Digital Gold: డిజిటల్ గోల్డ్ పెట్టుబడులపై సెబీ హెచ్చరికలు..! ఇవి బెటర్..!
గతంలో బంగారం కొనాలంటే షాపుకే వెళ్లాలి, పెట్టుబడిగా పెట్టాలంటే లాకర్లో దాచుకోవాలనేలా పరిస్ధితి ఉండేది. కానీ ఆధునిక కాలంలో ఫిన్ టెక్ యాప్స్ వచ్చేశాయి. రోజుకు 50 రూపాయలు, 100 రూపాయలు బంగారంలో సేవ్ చేసుకోండి, మీకు కావాల్సినప్పుడు ఆ రోజు రేటుతో బంగారం ఇంటికే పంపిస్తాం అంటున్నాయి. దీంతో వయసుతో సంబంధం లేకుండా చిన్నా పెద్దా ఇందులో సేవ్ చేసుకుని పెట్టుబడి పెట్టుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. అలాంటి వారికి సెక్యూరిటీస్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) కీలక హెచ్చరిక చేస్తోంది.
డిజిటల్ గోల్డ్ పై సెబీ అలర్ట్
తాజాగా ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు అందించే "డిజిటల్ గోల్డ్" లేదా "ఇ-గోల్డ్" కొనుగోలు చేయకుండా పెట్టుబడిదారులను హెచ్చరిస్తూ సెబీ బహిరంగ హెచ్చరిక జారీ చేసింది. వీటిపై నియంత్రణ ఉండదని, సెక్యూరిటీలు లేదా కమోడిటీ డెరివేటివ్‌లుగా వర్గీకరించబడలేదని, అందువల్ల ఇవి ప్రభుత్వ అధికార పరిధికి బయట పనిచేస్తాయని వెల్లడించింది. సదరు డిజిటల్ గోల్డ్ ప్లాట్‌ఫామ్ రేపు కూలిపోతే, మీ డబ్బు పోతుంది,, సెబీ పెట్టుబడిదారుల భద్రతా చట్రం కింద మీకు చట్టపరమైన రక్షణ ఉండదని హెచ్చరించింది.

ఎందుకు వద్దు ?
కొన్ని డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు పెట్టుబడిదారులకు డిజిటల్ గోల్డ్/ఇ-గోల్డ్ ఉత్పత్తులలో పెట్టుబడి పెట్టమని ఆఫర్ చేస్తున్నారని, వీటిని భౌతిక బంగారానికి సులభమైన ప్రత్యామ్నాయాలుగా మార్కెట్ చేస్తున్నారని సెబీ తెలిపింది. కానీ ఈ ఉత్పత్తులకు గోల్డ్ ఈటీఎఫ్ లు, ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ కమోడిటీ కాంట్రాక్టులు లేదా ఎలక్ట్రానిక్ గోల్డ్ రసీదులు వంటి సెబీ-నియంత్రిత బంగారు సాధనాలతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఇలాంటి డిజిటల్ గోల్డ్ ఉత్పత్తులు సెబీ-నియంత్రిత బంగారు ఉత్పత్తులకు భిన్నంగా ఉంటాయని, అవి సెక్యూరిటీలుగా తెలియజేయబడవని, అలాగే కమోడిటీ డెరివేటివ్‌లుగా నియంత్రించబడవని తేల్చేసింది.
దివాళా తీస్తే సెబీకీ కష్టమే
ఇంకా సులువుగా చెప్పాలంటే ఫోన్ పే వంటి ఫిన్ టెక్ యాప్స్ దివాళా తీస్తే, లేదా మీకు ఇవ్వాల్సిన బంగారాన్ని ఇవ్వకుండా ఆలస్యం చేస్తే సెబీ మీకు సహాయం చేసే పరిస్ధిది లేదని చెబుతోంది. డిజిటల్ గోల్డ్ ప్లాట్‌ఫారమ్‌లు నియంత్రణ పర్యవేక్షణ లేకుండా పనిచేస్తాయని, దీనివల్ల పెట్టుబడిదారులు వాటి విశ్వసనీయతను అంచనా వేయడం కష్టమవుతుందని నిపుణులు చెప్తున్నారు.వీటిలో ఏవి సురక్షితమైనవో మరియు ఏవి కాదో గుర్తించడం కష్టమంటున్నారు.
అసలు సమస్య ఇదే
ఉదాహరణకు మీరు యాప్ ద్వారా రూ.500 విలువైన బంగారాన్ని కొనుగోలు చేస్తారు. ఆ కంపెనీ కస్టోడియన్ ఉన్న ఖజానాలో సమానమైన బంగారాన్ని నిల్వ చేస్తుందని చెబుతుంది. కొన్ని ప్లాట్‌ఫామ్‌లు మీ బంగారాన్ని తరువాత భౌతిక బంగారంగా మార్చడానికి కూడా మిమ్మల్ని అనుమతిస్తాయి.సమస్య ఏమిటంటే బంగారం ఖజానాలో ఉందని ఎవరు తనిఖీ చేస్తారు, ఆడిట్ చేస్తారు లేదా హామీ ఇస్తారు అనే దానికి యూనిఫామ్ రూల్స్ లేవు. ప్లాట్‌ఫామ్ దివాలా తీస్తే ఏమి జరుగుతుందో నిర్వచించే స్పష్టమైన చట్టపరమైన చట్రం కూడా లేదు. కాబట్టి సెబీ బంగారం కొనొద్దు అని చెప్పడం లేదు. నష్టాలను తెలుసుకోకుండా నియంత్రించబడని బంగారాన్ని కొనొద్దని చెబుతోంది.

ప్రత్యామ్నాయాలేంటి ?
ప్రత్యామ్నాయంగా స్టాక్ ఎక్స్ఛేంజీలలో వర్తకం చేసే గోల్డ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ETFలు) మరియు ఎలక్ట్రానిక్ గోల్డ్ రసీదులు (EGRలు) వంటి నియంత్రిత బంగారు ఉత్పత్తులకు పెట్టుబడిదారులు ప్రాధాన్యం ఇవ్వాలని సెబీ సూచిస్తోంది. గోల్డ్ ఈటీఎఫ్ లు భౌతిక బంగారంలో పెట్టుబడి పెట్టే మ్యూచువల్ ఫండ్ పథకాలు. ప్రతి యూనిట్ ఒక నిర్దిష్ట పరిమాణంలో బంగారాన్ని సూచిస్తుంది, సాధారణంగా ఒక గ్రాము. బంగారాన్ని అధీకృత కస్టోడియన్ కలిగి ఉంటుంది. క్రమం తప్పకుండా ఆడిట్ చేస్తారు. ఇవి స్టాక్ ఎక్స్ఛేంజీలలో వర్తకం చేస్తాయి కాబట్టి పెట్టుబడిదారులు తమ డీమ్యాట్ ఖాతాల ద్వారా ఎప్పుడైనా యూనిట్లను కొనుగోలు చేయవచ్చు లేదా అమ్మవచ్చు.












Click it and Unblock the Notifications