తమిళనాడు ఉపముఖ్యమంత్రిగా ఉదయనిధి స్టాలిన్
చెన్నై: తమిళనాడు మంత్రివర్గం పునర్ వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైంది. డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ (Udayanidhi Stalin) ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించనున్నారు. ఆదివారం (సెప్టెంబర్ 29న) ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఉద్యోగాల పేరిట అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొని జైలుకు వెళ్లి, ఇటీవల విడుదలైన మాజీ మంత్రి సెంథిల్ బాలాజీని మళ్లీ కేబినెట్‌లోకి తీసుకున్నారు. ఈ మేరకు రాజ్ భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా, గత కొద్ది రోజులుగా తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్ఠాలిన్ అవుతారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఆ ప్రచారాన్ని పలుమార్లు ఉదయనిధి స్టాలిన్ కొట్టిపారేశారు. కానీ, చివరకు ఆయన డిప్యూటీ సీఎంగా రేపు ప్రమాణస్వీకారం చేయనుండటం గమనార్హం.

ఉదయనిధి ప్రస్తుతం తన తండ్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వంలో యువజన, క్రీడా మంత్రిగా ఉన్నారు. సెప్టెంబరు 19న, తమిళనాడులోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రి తా మో అన్బరసన్.. డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్‌ను ఎదగడం "ఆసన్నమైనది" అని చెప్పారు.
ఒక వారం నుంచి 10 రోజులలోపు ఉదయనిధిని ప్రభుత్వం ఖచ్చితంగా డిప్యూటీ సీఎంగా ప్రకటిస్తుందని అన్బరసన్ చెప్పారు. "బహుశా, రేపు ప్రకటన రావచ్చు," అని ఆయన అన్నారు. ఉదయనిధి ఈ ప్రచారంపై మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
తాజాగా, ఈ సిఫార్సులను రాష్ట్ర గవర్నర్ ఆమోదించారని, ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుందని రాజ్‌భవన్ తెలిపింది.
ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనుండగా.. వి సెంథిల్ బాలాజీ, డాక్టర్ గోవి చెజియాన్, ఆర్ రాజేంద్రన్, ఎస్ఎం నాసర్‌లను మంత్రివర్గంలోకి ఎంకే స్టాలిన్ చేర్చుకున్నారు. 15 నెలల తర్వాత మనీలాండరింగ్ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన కొద్ది రోజుల తర్వాత బాలాజీ మళ్లీ మంత్రి మండలిలో చేరుతున్నారు.












Click it and Unblock the Notifications