Simple Energy : ఒక్క సారి ఛార్జింగ్ పెడితే 400 కి.మీ రేంజ్. లైఫ్ టైం బ్యాటరీ వారెంటీ
భారత్ లో విద్యుత్ ద్విచక్ర వాహనాల వినియోగం వేగంగా పెరుగుతున్న వేళ, బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ వాహన తయారీ సంస్థ సింపుల్ ఎనర్జీ సంచలన ప్రకటన చేసింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 400 కిలోమీటర్ల దూరం ప్రయాణించే బైక్ ను లాంఛ్ చేసింది. తమ సెకండ్ జనరేషన్ స్కూటర్లను దేశీయ మార్కెట్‌లో ప్రవేశపెట్టి ఈవీ మార్కెట్ ను షేక్ చేసింది. వాహనదారుల్లో నెలకొన్న రేంజ్ ( వాడుక భాషలో మైలేజ్) భయానికి ముగింపు పలికింది. ఇప్పటివరకు విద్యుత్ వాహనాల విషయంలో ఉన్న డౌట్స్ మొత్తాన్ని పటాపంచలు చేసింది ఈ సంస్థ. ఈ బైక్ గురించి మరిన్న వివరాలు ఇక్కడ చూద్దాం.
భారత ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్‌లో గేమ్ ఛేంజర్ వచ్చేసింది. బెంగళూరుకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ సింపుల్ ఎనర్జీ (Simple Energy) భారత మార్కెట్లో సంచలనం సృష్టించింది. తన సెకండ్ జనరేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేస్తూ, దేశంలోనే ఎన్నడూ లేని విధంగా ఒకే ఛార్జ్‌తో ఏకంగా 400 కిలోమీటర్లు ప్రయాణించే సింపుల్ అల్ట్రా వేరియంట్‌ను పరిచయం చేసింది. ఇందులో 6.5 కిలోవాట్ గంటల సామర్థ్యం గల భారీ బ్యాటరీని అమర్చారు. ఇది భారతదేశ విద్యుత్ స్కూటర్ చరిత్రలోనే అత్యధిక సామర్థ్యం గల బ్యాటరీగా కంపెనీ వెల్లడించింది. ఈ బ్యాటరీ సహాయంతో స్కూటర్ అధికారికంగా 400 కిలోమీటర్లు ప్రయాణించింది. రోజువారీ అవసరాలకు ఉపయోగించే వాహనదారులు వారం రోజుల పాటు మళ్లీ చార్జ్ చేయాల్సిన అవసరం లేకుండా ప్రయాణించగల స్థాయిలో ఇది రూపుదిద్దుకుంది.
టాప్ స్పీడ్..
పనితీరు పరంగానూ ఈ స్కూటర్ ప్రత్యేకతను చాటుతోంది. గంటకు 115 కిలోమీటర్ల గరిష్ఠ వేగాన్ని అందుకుంది. అంతే కాదు 0-40 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 2.77 సెకన్లలో చేరుకోగలదు. దీని వల్ల ఇది కేవలం లాంగ్ రేంజ్ జర్నీతో పాటు.. స్మూత్ హైస్పీడ్ డ్రైవింగ్ అనుభూతిని అందించే స్కూటర్‌గా నిలుస్తోంది.

వివిధ వాహనదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సంస్థ మరిన్ని నమూనాలను కూడా ప్రవేశపెట్టింది. సింపుల్ వన్ ఎస్ మోడల్ 190 కిలోమీటర్ల ప్రయాణ సామర్థ్యంతో రూ.1,49,999 ధరకు లభిస్తోంది. 4.5 కిలోవాట్ గంటల బ్యాటరీతో వచ్చే సింపుల్ వన్ మోడల్ 236 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. 5 కిలోవాట్ గంటల బ్యాటరీతో మరో వేరియంట్ 265 కిలోమీటర్ల సామర్థ్యాన్ని అందిస్తోంది. ఈ స్కూటర్లు ప్రస్తుతం ప్రత్యేక ప్రారంభ ఆఫర్ కింద తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నట్లు సంస్థ ప్రకటించింది. ఆన్‌లైన్ వాణిజ్య వేదికల ద్వారా కూడా వీటిని కొనుగోలు చేసే అవకాశం ఉంది.
బ్యాటరీపై లైఫ్ టైం వారెంటీ..
వాహనదారుల్లో విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసేలా సింపుల్ ఎనర్జీ కీలక నిర్ణయం తీసుకుంది. తమ విద్యుత్ స్కూటర్లలోని బ్యాటరీ పై లైఫ్ టైం వారెంటీని ప్రకటించింది. భారత విద్యుత్ వాహన పరిశ్రమలో ఇలాంటి హామీ ఇవ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం. దీని ద్వారా దీర్ఘకాల వినియోగ వ్యయం తగ్గడమే కాకుండా, వాహనదారులకు ఆర్థిక భద్రత కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
జెన్-2 స్కూటర్లలో ప్రత్యేకతలు..
అంతేకాకుండా జెన్-2 స్కూటర్లలో ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, 35 లీటర్ల భారీ అండర్ సీట్ స్టోరేజ్, 7-అంగుళాల టచ్ స్క్రీన్ డాష్ బోర్డ్ వంటి అత్యాధునిక ఫీచర్లను జోడించారు. ఎకో ఎక్స్, ఎకో, రైడ్, ఎయిర్, సోనిక్, సోనిక్ ఎక్స్ వంటి 6 రకాల మోడ్స్ ఉన్నాయి.
ఈ సందర్భంగా సంస్థ ముఖ్య కార్యనిర్వాహక అధికారి సుహాస్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ, భారతీయ వాహనదారుల అవసరాలను పూర్తిగా అర్థం చేసుకుని ఈ రెండో తరం స్కూటర్లను రూపకల్పన చేశామని తెలిపారు. ప్రస్తుతం బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం సహా దేశవ్యాప్తంగా 61కి పైగా షోరూమ్‌లలో ఇవి అందుబాటులో ఉన్నాయని చెప్పారు. భవిష్యత్తు ప్రణాళికలపై కూడా సంస్థ స్పష్టత ఇచ్చింది ఈ సంస్థ. 2026 మార్చి నాటికి దేశవ్యాప్తంగా 150 డీలర్ కేంద్రాలు, 200 సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా 2027లో భారీగా షేర్ల విక్రయానికి వెళ్లి సుమారు రూ.3,000 కోట్ల నిధులను సమీకరించాలని భావిస్తున్నట్లు ప్రకటించింది.












Click it and Unblock the Notifications