TTD: శ్రీవారి సేవలు ఎక్కడ జరిగినా భక్తులను లెక్కపెట్టలేము, మాజీ ప్రధాని, మాజీ సీఎం, శ్రీవారు అంటే!
బెంగళూరు/రామనగర/తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వరుడికి ఎన్ని వేల కోట్ల మంది భక్తులు ఉన్నారో అంచానా వెయ్యడం ఆదేవుడి తరం కూడా కాదు. ప్రతిరోజు, వేల మంది, లక్షల మంది క్యూలో నిలబడి శ్రీవారిని దర్శించుకోవడానికి ఎంతసేపు అయినా వేచి చూస్తారు. అలాంటి శ్రీవారి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలు ఎదురు చూస్తుంటారు.
కర్ణాటకలోని రామనగరలోని స్టేడియంలో శ్రీవారి కల్యాణ వేడుకల కార్యక్రమం కనుల పండుగగా జరిగింది. మాజీ ప్రధాని, టీటీడీ అధికారులు, మాజీ సీఎంతో పాటు వేల సంఖ్యలో స్వామి వారి భక్తులు ఈ వేడుకలకు హాజరైనారు.

మాజీ సీఎం కుమారస్వామి
కర్ణాటక రాష్ట్రంలోని రామనగర జిల్లా స్టేడియం మైదానంలో శుక్రవారం రాత్రి టీటీడీ ఆధ్వర్యంలో దాత , శాసన సభ్యులు, మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ. కుమార స్వామి, ఆయన సతీమణి, స్థానిక శాసన సభ్యురాలు శ్రీమతి అనిత కుమార స్వామి దంపతులు నిర్వహించిన శ్రీనివాస కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.

ఊహించని విధంగా స్వామి కోసం
కళ్ళు మిరిమిట్లు గొలిపేలా శోభాయమానంగా నిర్మించిన కల్యాణ వేదిక, భారీ ఎత్తున ఏర్పాటు చేసిన పుష్ప, విద్యుత్ అలంకరణల నడుమ నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి కల్యాణాన్ని చూసి తరించారు. సాయంత్రం 6 గంటలకు వేద పండితులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను కల్యాణవేదిక వద్దకు తీసుకొచ్చారు.

కనుల పండుగగా శ్రీవారి కల్యాణం
రాత్రి 7 నుండి 8 గంటల వరకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, కంకణధారణ, అగ్నిప్రతిష్టాపన, యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మధుపర్క సమర్పణ, మహాసంకల్పం, మంగళసూత్రధారణ ఘట్టాలతో శాస్త్రోక్తంగా కల్యాణాన్ని నిర్వహించారు.

ఎంత చెప్పినా తక్కువే
చివరిగా నక్షత్రహారతి, మంగళహారతి కార్యక్రమంతో కల్యాణం అత్యంత వైభవంగా ముగిసింది. ఈ సందర్భంగా కల్యాణంలోని ఆయా ఘట్టాలకు అనుగుణంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను వీనులవిందుగా గానం చేశారు. శ్రీవారు, అమ్మవార్ల కల్యాణ ఘట్టాన్ని తిలకించిన వేలాది మంది భక్తజనం చేసిన గోవిందనామ స్మరణతో వేదిక ఆవరణం మార్మోగింది.

మాజీ ప్రధాని, మాజీ సీఎంతో సహా
భక్తులందరు శ్రీవారి కల్యాణాన్ని చూసేందుకు వేదిక ప్రాంగణంలో పెద్ద సంఖ్యలో ఎల్ ఈ డి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. కల్యాణం అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ. కుమార స్వామి సౌజన్యంతో నిర్వహించిన శ్రీనివాస కల్యాణంలో మాజీ ప్రధాన మంత్రి దేవెగౌడ తన సతీమణి శ్రీమతి చెన్నమ్మ దేవెగౌడతో పాటు పాల్గొన్నారు.

శ్రీవారి భక్తులను లెక్క పెడుతామా
టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి పర్యవేక్షణలో తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ కృష్ణ శేషాచల దీక్షితులు, అర్చక బృందం నిర్వహించిన శ్రీనివాస కల్యాణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో వేలాది మంది శ్రీవారి భక్తులు పాల్గొన్నారు. ఆ సందర్బంగా భక్తులు కాల్చిన భాణాసంచాతో రామనగర పట్టణం దద్దరిల్లింది.












Click it and Unblock the Notifications