దీపావళికి మోదీ 'డబుల్' గిఫ్ట్.. ధరలు తగ్గే వస్తువులు ఇవే!
దేశవ్యాప్తంగా పన్ను చెల్లింపుదారులకు ప్రధాని నరేంద్ర మోడీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం సందర్భంగా ఎర్రకోట నుంచి గుడ్ న్యూస్ చెప్పారు. ఈ ఏడాది దీపావళి నుంచి జీఎస్టీ స్లాబ్‌లను తగ్గించబోతున్నట్లు ఆయన వెల్లడించారు. దీంతో కేంద్రం ఏయే స్లాబ్‌లను తగ్గించబోతోంది, ఎంత మేర తగ్గించబోతోందన్న చర్చలు దేశవ్యాప్తంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ వర్గాలు దీనిపై కొంత మేర క్లారిటీ ఇస్తున్నాయి.
అయితే కొన్ని వస్తువులకు జీఎస్టీ తగ్గించడం వల్ల వినియోగదారులకు లాభం చేకూరనుంది. దీంతో నిత్యావసరాలు మరింత సరసమైనవిగా మారనున్నాయి. అయితే సిన్ గూడ్స్ కోసం కొత్తగా 40శాతం జీఎస్టీ శ్లాబ్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దేశంలో పన్ను భారాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రకటించిన ఈ జీఎస్టీ సంస్కరణలు 2025 దీపావళి నాటికి అమలులోకి వచ్చే అవకాశం ఉంది.

ఏమి చౌకగా మారనున్నాయి?
జీఎస్టీ సంస్కరణల గురించి తెలిసిన వర్గాల ప్రకారం.. ఈ మార్పుల వల్ల నిత్యావసర వస్తువులు, కిరాణా సామాగ్రి, మందులు, టీవీలు, వాషింగ్ మెషీన్లు వంటి అనేక వస్తువుల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. వీటితో పాటు వ్యవసాయ పరికరాలు, సైకిళ్లు, ఇన్సూరెన్స్, విద్యా సేవలు కూడా చౌకగా మారే అవకాశం ఉంది.
కొత్త జీఎస్టీ శ్లాబ్‌లు
ప్రస్తుతం ఉన్న 12శాతం జీఎస్టీ శ్లాబ్‌లో ఉన్న వస్తువులలో దాదాపు 99 శాతం వస్తువులు 5 శాతం శ్లాబ్‌లోకి రానున్నాయి. అలాగే 28 శాతం శ్లాబ్‌లో ఉన్న వస్తువులు 18శాతం శ్లాబ్‌లోకి రానున్నాయి. అయితే సిగరెట్లు, బీర్ వంటి సిన్ గూడ్స్‌పై అదనంగా 40% జీఎస్టీ శ్లాబ్‌ను ప్రవేశపెట్టనున్నారు.
ఏ వస్తువుల ధరలు తగ్గుతాయి?
ప్రస్తుతం 12% పన్ను ఉన్న కండెన్స్‌డ్ మిల్క్, డ్రై ఫ్రూట్స్, ఫ్రోజెన్ వెజిటేబుల్స్, సాసేజ్‌లు, పాస్తా, జామ్‌లు, భుజియాతో సహా నమ్‌కీన్‌లు, టూత్ పౌడర్, ఫీడింగ్ బాటిల్స్, తివాచీలు, గొడుగులు, సైకిళ్ళు, పాత్రలు, ఫర్నిచర్, పెన్సిల్‌లు, జనపనార లేదా పత్తితో చేసిన హ్యాండ్‌బ్యాగ్‌లు, రూ.1,000 కంటే తక్కువ ధర ఉన్న చెప్పులు వంటి వస్తువుల ధరలు తగ్గుతాయి.
ప్రభుత్వ ప్రక్రియ
కేంద్ర ప్రభుత్వం తన ప్రతిపాదనలను జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణను పరిశీలించే మంత్రుల బృందానికి పంపింది. ఈ బృందం తన సిఫార్సులను జీఎస్టీ మండలికి సమర్పిస్తుంది. జీఎస్టీ మండలిలో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఉంటారు, దీనికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహిస్తారు. ఈ ప్రతిపాదనలను ఆమోదించడం, మార్పులతో ఆమోదించడం లేదా తిరస్కరించడం మండలికి అధికారం ఉంటుంది.
ప్రధాని మోదీ మాట్లాడుతూ, "దేశవ్యాప్తంగా పన్ను భారాన్ని తగ్గించడానికి మేము తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలను తీసుకువస్తున్నాము. ఈ దీపావళికి నేను మీకు రెట్టింపు దీపావళిని ఇవ్వబోతున్నాను. ఈ దీపావళికి, నా తోటి దేశస్థులకు ఒక అద్భుతమైన బహుమతి లభిస్తుంది" అని అన్నారు.












Click it and Unblock the Notifications