Swamiji: లైంగిక వేధింపుల కేసులో మఠంలో పని చేసే దంపతులకు బెయిల్ మంజూరు, స్వామీజీకి మాత్రం!
చిత్రదుర్గ/బెంగళూరు: అక్కమ్మదేవి విద్యాసంస్థలో చదువుకుంటున్న మైనర్ అమ్మాయిల మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకలోని చిత్రదుర్గకు చెందిన స్వామిజీ, మురుగా మఠాధిపతి డాక్టర్ శివమూర్తి మురుగా శరణరుకు న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది.
తన మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చెయ్యాలని మఠాధిపతి డాక్టర్ శివమూర్తి మురుగా శరణరు పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటీషన్ విచారణను చిత్రదుర్గ కోర్టు వాయిదా వేసింది. అయితే ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మురుగా మఠం పరిపాలనా విభాగం అధికారికి, ఆయన భార్యకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.

స్వామీజీ మీద ఆరోపణలు
చిత్రదుర్గాలోని మురుగా మఠాధిపతి డాక్టర్ శివమూర్తి మురుగా శరణరుకు కర్ణాటకలో మంచి పేరుప్రతిష్టలు ఉన్నాయి. మురుగా మఠం ఆధీనంలోని అక్కమదేవి విద్యాసంస్థల్లో చదువుకుంటూ హాస్టల్ లో ఉంటున్న మైనర్ అమ్మాయిలను డాక్టర్ శివమూర్తి మురగా శరణరు మామీద లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఇటీవల కేసు పెట్టారు.

స్వామీజీ బెయిల్ పిటీషన్ వాయిదా
మైనర్ అమ్మాయిలు కేసు పెట్టడంతో డాక్టర్ శివమూర్తి మురుగా శరణరు తరపు న్యాయవాది కేఎన్, విశ్వనాథ్ ఆగస్టు 29వ తేదీన స్వామీజీకి ముందస్తు జామీను మంజూరు చెయ్యాలని చిత్రదుర్గాలోని సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. వివరాలు సేకరించిన న్యాయమూర్తి జస్టిస్ కోమలా స్వామీజీ బెయిల్ పిటిషన్ ను సెప్టెంబర్ 2వ తేదీ శుక్రవారానికి వాయిదా వేశారు.

ఇద్దరికి బెయిల్ మంజూరు
మురుగా మఠం ఆధీనంలోని విద్యాసంస్థల్లో పరిపాలనా విభాగం అధికారి ఎస్ కే. బసవరాజన్, ఆయన భార్య సౌభాగ్య మీద కేసు నమోదు అయ్యింది. ఈ కేసు విచారణ గురువారం చిత్రదుర్గా జిల్లా అండ్ సెషన్స్ కోర్టులో విచారణ జరిగింది. కోర్టుకు హాజరుకావాలని ఎస్ కే. బసవరాజన్, ఆయన భార్య సౌభాగ్యకు కోర్టు సూచించింది.

స్వామీజీ ప్రయత్నాలు విఫలం!
కోర్టు ముందు ఎస్ కే. బసవరాజన్, ఆయన భార్య సౌభాగ్య హాజరైనారు, కేసు వివరాలు తెలుసుకున్న న్యాయమూర్తి జస్టిస్ అనితా కుమారి బెయిల్ మంజూరు చేశారు. అయితే అమ్మాయిల లైంగిక వేధింపుల కేసులో ముందస్తు బెయిల్ తీసుకోవాలని ప్రయత్నించిన డాక్టర్ శివమూర్తి మురుగా శరణరు ప్రయత్నాలు ఫలించలేదు.












Click it and Unblock the Notifications