Jio కు ఊహించని షాకిచ్చిన కస్టమర్లు, ఒక్క నెలలోనే తారుమారు
భారత టెలికాం రంగంలో దిగ్గజాల మధ్య పోటీ మరింత తీవ్రరూపం దాల్చింది. దేశంలోనే అతిపెద్ద టెలికాం నెట్‌వర్క్‌గా నిలిచేందుకు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ హోరాహోరీగా తలపడుతున్నాయి. అయితే జులై నెలకు సంబంధించి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా - ట్రాయ్ విడుదల చేసిన తాజా గణాంకాల్లో భారతీ ఎయిర్‌టెల్ ఊహించని విజయాన్ని నమోదు చేసింది. కొత్త మొబైల్ వినియోగదారులను ఆకర్షించడంలో నెట్‌వర్క్ దిగ్గజం జియోను కూడా దాటుకుని ఎయిర్‌టెల్ అగ్రస్థానంలో నిలిచింది. ఒకే నెలలో అత్యధిక సంఖ్యలో సబ్‌స్క్రైబర్లను సొంతం చేసుకుని టెలికాం రేసులో తన ఆధిపత్యాన్ని చాటుకుంది.
ఒక్క నెలలోనే 26 లక్షలకు పైగా కొత్త కస్టమర్లు!
ట్రాయ్ లెక్కల ప్రకారం.. జులై నెలలో భారతీ ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌లోకి కొత్తగా 26.9 లక్షల మంది మొబైల్ వినియోగదారులు చేరారు. దీంతో ఎయిర్‌టెల్ మొత్తం యూజర్ల సంఖ్య 48.94 కోట్లకు చేరుకుంది. ఇక ప్రధాన పోటీదారు రిలయన్స్ జియో 24.5 లక్షల మంది కొత్త యూజర్లను పొంది, 50.60 కోట్ల మొత్తం సబ్‌స్క్రైబర్లతో రెండవ స్థానానికి పరిమితమైంది.

మరోవైపు ఆర్థిక సంక్షోభంతో ఇబ్బంది పడుతున్న వోడాఫోన్ ఐడియా (Vi) 2.4 లక్షల మంది వినియోగదారులను, ప్రభుత్వ రంగానికి చెందిన బిఎస్‌ఎన్ఎల్ (BSNL) 1.68 లక్షల మంది యూజర్లను తమ ఖాతాలో వేసుకున్నాయి. జులై నెలలో పెరిగిన మొత్తం 55.4 లక్షల కొత్త కస్టమర్లలో ఏకంగా 51.4 లక్షల మందిని ఎయిర్‌టెల్, జియో కంపెనీలే గెలుచుకోవడం విశేషం.
యాక్టివ్ యూజర్లలోనూ ఎయిర్‌టెల్ హవా
కేవలం కాగితాలపై ఉండే సబ్‌స్క్రైబర్ల సంఖ్య మాత్రమే కాకుండా, నెట్‌వర్క్‌ను నిరంతరం ఉపయోగించే 'యాక్టివ్ యూజర్ల'విభాగంలోనూ ఎయిర్‌టెల్ స్పష్టమైన ఆధిక్యం చూపించింది. జులై నెలలో ఎయిర్‌టెల్ కొత్తగా 19.3 లక్షల మంది యాక్టివ్ యూజర్లను సొంతం చేసుకోగా, జియో కేవలం 11.6 లక్షల మంది యాక్టివ్ కస్టమర్లను మాత్రమే పొందగలిగింది.
బిఎస్‌ఎన్ఎల్ మొత్తం సబ్‌స్క్రైబర్ల సంఖ్య పెరిగినప్పటికీ, వాస్తవంగా సిమ్‌లు ఉపయోగించే యాక్టివ్ కస్టమర్ల సంఖ్య మాత్రం సుమారు 4.28 లక్షలు తగ్గడం గమనార్హం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం మొబైల్ కస్టమర్లలో 93.48 శాతం మంది నెట్‌వర్క్‌లలో చురుగ్గా ఉన్నారు.
ఫైబర్, మెషిన్-టు-మెషిన్ విభాగాల్లో సత్తా!
హోమ్ ఇంటర్నెట్ కోసం ఉపయోగించే 5G ఫిక్స్డ్ వైర్‌లెస్ యాక్సెస్ విభాగంలో జియో 1.55 లక్షల కొత్త కస్టమర్లను జోడించి 92.7 లక్షల యూజర్లతో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఇందులో ఎయిర్‌టెల్ 1.16 లక్షల మందిని చేర్చుకుని 39.4 లక్షల వినియోగదారులకు చేరింది.
అయితే డిజిటల్ విప్లవంలో భాగంగా ఎదుగుతున్న మెషిన్-టు-మెషిన్, ఐఓటీ కనెక్షన్ల రంగంలో మాత్రం ఎయిర్‌టెల్ తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఈ విభాగంలో ఎయిర్‌టెల్ ఏకంగా 16.8 లక్షల కొత్త కనెక్షన్లను సాధించి మొత్తం 8.44 కోట్ల సబ్‌స్క్రైబర్లతో ముందంజలో ఉంది. మొత్తంగా దేశంలో వైర్‌లెస్ , ల్యాండ్‌లైన్ వినియోగదారుల సంఖ్య 135.4 కోట్లకు చేరడంతో భారత టెలికాం రంగానికి తిరుగులేదని మరోసారి రుజువైంది.














Click it and Unblock the Notifications