రూపాయికి శాపం.. త్రిశూల వ్యూహంతో చరిత్ర చూడని పతనం..
భారత కరెన్సీ రూపాయికి కాలం కలిసి రావడం లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితి, ఆకాశాన్నంటుతున్న ముడిచమురు ధరలు దేశీ రూపాయిని కోలుకోలేని దెబ్బ తీశాయి. బుధవారం నాటి ట్రేడింగ్‌లో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 95.8 వద్ద ఆల్‌టైమ్ కనిష్ట స్థాయిని తాకడం మార్కెట్ వర్గాలను ఆందోళనలోకి నెట్టింది. చమురు సెగలు, విదేశీ నిధుల తరలింపు వంటి ప్రతికూలతలు రూపాయిని విలవిలలాడేలా చేస్తున్నాయి. రూపాయి పతనానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి.
- ముడిచమురు సెగ: బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 107 డాలర్లకు చేరువ కావడంతో భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలపై భారం పెరిగింది.
- నిధుల ఉపసంహరణ: పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIలు) మే నెల మొదటి వారంలోనే రూ. 21,469 కోట్లను భారత మార్కెట్ నుండి వెనక్కి తీసుకున్నారు.
- గ్లోబల్ అనిశ్చితి: అంతర్జాతీయ పరిస్థితులు మారకపు విలువపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి.

అండగా నిలుస్తున్న దేశీ ఇన్వెస్టర్లు
విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపుతున్నా, దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (DIIలు) మార్కెట్‌ను ఆదుకుంటున్నారు. మే మొదటి ఏడు సెషన్లలో వీరు రూ. 35,323 కోట్లను పెట్టుబడిగా పెట్టి, అమ్మకాల ఒత్తిడిని చాలా వరకు తగ్గించగలిగారు. అయినప్పటికీ, బాహ్య ఆర్థిక సమతుల్యత , పెరుగుతున్న వాణిజ్య లోటుపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.
బంగారంపై భారం.. దిగుమతులకు బ్రేక్!
రూపాయి పతనాన్ని అడ్డుకోవడానికి, విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మంగళవారం అర్థరాత్రి కీలక నిర్ణయం తీసుకుంది. బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని ఏకంగా 6% నుండి 15%కి పెంచింది. మే 13, 2026 నుండి అమలులోకి వచ్చిన ఈ కొత్త నిబంధనల ప్రకారం.. 10% ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీతో పాటు 5% అగ్రికల్చర్ సెస్ (AIDC) చెల్లించాల్సి ఉంటుంది. ఇది కేవలం బంగారం, వెండికే కాకుండా ప్లాటినం , పారిశ్రామిక విలువైన లోహాల దిగుమతులకు కూడా వర్తిస్తుంది.
ప్రధాని హెచ్చరిక.. కఠిన నియంత్రణలు
ఇంధన పొదుపు , అనవసరమైన దిగుమతులను తగ్గించుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దేశ ఆర్థిక పరిస్థితి తీవ్రతను సూచిస్తున్నాయి. యూఏఈ నుండి దిగుమతి చేసుకునే బంగారంపై గతంలో ఉన్న రాయితీలను కూడా ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ముడిచమురు ధరలు ఇలాగే అధికంగా కొనసాగితే, చెల్లింపుల సమతుల్యత (Balance-of-Payments) దెబ్బతినే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.














Click it and Unblock the Notifications