బంగారం కొనడం ఆపకపోతే రూపాయి కొంప కొల్లేరే: ఉదయ్ కోటక్ కామెంట్స్!
పసిడి అంటే భారతీయులకు కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు.. ఒక సెంటిమెంట్, సురక్షితమైన పెట్టుబడి సాధనం. పండగొచ్చినా, పబ్బమొచ్చినా, ఇళ్లల్లో శుభకార్యాలు ఉన్నా తులం బంగారం అయినా కొనాల్సిందే అనే ధోరణి మన సమాజంలో ముదిరిపోయింది. అయితే మన ప్రజల ఈ పసిడి వ్యామోహం దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద పెను సవాలుగామారుతోందని ప్రముఖ దిగ్గజ బ్యాంకర్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్న సదస్సులో ఆయన మాట్లాడుతూ.. భారతీయ కుటుంబాల వద్ద ఉన్న బంగారం వ్యక్తిగతంగా పెద్ద సంపదే కావచ్చు, కానీ అది దేశ ఆర్థిక ఉత్పత్తికి ఏ రకంగానూ ఉపయోగపడకుండా మూలనపడిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
కరెంట్ ఖాతా లోటుకు బంగారమే ప్రధాన కారణం!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన దేశ ప్రస్తుత ఖాతా లోటు (Current Account Deficit) సుమారు 60 బిలియన్ డాలర్లుగా ఉండే అవకాశం ఉంటే, అందులో కేవలం విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకునే బంగారం బిల్లే ఏకంగా 88 నుంచి 90 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.7.5 లక్షల కోట్లకు పైగా) చేరుకుంటుందని ఉదయ్ కోటక్ అంచనా వేశారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.6 లక్షల కోట్ల విలువైన పసిడిని దిగుమతి చేసుకున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే.. భారత్ గనుక బంగారం దిగుమతులను ఆపితే, మన దేశానికి ఎటువంటి ఆర్థిక లోటు ఉండకపోగా, మిగులు బడ్జెట్లోకి వెళ్తామని ఆయన లెక్కలతో సహా వివరించారు.

పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీ వేయాలి!
"భారతీయులు.. వారి బంగారం" అనేది ఒక చిక్కుముడి లాంటిదని, దీనికి త్వరితగతిన పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందని కోటక్ సూచించారు. ప్రజల సెంటిమెంట్లను, అవసరాలను దెబ్బతీయకుండానే.. దేశ మూలధనాన్ని విదేశీ పసిడి కొనుగోళ్ల వైపు మళ్లకుండా అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మండుతున్న వేళ, బంగారం కోసం భారీగా డాలర్లను విదేశాలకు చెల్లించడం వల్ల రూపాయి విలువ పడిపోవడంతో పాటు మన విదేశీ మారక నిల్వలపై తీరని ఒత్తిడి పెరుగుతోందని హెచ్చరించారు.
ఆర్థిక సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవాలి!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణం, ఆర్థిక అనిశ్చితిని భారత్ ఒక అవకాశంగా మార్చుకోవాలని ఉదయ్ కోటక్ పిలుపునిచ్చారు. ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకుని, ప్రపంచానికి కావాల్సిన వస్తువులను మన దేశంలోనే తయారుచేసి ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలన్నారు. అలాగే స్టాక్ మార్కెట్లలో కేవలం విక్రయాలు, ట్రేడింగ్ వాల్యూమ్స్ పెరగడం మాత్రమే సరిపోదని, అది దేశ నిర్మాణానికి ఉపయోగపడే మూలధనంగా మారాలని అభిప్రాయపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేసి ఈ ఆర్థిక సవాళ్లను అధిగమించాలని స్పష్టం చేశారు.














Click it and Unblock the Notifications
