'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్' వేళ బిగ్ షాక్.. అమెజాన్‌లో మళ్లీ లేఆఫ్స్!
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి ఉద్యోగులకు షాకిచ్చింది. పండగ వాతావరణంలో ప్రపంచవ్యాప్తంగా తన రీటైల్ విభాగానికి సంబంధించిన పలు విభాగాల్లో కొత్తగా లేఆఫ్స్ ప్రకటించింది. భారత్, అమెరికా, బ్రిటన్‌లలో ఉన్న వినియోగదారుల సేవలు, సెల్లింగ్ పార్ట్‌నర్ సేవలు, మార్కెట్ ప్లేస్ సపోర్ట్, ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన ఉద్యోగులపై ఈ ప్రభావం పడింది.
గ్లోబల్‌గా 1,000 కంటే తక్కువ సంఖ్యలోనే వైట్ కాలర్ ఉద్యోగులు ఈ లేఆఫ్స్ ద్వారా ప్రభావితమయ్యారని సమాచారం. దీనిపై అమెజాన్ స్పందిస్తూ.. తమ ప్రధాన ఈ-కామర్స్ కార్యకలాపాలను నిర్వహించే స్టోర్స్ విభాగంలో సంస్థాగత ప్రాధాన్యతలకు అనుగుణంగా మార్పులు చేస్తున్నామని, ఇందులో భాగంగానే కొన్ని పరిమిత సంఖ్యలోని పోస్టులను తొలగించాల్సి వచ్చిందని ధ్రువీకరించింది.

ఈ లేఆఫ్స్ సరిగ్గా అమెజాన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్'సేల్ సమయంలోనే వెలుగులోకి రావడం గమనార్హం. ఉద్యోగులు తమ ఆందోళనలను, ఉద్యోగాలు కోల్పోయిన వార్తలను స్లాక్ వంటి సంస్థాగత కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పంచుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే అమెజాన్‌లో ఉద్యోగుల తొలగింపులు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది చివరి నుంచి 2026 జనవరి మధ్య కాలంలో వ్యయాలను తగ్గించుకోవడానికి, బ్యూరోక్రసీని తొలగించడానికి దాదాపు 30,000 కార్పొరేట్ ఉద్యోగాలను అమెజాన్ ఇప్పటికే తొలగించింది. తాజా లేఫ్స్ సంఖ్య పరంగా చిన్నవే అయినప్పటికీ.. సంస్థలో పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని ఇవి స్పష్టం చేస్తున్నాయి.
మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగానికి అమెజాన్ పెద్దపీట వేస్తోంది. ఏఐ డేటా సెంటర్లు, చిప్స్, సంబంధిత మౌలిక సదుపాయాల కోసం దాదాపు 220 బిలియన్ డాలర్ల భారీ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ వ్యయ సమీకరణలో భాగంలోనే సాంప్రదాయ విభాగాల్లో ఉద్యోగాల సంఖ్యను క్రమబద్దీకరిస్తోంది. ఇటీవలే బెంగళూరులో ఆసియాలోనే తన రెండో అతిపెద్ద క్యాంపస్ ను ప్రారంభించి భారత్‌పై తమకు ఉన్న నమ్మకాన్ని అమెజాన్ చాటుకుంది. కాబట్టి ఈ తాజా లేఆఫ్స్ భారత్ నుంచి అమెజాన్ వెనక్కి తగ్గడానికి సంకేతం కాదని, మారుతున్న సాంకేతిక అవసరాలకు అనుగుణంగా తమ వనరులను, ఉద్యోగుల కేటాయింపులను పునర్వ్యవస్థీకరించడంలో భాగమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.














Click it and Unblock the Notifications
