కుప్పంలో ఓటమిపై బాబు కలవరం , పార్టీ శ్రేణులకు క్లాస్.. త్వరలో కుప్పం వెళ్లనున్న చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని కుప్పం నియోజకవర్గం పంచాయతీ ఎన్నికల ఫలితాలు కలవరానికి గురిచేస్తున్నాయా ? కుప్పంలో ఫెయిల్యూర్ పై చంద్రబాబులో అంతర్మథనం మొదలైందా ? త్వరలో చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికి వెళ్లి దిద్దుబాటు చర్యలు చేపడతారా? అంటే తాజా పరిణామాలు అవుననే సమాధానమే ఇస్తున్నాయి.

పంచాయతీ ఎన్నికల్లో కుప్పంలో టీడీపీ ఘోర ఓటమి
టిడిపి అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం నియోజకవర్గంలో టిడిపి తిరుగులేని మెజారిటీతో విజయం సాధిస్తుంది అనుకుంటే అందుకు భిన్నంగా తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కుప్పంలో టీడీపీ ఘోర ఓటమి పాలైంది. చంద్రబాబు నాయుడికి తీవ్ర పరాభవం ఎదురైంది. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులు ఎక్కువ స్థానాల్లో విజయం సాధించారు. కుప్పం నియోజకవర్గంలో 89 పంచాయతీల్లో 74 చోట్ల టిడిపి మద్దతుదారులను వైసీపీ మద్దతుదారులు ఓటమి పాలు చేశారు.

కుప్పం ఎన్నికల ఫలితాలపై లోకల్ లీడర్లకు చంద్రబాబు క్లాస్
ఊహించని షాక్ తో చంద్రబాబు కంగుతిన్నారు.
కుప్పం ఫలితాలపై నియోజకవర్గంలో పార్టీ నాయకులతో సమీక్షలో మాట్లాడిన చంద్రబాబు వారిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అసలు నియోజకవర్గంలో ఏం చేస్తున్నారు? టిడిపి నాయకులంతా ఏమైపోయారు ? అని ఆగ్రహంతో ప్రశ్నించిన చంద్రబాబు లోకల్ లీడర్ల పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మండల ఇన్చార్జి లు, ఇతర నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు ఓవైపు కేడర్ కు క్లాస్ పీకుతూనే మరోవైపు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు.

త్వరలో కుప్పం వస్తానన్న చంద్రబాబు .. లోకల్ నాయకులకు అండగా ఉంటానని భరోసా
కుప్పం లో ఏం జరిగిందో నేను ఊహించగలను. వైసీపీ నేతలు బెదిరింపులకు భయపడొద్దు. ఇక మీదట నేను మీకు అండగా ఉంటాను. త్వరలో కుప్పం కి వస్తానంటూ చంద్రబాబు చెప్పినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం లో ఓటమి చంద్రబాబును తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. కుప్పంలో ఓటమితో అంతర్మధనం లో ఉన్న చంద్రబాబు, దిద్దుబాటు చర్యలకు స్వయంగా తానే రంగంలోకి దిగాలని భావిస్తున్నట్లుగా సమాచారం.
పార్టీ శ్రేణులపై ముందు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు ఆ తర్వాత వారందరినీ బుజ్జగించారు .












Click it and Unblock the Notifications