నా దేశం కోసం నేను వర్క్ ఫ్రమ్ హోమ్.. HRకు షాకింగ్ మెయిల్!
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన పోస్ట్ తెగ చక్కర్లు కొడుతోంది. సాధారణంగా ఆఫీసుకి వెళ్లడం ఇష్టం లేకనో, వ్యక్తిగత కారణాల వల్లో ఉద్యోగులు 'వర్క్ ఫ్రమ్ హోమ్' (WFH) అడుగుతుంటారు. కానీ, ఒక యువతి మాత్రం ఏకంగా "దేశం కోసం" తనకు ఇంటి నుంచే పని కావాలని హెచ్‌ఆర్ (HR) విభాగానికి మెయిల్ పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వినూత్న ప్రయత్నం నెటిజన్ల దృష్టిని ఆకర్షించడమే కాకుండా, పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
మోదీ పిలుపు.. సుప్రియ స్పందన!
ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మండిపోతున్న తరుణంలో, ఇంధనాన్ని ఆదా చేసేందుకు ప్రజలు మళ్లీ 'వర్క్ ఫ్రమ్ హోమ్' వైపు మొగ్గు చూపాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం పిలుపునిచ్చారు. ప్రధాని చేసిన ఈ ప్రకటనను సుప్రియ అనే యువతి సీరియస్‌గా తీసుకుంది. వెంటనే తన ఆఫీసు హెచ్‌ఆర్‌కు ఒక మెయిల్ పంపింది. అందులో, "ప్రధాని మోదీ విజ్ఞప్తికి మద్దతుగా, నా దేశం కోసం నేను చేయగలిగిన కనీస సేవగా మే 10, 2027 వరకు ఇంటి నుంచే పనిచేయాలని నిర్ణయించుకున్నాను" అని పేర్కొంది.

I’ve done my part for the nation… your turn now 🙌🏻 pic.twitter.com/dYpqBtM4Ke
— SUPRIYA (@Supriyashrivxst) May 11, 2026
"నేను నా వంతు చేశాను.. మరి మీరు?"
తాను పంపిన ఈమెయిల్ స్క్రీన్‌షాట్‌ను ఎక్స్ (X) వేదికగా షేర్ చేస్తూ.. "నేను దేశం కోసం నా వంతు కృషి చేశాను... ఇప్పుడు మీ వంతు" అంటూ ఒక క్యాప్షన్ ఇచ్చింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరైతే భలే ప్లాన్ వేశావమ్మా అని మెచ్చుకుంటుంటే, మరికొందరు మాత్రం హ్యూమరస్ వ్యాఖ్యలతో సెటైర్లు వేస్తున్నారు. "మీ దేశభక్తికి మెచ్చి హెచ్‌ఆర్ మీకు పర్మనెంట్ లీవ్ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు" అని ఒక నెటిజన్ చమత్కరించగా, "ప్రియమైన మోదీ జీ.. వెంటనే ప్రధాన్ మంత్రి వర్క్ ఫ్రమ్ హోమ్ యోజనను అమలు చేయండి" అంటూ మరొకరు రాసుకొచ్చారు.
ఎందుకీ ప్రకటన?
పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఇరాన్ సంక్షోభం కారణంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ నేపథ్యంలో, దేశ ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఇంధన పొదుపు అవసరమని ప్రధాని గుర్తుచేశారు. "కరోనా సమయంలో మనం ఆన్‌లైన్ మీటింగ్‌లు, వీడియో కాన్ఫరెన్స్‌లకు అలవాటుపడ్డాం.. మళ్లీ ఆ విధానాన్ని పాటిస్తే దేశానికి మేలు జరుగుతుంది" అని ఆయన సూచించారు.
ఉద్యోగ సంఘాల మద్దతు!
ప్రధాని ప్రకటనతో ఐటీ ఉద్యోగుల సంఘం 'నైట్స్' (NITES) కూడా రంగంలోకి దిగింది. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, సాధ్యమైన అన్ని విభాగాలలో వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖను కోరింది. మొత్తంమీద, సుప్రియ చేసిన ఈ చిన్న ప్రయత్నం ఇప్పుడు దేశవ్యాప్తంగా 'వర్క్ ఫ్రమ్ హోమ్' చర్చను మరోసారి తెరపైకి తెచ్చింది














Click it and Unblock the Notifications