Tamil Nadu Assembly Election 2021: కమల్ హాసన్ సీఎం అవ్వటం ఖాయం - రాధికా శరత్ కుమార్
తమిళనాడులో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఒకరిని మించి ఒకరు హామీలతో తమిళ రాజకీయాన్ని హోరెత్తిస్తున్నారు. తమిళ ఓటర్లను ఆకట్టుకునేలా మేనిఫెస్టోలతో ఎన్నికల ప్రచారాన్ని రక్తి కట్టిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని హోరాహోరీగా ఎన్నికలకు ముందు నుండే ప్రచారం నిర్వహించిన మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత, నటుడు కమల్ హాసన్ ఇప్పుడు కూడా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు.

ఐజేకే కూటమి విజయం సాధిస్తుందని ధీమా
పొత్తులతో ఎన్నికల బరిలోకి దిగిన కమల్ హాసన్ ఐజేకే కూటమి విజయం సాధిస్తుందని, కమల్ హాసన్ సీఎం అవ్వడం ఖాయం అంటూ సమత్తువ మక్కల్ కట్చి అగ్రనేత, నటి రాధిక శరత్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడు ప్రజలు మార్పు కోరుకుంటున్నట్లు సర్వేలో స్పష్టమైందని, సుపరిపాలన లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగిన తమ కూటమి విజయం సాధిస్తుందని ఆమె స్పష్టం చేశారు. ఈసారి మూడో కూటమిగా ఏర్పడిన ఐ జే కే కూటమి ఈ ఎన్నికలలో ప్రభంజనం సృష్టిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

తమిళ రాజకీయాల్లో మార్పు కోసమే కూటమి
విద్యా, వైద్య రంగాలలో ప్రసిద్ధులైన జననాయక కట్చి అధ్యక్షులు రవి పచ్చ ముత్తు, మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్, సమత్తువ మక్కల్ కట్చి అధినేత శరత్ కుమార్ లతో కూటమిగా ఏర్పడ్డారని తమిళ రాజకీయాల్లో మార్పు కోసమే ఈ కూటమి అని ఆమె స్పష్టం చేశారు. తమిళనాడులో ఇంతకుముందు ఉన్న లీడింగ్ పార్టీలకు ఓటు వేసి వేసి, ప్రజలు ప్రస్తుతం మార్పు కోరుకుంటున్నారని రాధిక శరత్ కుమార్ స్పష్టం చేశారు.

కమల్ హాసన్ ముఖ్యమంత్రి అవ్వటం ఖాయం
పరిపాలనలో ఒక మార్పు తీసుకు వస్తామని ప్రజలకు ప్రమాణం చేస్తున్నామని, వాస్తవికతకు దగ్గరగా ఉండే మేనిఫెస్టో తమదేనని, ప్రజలను తప్పుడు హామీలతో మభ్య పెట్టడం లేదని ఆమె పేర్కొన్నారు.
గుడ్ గవర్నెన్స్ కోసం ప్రజల ఐజెకె కూటమిని ఆదరిస్తారని రాధిక శరత్ కుమార్ అభిప్రాయపడ్డారు. భావితరాల కోసం కమల్ హాసన్ మంచి చేస్తారనే నమ్మకం ప్రజలందరికీ ఉందని పేర్కొన్న రాధిక కమల్ హాసన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని తాను విశ్వసిస్తున్నట్లుగా పేర్కొన్నారు.

తమిళనాడు ఎన్నికల్లో పోరాటానికి కార్యాచరణ
తమిళనాడు రాష్ట్రంలో సుపరిపాలన సాగించడం కోసం, మార్పు కోసం వచ్చిన ఐజెకె కూటమిని ఆదరించాలని, కమల్ హాసన్ ను సీఎంను చేయాలని రాధిక శరత్ కుమార్ విజ్ఞప్తిచేశారు .
ఇదిలా ఉంటే రాజకీయాల్లో చక్రం తిప్పడానికి తమిళనాడులో కొత్త పార్టీ స్థాపించిన కమల్ హాసన్ అసెంబ్లీ ఎన్నికలకు మూడో కూటమిని ఏర్పాటు చేసి, కూటమి తరపున సీఎం అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.
రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సంయుక్తంగా పోరాడటానికి కార్యచరణ రూపొందించి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు.












Click it and Unblock the Notifications