షాకింగ్ : రైలు పట్టాలపై శవమై తేలిన కర్ణాటక శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్...
కర్ణాటకలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్,జేడీఎస్ ఎమ్మెల్సీ ఎస్ఎల్ ధర్మే గౌడ(64) రైలు పట్టాలపై శవమై తేలారు. చిక్‌మంగళూరు సమీపంలోని రైల్వే ట్రాక్‌పై పోలీసులు ధర్మే గౌడ మృతదేహాన్ని గుర్తించారు. ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.
సోమవారం(డిసెంబర్ 28) అర్ధరాత్రి దాటిన తర్వాత 2గంటల సమయంలో పట్టాలపై ధర్మే గౌడ మృతదేహాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని,మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు.

ధర్మే గౌడ మొదటినుంచి మీడియాకు కాస్త దూరంగానే ఉంటారు. ఇటీవల శాసనమండలిలో జరిగిన రచ్చ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీలు డిప్యూటీ ఛైర్మన్ ధర్మే గౌడను కుర్చీ నుంచి లాగి అవమానించారు. . బీజేపీ, జేడీఎస్ పార్టీలు ఛైర్మన్‌ను ఆ స్థానంలో అక్రమంగా కూర్చొబెట్టాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ధ్వజమెత్తారు. సభ అదుపులో లేనప్పుడు ఛైర్మన్ తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సభలో డిప్యూటీ ఛైర్మన్‌ను అవమానించిన కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
ధర్మే గౌడ మరణం కర్ణాటక రాజకీయాల్లో దుమారం రేపే అవకాశం కనిపిస్తోంది. ఆయన సోదరుడు ఎస్ఎల్ భోజే గౌడ కూడా ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికి ఆయన అత్యంత సన్నిహితుడు అనే పేరు కూడా ఉంది. ధర్మే గౌడ వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్యకు పాల్పడ్డారా లేక రాజకీయపరమైన కారణాలున్నాయా అన్నది తెలియాల్సి ఉంది.
Recommended Video
డిప్యూటీ చైర్మన్ ధర్మగౌడ ఆత్మహత్య పట్ల మాజీ ప్రధాని దేవే గౌడ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ధర్మే గౌడ ఆత్మహత్య బాధాకరమన్నారు. జేడీఎస్ పార్టీ మంచి నాయకుడిని కోల్పోయిందని, ధర్మే గౌడ మరణం పార్టీకి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications