అంతా ధంతేరస్ మహిమ.. ఒక్కరోజే రూ.10,000 కోట్ల వ్యాపారం !
ధనత్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భారతదేశ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. కార్లు, బంగారం, ఎలక్ట్రానిక్ వస్తువులు, కిరాణా వరకు అన్ని విభాగాల్లో అమ్మకాలు పెరిగాయి. ముఖ్యంగా ఆటోమొబైల్ రంగం కొత్త రికార్డులు సృష్టించింది. కేవలం 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా లక్షకు పైగా కార్లు డెలివరీ అయ్యాయి. పరిశ్రమ వర్గాల అంచనాల ప్రకారం ఈ ఒక్కరోజు అమ్మకాల విలువ రూ. 8,500 కోట్ల నుంచి రూ. 10,000 కోట్ల మధ్య ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
ధంతేరస్ మహిమ..
ఓ వైపు ధనత్రయోదశి.. మరోవైపు జీఎస్టీ 2.0 సంస్కరణలు.. ఇవి రెండు కలిసి పండుగ సీజన్‌లో సేల్స్ ని ఆకాశానికి పెంచేశాయని భావిస్తున్నారు. అంతే కాకుండా భారతీయ సంప్రదాయం ప్రకారం ఈ రోజున వాహనాల కొనుగోళ్లు శుభప్రదమని భావిస్తారు. అందుకే ఈ రికార్లు సాధ్యమయ్యాయని వ్యాపార విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కాగా దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అయిన మారుతీ సుజుకి, టాటా మోటార్స్, హ్యుందాయ్ మోటార్ ఇండియా తమ అమ్మకాలతో మార్కెట్‌లో దూసుకుపోయాయి. వినియోగదారుల కొనుగోలు శక్తి పెరగడం, బ్యాంకులు ఇచ్చిన తక్కువ వడ్డీ రుణాలు, ఆకర్షణీయమైన ఫైనాన్స్ స్కీములు ఈ అమ్మకాలకు బలం చేకూర్చాయని అంటున్నారు.
అంతే కాకుండా ఆటోమొబైల్ రంగంతో పాటు నగల రంగం కూడా ధనత్రయోదశి ఉత్సాహాన్ని కనబరిచింది. ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (GJC) ప్రకారం బంగారం, వెండి అమ్మకాలు విలువ పరంగా 25 శాతం పైగా పెరిగాయి. జీజీసీ ఛైర్మన్ రాజేష్ రోక్డే మాట్లాడుతూ.. "ఈ సీజన్‌లో నగల అమ్మకాలు రూ. 50,000 కోట్ల మార్క్‌ను దాటుతాయని అంచనా" వేశామన్నారు.
మరోవైపు ధనత్రయోదశి రోజున దేశవ్యాప్తంగా జరిగిన వ్యాపారం మొత్తం రూ. 1 లక్ష కోట్లను దాటినట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) తెలిపింది. ఈ వాణిజ్య ఉత్సాహం కేవలం నగరాలకే పరిమితం కాకుండా, టియర్-2, టియర్-3 పట్టణాల వరకు విస్తరించిందని సంస్థ పేర్కొంది. పన్ను సంస్కరణలు, వినియోగదారుల విశ్వాసం ఈ రికార్డు స్థాయి అమ్మకాలకు కారణమయ్యాయి. దీపావళి, ధనత్రయోదశి వంటి పండుగలు భారత మార్కెట్ ఆర్థిక స్తోమతను ప్రతిబింబిస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.












Click it and Unblock the Notifications