దివాలా మందు పని చేస్తుందా?: మొండి బకాయిలు రూ.10 లక్షల కోట్ల పై మాటే!

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ / ముంబై: బ్యాంకింగ్ రంగంలో మొండి బకాయిలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నది. దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వాటి వసూళ్లకు డెడ్‌లైన్ విధించింది. సోమవారం అర్ధరాత్రి విడుదలైన వివరాల ప్రకారం దివాలా చట్టంలో భాగంగా మొండి బకాయిదారులపై చర్యలు తీసుకునే అధికారం బ్యాంకులకు లభించనున్నది. వసూలు కానీ రూ.2,000 కోట్లు అంతకుమించిన రుణాలను సత్వరమే గుర్తించి, వెంటనే వాటిపై రిజల్యూషన్ ప్లాన్ (ఆర్పీ)ను ప్రవేశపెట్టాలి. ఈ ప్రణాళికలో భాగంగా సదరు మొండి బకాయిదారుల నుంచి అప్పులను వసూలు చేసుకోవడానికి ఉన్న అన్ని చర్యలను బ్యాంకులు స్వేచ్ఛగా తీసుకోవచ్చు.
ఈ ప్రక్రియ అంతా కూడా 180 రోజుల్లో ముగించాలని గడువు పెట్టిన రిజర్వ్ బ్యాంక్.. ఇందులో బ్యాంకులు విజయవంతం కాకపోతే మాత్రం ఆ ఖాతాలను మొండి బకాయిలుగా తీర్మానించాలని స్పష్టం చేసింది. 15 రోజుల్లోగా దివాలా కేసు నమోదు చేయవచ్చని పేర్కొన్నది. వచ్చేనెల ఒకటో తేదీ నుంచే కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. స్థూల మొండి బకాయిలు రమారమీ రూ.10 లక్షల కోట్ల పైనే ఉన్నాయంటే మన ఆర్థిక రంగం పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ మొండి బకాయిలు తగ్గాయని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం కొసమెరుపు.

ఫలితమివ్వని ఆర్బీఐ, కేంద్రం చర్యలు

ఫలితమివ్వని ఆర్బీఐ, కేంద్రం చర్యలు

మొండి బకాయిలు ముఖ్యంగా దేశీయ ప్రభుత్వరంగ బ్యాంకుల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. అటు ప్రభుత్వం, ఇటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మొండి బకాయిల సమస్య నివారణకు చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా.. ఫలితం మాత్రం శూన్యం. మూడు నెలలకోసారి బ్యాంకులు ప్రకటిస్తున్న ఆర్థిక ఫలితాలపై మొండి బకాయిల ప్రభావం కనిపిస్తూనే ఉన్నది. ప్రభుత్వ విధానాలు కావచ్చు, సర్కారీ బ్యాంకుల ఉదాసీన వైఖరి కావచ్చు.. యేటా మొండి బకాయిల భారం మాత్రం పెరుగుతూనే ఉన్నది. కార్పొరేట్లు తీసుకుంటున్న రుణాలే మొండి బకాయిలుగా మారుతున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ సంబంధిత కార్పొరేట్లు స్థాపించే సంస్థలు దివాళా తీస్తున్నాయే గానీ, వాటి యజమానులు మాత్రం యమ దర్జాగా జీవనం సాగిస్తున్నారు. విజయ్ మాల్య వంటి వారు బ్రిటన్‌కు పారిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. జగమొండిల అప్పుల ధాటికి ఆయా బ్యాంకుల లాభాలు ఆవిరైపోతూనే ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) మూడో త్రైమాసికానికి (అక్టోబర్-డిసెంబర్) విడుదలైన ఆర్థిక ఫలితాల్లో దేశంలోని సగానికిపైగా ప్రభుత్వ బ్యాంకులు నష్టాలే మూట గట్టుకున్నాయంటే అతిశయోక్తి కాదు.

