పవన్ హీరోనే - కానీ ,చంద్రబాబు సినిమా చూపిస్తారు..!!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యల పైన ఏపీ మంత్రులు స్పందించారు. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో మంత్రి అంబటి రాంబాబు ఏకీభవించారు. పవన్ రాజకీయాల్లో ఫెయిల్ అయ్యారనేది వాస్తవమని చెప్పుకొచ్చారు. నటుడిగా పవన్ సక్సెస్ అయ్యారని అంగీకరించారు. రాజకీయంగా ఇక పైన కూడా సక్సెస్ అయ్యే అవకాశం లేదన్నారు. సైద్దాంతిక విధానమంటూ పవన్ రాజకీయాల్లో తన పాత్ర సరిగ్గా పోషించ లేకపోతున్నారని అంబటి చెప్పుకొచ్చారు. చెగువీరా గురించి మాట్లాడే పవన్ ఒక సారి కమ్యూనిస్టులతో ఒక సారి బీజేపీతో కలుస్తారని ఎద్దేవా చేసారు.
ఇప్పటికే కాదని... ఎప్పటికీ పవన్ రాజకీయంగా ఫెయిల్యూర్ నాయకుడిగానే మిగిలిపోతారని జోస్యం చెప్పారు. పాలవరం ప్రాజెక్టు వద్దకు వెళ్లి చంద్రబాబు కొత్తడ్రామా చేసే ప్రయత్నం చేసారని ఆరోపించారు. అయిదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదని అంబటి ప్రశ్నించారు. 2018లోనే ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేసారు. చంద్రబాబు నాడు తీసుకున్న తొందర పాటు నిర్ణయాల వలనే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని అంబటి చెప్పపుకొచ్చారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యల పైన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి స్పందించారు. చంద్రబాబును నమ్ముకొని పవన్ తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు.

మామకు వెన్ను పోటు పొడిచిన చంద్రబాబు..అదే తరహాలో రానున్న రోజుల్లో సినిమా చూపిస్తారని చెప్పుకొచ్చారు. చంద్రబాబును ప్రజా కోర్టు నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేసారు. చంద్రబాబు ఏం చేసైనా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని.. ఏం చేసినా తిరిగి ముఖ్యమంత్రి కాలేరని పేర్కొన్నారు. ఎవరెన్ని జట్లు కట్టినా వచ్చే ఎన్నికల్లో మరోసారి ప్రజలు వైసీపీకే బ్రహ్మరధం పడతారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ధీమా వ్యక్తం చేసారు. తాము ఏ గ్రామానికి వెళ్లినా జగన్ అందిస్తున్న పాలనను ప్రజలు మెచ్చుకుంటున్నారని నారాయణ స్వామి చెప్పారు. చంద్రబాబుతో కలిసిన తరువాత పవన్ అసలు విషయం అర్దం అవుతుందని పేర్కొన్నారు.