చిత్తూరులో కరోనా కలకలం: 17 మంది టీచర్లు, 10 మంది విద్యార్థులకు పాజిటివ్
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభమైననాటి నుంచి పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు కరోనావైరస్ మహమ్మారిన పడటం కలకలం రేపుతోంది. ఒక్క చిత్తూరు జిల్లాలోనే ఇప్పటి వరకు 17 మంది ఉపాధ్యాయులకు కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. వీరితోపాటు 10 మంది విద్యార్థులు కూడా ఈ మహమ్మారి బారినపడ్డారు. పాఠశాలలు ప్రారంభమైన తొలి రోజు ఆగస్టు 16న ముగ్గురు ఉపాధ్యాయులు, 17న ఒకరికి, 19న ఆరుగురికి, 21న ముగ్గురు ఉపాధ్యాయులు, ఇద్దరు విద్యార్థులకు కరోనా సోకింది.
ఆగస్టు 23న ముగ్గురు ఉపాధ్యాయులు, ఏడుగురు విద్యార్థులకు, 24న ఒక ఉపాధ్యాయుడు, ఒక విద్యార్థి కరోనావైరస్ బారినపడినట్లు తెలిసింది. చిత్తూరు జిల్లాతోపాటు కృష్ణా, ప్రకాశం తదితర జిల్లాల్లోనూ ఉపాధ్యాయులు, విద్యార్థులు కరోనా బారినపడటం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో తమ పిల్లలను పాఠశాలలకు పంపించేందుకు కొందరు తల్లిదండ్రులు సుముఖత వ్యక్తం చేయడం లేదు.

రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ప్రభుత్వం పాఠశాలలను ప్రారంభించిన విషయం తెలిసిందే. కరోనా నిబంధనలను పాటిస్తూ తరగతులు కొనసాగించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే, తాజా నమోదవుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. విద్యాలయాల్లో కరోనా కేసు పెరుగుదల ఇలాగే కొనసాగితే ప్రభుత్వం ప్రత్యక్ష తరగతుల నిర్వహణపై పునరాలోచించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఆన్‌లైన్ తరగతులను కూడా కొనసాగించాలని కోరుతున్నారు. ఇప్పటికే 90 శాతానికిపై పాఠశాల సిబ్బందికి వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించిన విషయం తెలిసిందే.
కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత రెండు మూడు రోజులుగా తగ్గినట్లే తగ్గిన కరోనా కేసులు ఇప్పుడు స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల వ్యవధిలో 1000పైనే కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 58,890 నమూనాలను పరీక్షించగా.. 1248 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం సాయంత్రం వెల్లడించింది.
తాజాగా నమోదైన 1248 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,04,590కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 15 మంది మృతి చెందారు. అత్యధికంగా చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ముగ్గురు చొప్పున, తూర్పుగోదావరి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, కర్నూలు, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 13,750 మృతి చెందారు.
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 1715 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 19,77,163కి చేరింది. కాగా, రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం 13,677 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,61,98,824 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 198 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అల్పంగా కడప జిల్లాలో 19 మంది కరోనా బారినపడ్డారు.
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 31, చిత్తూరులో 166, తూర్పుగోదావరిలో 66, గుంటూరులో 130, కడపలో 19, కృష్ణాలో 148, కర్నూలులో 25, నెల్లూరులో 120, ప్రకాశంలో 118, శ్రీకాకుళంలో 75, విశాఖపట్నంలో 67, విజయనగరంలో 45, పశ్చిమగోదావరిలో 238 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,84,250, చిత్తూరులో 2,36,563 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకుపైగా ఉన్నాయి. ఒక్క విజయనగరం జిల్లాలోనే లక్షకు దిగువగా(82,175) కరోనా కేసులున్నాయి.
Recommended Video
ఇది ఇలా ఉండగా దేశంలోనూ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. గత 24 గంటల్లో భారతదేశం 25,467 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య నిన్నటి 25,072 కంటే కొంచెం ఎక్కువ అయినప్పటికీ కరోనా క్షీణత దిశగా పయనిస్తూ ఉండటం ఒకింత ఊరట. నిన్న నమోదైన కేసులతో భారతదేశంలో మొత్తం కరోనా కేసులు 3.24 కోట్లకు పైగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో 354 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం మరణాలు 4.35 లక్షలకు పైగా ఉన్నాయి. యాక్టివ్ కోవిడ్ కేసులు భారతదేశంలో 3,19,551 కి తగ్గాయి. 156 రోజుల్లో అతి తక్కువగా నమోదయ్యాయి .యాక్టివ్ కేసులు మొత్తం ఇన్ఫెక్షన్లలో 1 శాతం కంటే తక్కువ నమోదు కావడం విశేషం . గత 24 గంటల్లో 39,486 మంది కరోనా రోగులు మహమ్మారి బారినుండి కోలుకున్నారు. ఇప్పటివరకు 3.17 కోట్లకు పైగా కోలుకున్నారు. రికవరీ రేటు క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఇది ప్రస్తుతం 97.68 శాతంగా ఉంది. గత సంవత్సరం మార్చి నుండి ఇప్పటివరకు ఇదే అత్యధికం కావడం గమనార్హం.












Click it and Unblock the Notifications