కనీస నిల్వల్లేకుంటే జరిమానాలు విధించే ఎస్బీఐదే పెద్దన్న పాత్ర

కనీస నిల్వల్లేకుంటే జరిమానాలు విధించే ఎస్బీఐదే పెద్దన్న పాత్ర

14 బ్యాంకుల నష్టాలు దాదాపు రూ.17,000 కోట్లుగా ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ), ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ)ల నష్టాల విలువే సుమారు రూ.6,500 కోట్లు ఉండటం పరిస్థితి తీవ్రతకు అర్థం పడుతున్నది. ప్రభుత్వరంగ బ్యాంకులకు పెద్ద దిక్కుగా భావించే ఎస్‌బీఐ నికర నష్టాలైతే ఈ అక్టోబర్-డిసెంబర్ వ్యవధిలో ఏకీకృతంగా రూ.1,887 కోట్లు, స్టాండలోన్ ఆధారంగా రూ.2,416 కోట్లుగా ఉండటం గమనార్హం. ఖాతాల్లో కనీస నగదు నిల్వలు లేకపోతేనే జరిమానాలు వసూలు చేస్తున్న ఎస్‌బీఐని మొండి బకాయిలు గట్టిగానే దెబ్బ తీస్తున్నాయి. ఇక మరో నాలుగు బ్యాంకుల లాభాలు గతంతో పోల్చితే గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. విజయా బ్యాంక్ 65.45 శాతం, కెనరా బ్యాంక్ 61 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 55.73 శాతం, ఇండియన్ బ్యాంక్ 18.8 శాతం చొప్పున లాభాలను తగ్గించుకున్నాయి. దీనికీ మొండి బకాయిలు పెరుగడమేనని ఆయా బ్యాంకులు స్పష్టం చేశాయి.

అలహాబాద్, దేనా బ్యాంకులకు స్వల్ప లాభాలు

అలహాబాద్, దేనా బ్యాంకులకు స్వల్ప లాభాలు

దేశవ్యాప్తంగా మొత్తం 21 ప్రభుత్వరంగ బ్యాంకులు పనిచేస్తుండగా, మంగళవారంకల్లా అన్ని బ్యాంకుల త్రైమాసిక ఆర్థిక ఫలితాలు విడుదల అయ్యాయి. వీటిలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) మాత్రమే గతంతో పోల్చితే లాభాలను పెంచుకున్నది. ఈ అక్టోబర్ - డిసెంబర్‌లో 11 శాతం వృద్ధితో రూ.230 కోట్ల లాభాలను అందుకోగా, అంతకుముందు ఏడాది ఇదే వ్యవధిలో రూ.207 కోట్ల లాభాలను పొందింది. ఇక అలహాబాద్ బ్యాంక్, దేనా బ్యాంక్‌లు మాత్రమే నష్టాల నుంచి స్వల్ప లాభాల్లోకి రాగలిగాయి. కిందటిసారి అలహాబాద్ బ్యాంక్ రూ.486.14 కోట్ల నష్టాలను నమోదు చేయగా, దేనా బ్యాంక్‌కు రూ.662.85 కోట్ల నష్టం వాటిల్లింది. ఈసారి అలహాబాద్ బ్యాంక్ రూ.75.26 కోట్లు, దేనా బ్యాంక్ రూ.35.31 కోట్ల మేర లాభాలను అందుకున్నాయి.

బకాయిలు పెరిగిన మాటే నిజమని రేటింగ్ సంస్థల ఆందోళన

బకాయిలు పెరిగిన మాటే నిజమని రేటింగ్ సంస్థల ఆందోళన

ఒక వైపు నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ) రూ.10 లక్షల కోట్లకు చేరాయన్న అంచనాలు ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తుంటే పార్లమెంట్‌లో బ్యాంకుల్లో మొండి బకాయిలు స్వల్పంగా తగ్గినట్లు ప్రభుత్వం ప్రకటించడం విశేషం. గతేడాది జూన్ 30 నాటికి 10 శాతంగా ఉన్న మొండి బకాయిలు.. సెప్టెంబర్ 30 నాటికి 9.8 శాతానికి తగ్గినట్లు లోక్‌సభలో ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ్ ప్రతాప్ శుక్లా లిఖితపూర్వక సమాధానంలో చెప్పారు. మొండి బకాయిల సమస్యతో బాధపడుతున్న ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.2.11 లక్షల కోట్ల ఆర్థిక సాయాన్ని గతేడాది కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే రేటింగ్ ఏజెన్సీ ‘కేర్' మాత్రం గతేడాది డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికానికి బ్యాంకుల స్థూల మొండి బకాయిలు 34.5 శాతం పెరిగాయన్నది. 17 ప్రైవేట్‌రంగ బ్యాంకులు, 13 ప్రభుత్వరంగ బ్యాంకుల వ్యాపార లావాదేవీల ఆధారంగా నిర్వహించిన అధ్యయనంలో ఇది తేలింది. 2016 డిసెంబర్ నాటికి 8.34 శాతంగా ఉన్న మొండి బకాయిలు.. 2017 డిసెంబర్‌కు 9.45 శాతానికి ఎగబాకాయని కేర్ స్పష్టంచేసింది. ప్రైవేట్‌రంగ బ్యాంకుల్లో ఎన్‌పీఏల నిష్పత్తి 4.1 శాతంగా ఉంటే, ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 12.4 శాతంగా ఉన్నట్లు వెల్లడించింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Reserve Bank of India (RBI) unearthed about $3.6 billion (Rs. 23,200 crore) of bad loans in the books of the country's biggest bank, amplifying questions about distress in the financial sector given underreporting by some rivals as well.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X