కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ! స్టాక్ మార్కెట్లకు భారీ షాక్..
పశ్చిమాసియాలో ముదిరిన యుద్ధ మేఘాలు భారత స్టాక్ మార్కెట్లను తీవ్ర కలవరానికి గురిచేశాయి. అమెరికా, ఇరాన్ మధ్య రాజుకున్న దాడుల విలయం దెబ్బకు బుధవారం దేశీయ సూచీలు భారీ పతనాన్ని చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల సంకేతాలు, క్రూడ్ ఆయిల్ ధరలు భయపెట్టే స్థాయిలో పెరగడంతో ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు ఒడిగట్టారు. దీంతో ఒకానొక దశలో సెన్సెక్స్ ఏకంగా 400 పాయింట్లకు పైగా కుప్పకూలగా, నిఫ్టీ కీలకమైన 23,900 స్థాయికి దిగువన ముగిసి ఇన్వెస్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది.
మార్కెట్లు ఇంతలా కుప్పకూలడానికి ప్రధాన కారణం ముడి చమురు ధరల్లో వచ్చిన ఆకస్మిక పెరుగుదలే! అమెరికా జరిపిన వైమానిక దాడులకు ప్రతిగా ఇరాన్ విరుచుకుపడటంతో అంతర్జాతీయ చమురు మార్కెట్ భగ్గుమంది. బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా 5 శాతం వరకు ఎగబాకి బ్యారెల్‌కు 95.4 నుండి 96 డాలర్ల స్థాయికి చేరింది. చమురు అవసరాల కోసం విదేశాలపైనే ఎక్కువగా ఆధారపడే మన భారతదేశానికి ఇది కోలుకోలేని దెబ్బ. చమురు ధరలు పెరిగితే దేశంలో ద్రవ్యోల్బణం పెరగడంతో పాటు, దిగుమతి బిల్లులు భారం కావడం ఖాయం. ఈ భయమే స్టాక్ మార్కెట్లను పాతాళానికి నెట్టింది.

గ్లోబల్ మార్కెట్లలో కల్లోలం: పెరిగిన అమెరికా బాండ్ ఈల్డ్స్!
మన మార్కెట్లే కాదు.. ఆసియా వ్యాప్తంగా ఉన్న ప్రధాన స్టాక్ మార్కెట్లు అన్నీ నష్టాల బాటపట్టాయి. సౌత్ కొరియా కోస్పి ఏకంగా 3 శాతానికి పైగా పడిపోగా, జపాన్ నిక్కీ కూడా అదే బాటలో పతనమైంది. అటు అమెరికాలోని వాల్ స్ట్రీట్ మార్కెట్లు, యూఎస్ 10-ఇయర్స్ బాండ్ ఈల్డ్స్ 4.79 శాతానికి చేరుకోవడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. అమెరికాలో వడ్డీ రేట్లు మళ్లీ పెరిగే అవకాశం ఉందన్న సంకేతాలతో విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు మార్కెట్లలో భయాందోళనను సూచించే 'ఇండియా విక్స్' 5 శాతానికి పైగా పెరిగి 11.76 వద్ద నిలిచింది.
పెట్రోల్, టైర్లు, పెయింట్స్ షేర్లు డౌన్.. మెరిసిన కోల్ ఇండియా!
చమురు ధరల ధాటికి పెట్రోలియం, పెయింట్స్, టైర్ , విమానయాన రంగానికి చెందిన కంపెనీల షేర్లు విపరీతంగా నష్టపోయాయి. హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ , ఐఓసీ వంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు.. సీయట్, జేకే టైర్, ఎంఆర్‌ఎఫ్ వంటి టైర్ తయారీదారులు.. పాయింట్ రంగంలో ఏషియన్ పెయింట్స్, విమానయాన దిగ్గజం ఇండిగో షేర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అయితే, ఈ పతనంలోనూ ప్రభుత్వ రంగ దిగ్గజం 'కోల్ ఇండియా' మెరుపులు మెరిపించింది. ఆగస్టు నెలలో బొగ్గు సరఫరా 5.5 శాతం పెరిగిందన్న వార్తలతో పాటు, తన అనుబంధ సంస్థ ఐపీఓ ప్రతిపాదనల కారణంగా కోల్ ఇండియా షేరు ఏకంగా 3.6 శాతం లాభంతో ముగిసింది.
ఇన్వెస్టర్లు ఏం చేయాలి? నిపుణులు ఏమంటున్నారు?
ప్రస్తుతానికి మార్కెట్లో అనిశ్చితి కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పశ్చిమాసియా యుద్ధ పరిణామాలు, క్రూడ్ ఆయిల్ ధరల కదలికలే మార్కెట్ దిశానిర్దేశాన్ని నిర్ణయిస్తాయి. సాంకేతికంగా చూస్తే నిఫ్టీకి 24,000 మార్క్ వద్ద గట్టి మద్దతు కోల్పోవడంతో రానున్న రోజుల్లో 23,800 స్థాయి ప్రాముఖ్యత సంతరించుకోనుంది. ఇన్వెస్టర్లు తొందరపడి కొనుగోళ్లు చేయకుండా, మార్కెట్ స్థిరపడే వరకు కాస్త జాగ్రత్తగా, అప్రమత్తంగా వ్యవహరించడమే మేలని విశ్లేషకులు సూచిస్తున్నారు.














Click it and Unblock the Notifications