ఎలన్ మస్క్‌కు గట్టి షాకిచ్చిన కేంద్రం! రూల్స్ అందరికీ ఒకటే..
భారతదేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించే విషయంలో ప్రపంచ కుబేరుడు, స్పేస్‌ఎక్స్ అధినేతి ఎలన్ మస్క్ కు, భారత ప్రభుత్వం మధ్య ఆసక్తికరమైన పోరు నెలకొంది. భారతదేశంలో స్టార్‌లింక్ సేవలు అందుబాటులోకి రాకుండా కొందరు స్వదేశీ పారిశ్రామిక వేత్తలు (ఓలిగార్క్స్) అడ్డుకుంటున్నారని, ఇది భారత ప్రజలకు జరుగుతున్న అన్యాయమని మస్క్ సోషల్ మీడియా వేదికగా సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తక్షణమే స్పందిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చింది. దేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ రంగానికి సంబంధించి ప్రభుత్వం రూపొందించిన నిబంధనలు అత్యంత పారదర్శకంగా, పక్షపాతం లేకుండా అందరికీ సమానంగా వర్తిస్తాయని స్పష్టం చేసింది.
స్టార్‌లింక్‌కు అనుమతులు ఇవ్వడంలో ఎలాంటి వివక్ష చూపడం లేదని స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం.. ప్రస్తుతం శాటిలైట్ ఇంటర్నెట్ సేవల కోసం దేశంలో లైసెన్స్ పొందిన మూడు సంస్థలు కూడా ఒకే రకమైన నిబంధనల ప్రక్రియలో ఉన్నాయని వెల్లడించింది.

భారతీయ వినియోగదారుల డేటా భద్రత, దేశ రక్షణ అత్యంత కీలకమైన అంశాలని, అందుకే సదరు సంస్థలు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో పరిశీలించే ప్రాసెస్ నడుస్తోందని అధికారులు తెలిపారు. ఈ సెక్యూరిటీ అసెస్‌మెంట్ పూర్తయిన తర్వాతే స్పెక్ట్రమ్ కేటాయింపులు జరుగుతాయని, కాబట్టి నిబంధనలు అన్యాయంగా ఉన్నాయనడం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు.
భారత్ కోసం ప్రత్యేకం.. 20 గేట్‌వే సెంటర్లు రెడీ!
మరోవైపు, ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026 సదస్సులో మాట్లాడిన స్టార్‌లింక్ బిజినెస్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ లారెన్ డ్రెయర్, భారత ప్రభుత్వ భద్రతా నిబంధనలను తాము గౌరవిస్తున్నామని తెలిపారు. భారతీయ వినియోగదారుల డేటాను దేశ పరిధిలోనే ఉంచేలా ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. ఇందుకోసం ఇప్పటికే భారతదేశంలో వందలాది యాంటెన్నాలతో కూడిన 20 గేట్‌వే సైట్‌లను, అవసరమైన మౌలిక సదుపాయాలను సిద్ధం చేశామన్నారు. గత ఐదేళ్లుగా భారతీయ నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేస్తూ ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంతాలకు డిజిటల్ వెలుగులు
ఇండియాలోని మారుమూల గ్రామాలు, నెట్‌వర్క్ సరిగా లేని ప్రాంతాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ అందించడంలో స్టార్‌లింక్ కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. డిజిటల్ రంగంలో భారత్ సాధించిన ప్రగతి అద్భుతమైనదని కొనియాడిన స్టార్‌లింక్ యాజమాన్యం.. తమ సేవలు త్వరలోనే ప్రారంభమవుతాయనే ధీమాతో ఉంది. ఏది ఏమైనా భద్రతా అనుమతులు పూర్తయి, స్పెక్ట్రమ్ కేటాయింపులు జరిగితేనే శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు భారతీయులకు అందుబాటులోకి రానున్నాయి.














Click it and Unblock the Notifications
