నందినిని నాశనం చేసి కార్పోరేట్ కంపెనీలకు ?, 2. 5 లక్షల ఉద్యోగాలు, ప్రియాంకా గాంధీ !
బెంగళూరు/మైసూరు: లక్షల్లో ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను నమ్మించి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 2. 50 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ప్రియాంకా గాంధీ ప్రజలకు హామీ ఇచ్చారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మైసూరు జిల్లాలోని టీ నరశీపురలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన ప్రియాంకా గాంధీ కేంద్రంలో, కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాల మీద విరుచుకుపడ్డారు. ప్రజలను నమ్మించి మోసం చెయ్యడంలో బీజేపీ నాయకులు ముందు వరుసలో ఉంటారని ప్రియాంకా గాంధీ ఆరోపించారు.

ప్రజలకు, నిరుద్యోగులకు బీజేపీ ప్రభుత్వం నిలువునా మోసం చేసి వారిని నట్టేట ముంచేసిందని ప్రియాంకా గాంధీ ఆరోపించారు. పలు బిల్లులు ప్రవేశపెట్టిన బీజేపీ ప్రభుత్వం వాటిని ఆమోదించిన తరువాత వాటిని అమలు చెయ్యకుండా అటెక్కించేశారని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంకా గాంధీ ఆరోపించారు.
కర్ణాటకలో నందిని బ్రాండ్ నెంబర్ వన్ అనే విషయం కొత్తగా చెప్పనవసరం లేదని ప్రియాంకా గాంధీ గుర్తు చేశారు. అముల్ సంస్థను ఉద్దరించడానికే కర్ణాటకలో నందిని బ్రాండ్ ను నాశనం చెయ్యడానికి బీజేపీ నాయకులు సిద్దం అయ్యారని, కన్నడిగులు, కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు బీజేపీ నాయకుల ఎత్తుగడలు కొనసాగడం కదురదని ప్రియాంకా గాంధీ చెప్పారు.
కర్ణాటకలో ఐదు సంవత్సరాలు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఉత్తమ పరిపాలన అందించిందని, ఆ సమయంలో ప్రతిరోజు నందిని పాలు 90 లక్షల లీటర్లు విక్రయిస్తుంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత 70 లక్షల లీటర్లకు నందిని పాలు విక్రయాలు పడిపోయాయని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంకా గాంధీ ఆరోపించారు.
నందిని బ్రాండ్ ను నాశనం చేసి కార్పోరేట్ కంపెనీల కడుపు నింపడానికి ప్రయత్నిస్తున్న బీజేపీ నాయకులకు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సరైన బుద్ది చెప్పాలని, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని ప్రియాంకా గాంధీ కన్నడిగులకు మనవి చేశారు. అమిత్ షాకు పోటాపోటీగా ప్రచారం చేస్తున్న ప్రియాంకా గాంధీ కన్నడిగులను ఆకట్టుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications