Vijay Mallya సంచలన ఆరోపణలు! నాకు న్యాయం చేయడం లేదంటూ..
ఒకప్పుడు కింగ్‌ఫిషర్ అధినేతగా రాజ్యమేలి, రూ. వేల కోట్ల బ్యాంకు లోన్స్ తీసుకుని దేశం విడిచి పారిపోయిన విజయ్ మాల్యా మరోసారి సోషల్ మీడియా వేదికగా తన కడుపు మంట బయటపెట్టారు. భారత బ్యాంకింగ్ వ్యవస్థ, రుణ పరిష్కార తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. ఇతరులకు దక్కుతున్న వెసులుబాటు తనకెందుకు దక్కడం లేదని ప్రశ్నించారు. బ్యాంకులు తన నుంచి అసలు అప్పు కంటే ఎక్కువ మొత్తాన్ని రికవరీ చేసుకున్నప్పటికీ, తనకు న్యాయం జరగకుండా అణచివేస్తున్నారంటూ ఎక్స్ వేదికగా ఆయన వేసిన ప్రశ్నలు ఇప్పుడు ఆర్థిక వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.
మీడియా రంగ ప్రముఖుడు సుభాష్ చంద్రకు చెందిన లోన్స్ పరిష్కారంపై వచ్చిన వార్తలను ప్రస్తావిస్తూ మాల్యా ఈ వ్యాఖ్యలు చేశారు. దాదాపు రూ. 22,006 కోట్ల అప్పుకు గాను కేవలం రూ. 6.5 కోట్లతో ఆ ఇన్సాల్వెన్సీ కేసు ముగిసిందన్న వార్తను చూపుతూ.. తన స్నేహితుడు సుభాష్‌కి అభినందనలు తెలిపారు. "దేశంలో చాలామంది బడా పారిశ్రామికవేత్తలు అసలు తీసుకున్న లోన్లో అతి స్వల్ప శాతాన్ని చెల్లించి కేసుల నుంచి బయటపడుతున్నారు. ఇదేనా భారత రుణ పరిష్కార న్యాయం? దీనిపై ఏ మీడియా ప్రశ్నించదేంటి?" అంటూ ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

తీసుకున్న దానికంటే ఎక్కువే లాక్కున్నారు!
తనపై ఉన్న కోర్టు తీర్పు ప్రకారం తను చెల్లించాల్సిన అప్పు రూ. 6,203 కోట్లు మాత్రమేనని, కానీ బ్యాంకులు, ప్రభుత్వం తన ఆస్తులను వేలం వేసి ఏకంగా రూ. 14,100 కోట్లు రికవరీ చేసుకున్నామని ఒప్పుకున్నాయని మాల్యా గుర్తుచేశారు. అప్పు కంటే రెట్టింపు మొత్తం వసూలు చేసినా తనను ఇంకా వేధిస్తూనే ఉన్నారంటూ ఆయన మండిపడ్డారు. పార్లమెంట్‌లో ఆర్థిక శాఖ ఇచ్చే ప్రకటనలకు, బ్యాంకులు చెబుతున్న లెక్కలకు అస్సలు పొంతన లేదని, అసలు రూ. 4,000 కోట్ల తేడా ఎక్కడికి పోయిందో ఎవరూ సమాధానం చెప్పడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
If True many congratulations to my friend Subhash.Banks and Government have admitted having recovered Rs 14,100 crores from me against a Judgement debt of Rs 6203 crores. Many more borrowers have settled at a fraction. Indian Debt Resolution Justice I presume. No media questions. pic.twitter.com/5uwxYSAX8H
— Vijay Mallya (@TheVijayMallya) August 26, 2026
రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించండి!
ప్రభుత్వం, బ్యాంకులు పొంతన లేని లెక్కలు చెబుతూ ప్రజలను, తనను మభ్యపెడుతున్నాయని మాల్యా ఆరోపించారు. రికవరీ అయిన మొత్తానికి సంబంధించిన సరైన అకౌంట్ స్టేట్‌మెంట్ ఇప్పటివరకు తనకు ఇవ్వలేదని అన్నారు. ఈ దారుణమైన పరిస్థితిపై నిజా నిజాలు తేలాలంటే ఒక రిటైర్డ్ జడ్జితో స్వతంత్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. లెక్కల్లో జరుగుతున్న ఈ గోల్‌మాల్‌పై పారదర్శకత లేకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.
పార్లమెంట్‌లో కేంద్రం ఇచ్చిన లెక్కలు ఇవే..
మరోవైపు, దేశంలో 2025 అక్టోబర్ నాటికి 15 మందిని పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తులుగా గుర్తించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంట్‌కు వెల్లడించారు. ఈ జాబితాలో విజయ్ మాల్యా, నిరవ్ మోదీ వంటి ప్రముఖుల పేర్లు ఉన్నాయి. వీరంతా కలిపి బ్యాంకులకు దాదాపు రూ. 26,645 కోట్ల అసలు బాకీ పడగా, వడ్డీలతో కలిపి అది రూ. 31,437 కోట్లకు చేరింది. అయితే ఈ నేరస్తుల ఆస్తుల నుంచి ఇప్పటివరకు రూ. 19,187 కోట్లు మాత్రమే రికవరీ చేయగలిగామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవైపు ప్రభుత్వ విచారణలు, మరోవైపు మాల్యా బహిరంగ సవాల్‌లతో ఈ లోన్ రికవరీ కాంట్రవర్సీ మళ్లీ పతాక స్థాయికి చేరింది.














Click it and Unblock the Notifications