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. అయితే తనకు అనుకున్న పదవి దక్కలేదని, తాను ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చెయ్యలేదని అనుకున్న బళ్లారి బ్రదర్, బళ్లారి శ్రీరాములు బెంగళూరు నుంచి మాయం అయిపోయారు. యడియూరప్ప ప్రభుత్వంలో, కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో చక్రం తిప్పిన బళ్లారి బ్రదర్స్ లో ఒకరైన శ్రీరాములు అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం హాట్ టాపిక్ అయ్యింది.

ఆ రోజు బోమ్మయ్ వెనుకనే శ్రీరాములు
మంగళవారం రాత్రి బెంగళూరులోని స్టార్ హోటల్ లో బీజేపీ శాసన సభ్యుల సమావేశం జరిగింది. బీజేపీ శాసనసభ్యుల సమావేశం పూర్తి అయిన తరువాత అదే హోటల్ లో కర్ణాటక ముఖ్యమంత్రిగా బసవరాజ్ బోమ్మయ్ పేరు ప్రకటించారు. ఆ కార్యక్రమానికి హాజరైన శ్రీరాములు బీజేపీ హైకమాండ్ ప్రతినిధులు సీఎంగా బసవరాజ్ బోమ్మయ్ పేరు ప్రకటించే సమయంలో ఆయన వెనుకనే ఉన్నారు.

అజ్ఞాతంలోకి బళ్లారి శ్రీరాములు
బుధవారం కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజ్ బోమ్మయ్ ప్రమాణస్వీకారం చేశారు. మంత్రి పదవులు దక్కించుకోవడానికి సీనియర్ మంత్రులు, బీజేపీ సీనియర్ ఎమ్మెల్యేలు అందరూ ఇప్పుడు కొత్త సీఎం బసవరాజ్ బోమ్మయ్, మాజీ సీఎం బీఎస్, యడియూరప్ప ఇంటి చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. మంత్రి పదవుల కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. అయితే బళ్లారి శ్రీరాములు మాత్రం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

ఉప ముఖ్యమంత్రి పదవి
బసబరాజ్ బోమ్మయ్ ముఖ్యమంత్రి అయిన వెంటనే తనకు ఉప ముఖ్యమంత్రి పదవి వస్తుందని బళ్లారి శ్రీరాములు ఊహించారని సమాచారం. సీఎంగా బసవరాజ్ బోమ్మయ్, ఉప ముఖ్యమంత్రిగా తాను ఒకేసారి ప్రమాణ స్వీకారం చేస్తామని బళ్లారి శ్రీరాములు అనుకున్నారని తెలిసింది. ఇప్పటికే ఢిల్లీ వెళ్లి వచ్చిన బళ్లారి శ్రీరాములు తనకు ఉప ముఖ్యమంత్రి పదవి గ్యారెంటీ అని ధీమాగా ఉన్నారని తెలిసింది.

రాత్రికి రాత్రే ఐటీ హబ్ నుంచి జంప్
బసవరాజ్ బోమ్మయ్ మాత్రమే ప్రమాణస్వీకారం చెయ్యడానికి రాజ్ భవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో బళ్లారి శ్రీరాములు మంగళవారం రాత్రికి రాత్రే మాయం అచయిపోయారని తెలిసింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా బసవరాజ్ బోమ్మయ్ పేరు ప్రకటించిన వెంటనే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి బళ్లారి శ్రీరాములు అంటూ ఆయన వర్గీయులు బళ్లారిలో మంగళవారం రాత్రి పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి కుటుంబంలో ఒక్కడిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీరాములు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో అని అందరూ ఆరా తీస్తున్నారు.

అదే నిజమా ?
బుధవారం బళ్లారిలోని శ్రీరాములు ఇంటిలో ప్రత్యేక పూజలు నిర్వహించారని, ఆ పూజలో పాల్గొనడానికి శ్రీరాములు బళ్లారి వెళ్లారని ఆయన ముఖ్య అనుచరులు అంటున్నారు. అయితే ప్రత్యేక పూజలు చెయ్యడానికి శ్రీరాములు బళ్లారి వెళ్లారా ?, లేక మరేమైనా కారణాలు ఉన్నాయా ? అనే విషయం అంతు చిక్కడం లేదని బీజేపీకి చెందిన కొందరు కీలకనేతలు అంటున్నారు. బళ్లారిలో శ్రీరాములు మీడియా కంటికి కూడా చిక్కలేదు. కర్ణాటక కొత్త సీఎం బసవరాజ్ బోమ్మయ్ కి అప్పుడు అసమ్మతి సెగ మొదలైయ్యిందా ? అనే చర్చకూడా జోరుగా సాగుతోంది.












Click it and Unblock the Notifications