కరోనా బారిన పడ్డ వడివేలు: రోజురోజుకూ క్షీణిస్తోన్న పరిస్థితులు: థర్డ్‌వేవ్ సంకేతాలు
చెన్నై: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి క్రమంగా కోరలు చాస్తోంది. థర్డ్‌వేవ్‌కు దారి తీసే పరిస్థితులు దేశంలో నెలకొన్నాయి. రోజువారీ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో పెద్దగా పెరుగుదల కనిపించనప్పటికీ- ఒమిక్రాన్ వేరియంట్ గుబులు పుట్టిస్తోంది. విస్ఫోటనం చెందుతోంది. ఇప్పటిదాకా 17 రాష్ట్రాల్లో తిష్ఠ వేసిందీ వేరియంట్. రోజురోజుకూ తన పరిధిని విస్తరించుకుంటోంది. పిల్లలకూ ఒమిక్రాన్ వేరియంట్ సోకుతోండటం మరింత ఆందోళనకర పరిస్థితులకు దారి తీస్తోంది.
తమిళనాడులో ఒకేసారి 31 ఒమిక్రాన్ వేరియంట్ వెలుగులోకి రావడం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మొన్నటిదాకా జీరో ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు ఉన్న ఈ రాష్ట్రంలో రాత్రికి రాత్రి వెల్లువలా వచ్చి పడ్డాయి. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వెలుగులోకి వచ్చిన రాష్ట్రాల జాబితాలో తమిళనాడు ఒక్కసారిగా నాలుగో స్థానానికి ఎగబాకింది. మొత్తంగా 34 కేసులు అక్కడ నమోదయ్యాయి. కరోనా వైరస్ రోజువారీ కేసులు సైతం పెరుగుదల బాట పట్టాయి.

తాజాగా- ప్రముఖ తమిళ హాస్యనటుడు వడివేలు కరోనా వైరస్ బారిన పడ్డారు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న తరువాత కూడా ఆయనకు ఈ మహమ్మారి సోకడం కలకలం రేపుతోంది. అనారోగ్యానికి గురైన ఆయనకు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించగా.. పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఆయన శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్స్ కోసం పంపించారు. వాటి రిపోర్టులు ఇంకా అందాల్సి ఉంది. తనకు కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిన వెంటనే వడివేలు ఆసుపత్రిలో చేరారు.
చెన్నై శివార్లలోని పోరూర్‌లో గల ఎస్ఆర్ఎంసీ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. నాయి శేఖర్ రిటర్న్స్ అనే సినిమాలో నటిస్తున్నారాయన. ఇదివరకు బహుభాషా నటుడు, మక్కల్ నీథి మయ్యం అధినేత కమల్ హాసన్‌కు కూడా కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. ఆయన ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులో ఉంటూ చికిత్స పొందారు. సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. ఇంటికి చేరుకున్నారు. రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
బాలీవుడ్‌లో కరీనా కపూర్, అమృత అరోరా కూడా కోవిడ్ బారిన పడ్డారు. కరీనా కపూర్ శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్స్ కోసం పంపించగా.. నెగెటివ్‌గా రిపోర్టులు రావడం ఊరట కలిగించింది. ఇప్పటిదాకా 17 రాష్ట్రాల్లో 358 ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ కేేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర-88, ఢిల్లీ-67, తెలంగాణ-38, తమిళనాడు-34, కర్ణాటక-31, గుజరాత్-30, కేరళ-27, రాజస్థాన్-22, హర్యానా-4, ఒడిశా-4, జమ్మూ కాశ్మీర్-3, పశ్చిమ బెంగాల్-3, ఆంధ్రప్రదేశ్-2, ఉత్తర ప్రదేశ్-2, చండీగఢ్-1, లఢక్-1, ఉత్తరాఖండ్-1 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. ఇందులో 114 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.












Click it and Unblock the Notifications