చంద్రబాబు అనుభవం దోపిడీకే ... విమర్శలు చంద్రబాబు పబ్లిసిటీ కోసమే : ఎమ్మెల్యే రోజా
నగరి ఎమ్మెల్యే రోజా టీడీపీ నేతల విమర్శలపై మండిపడుతున్నారు . ఒకపక్క కరోనా వైరస్ తీవ్ర రూపం దాలుస్తున్న సమయంలో టీడీపీ నేతలు సాయం చెయ్యటం మానేసి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒకపక్క ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సాయం చేయకుండా చంద్రబాబు నాయుడు ఇంటికే పరిమితమయ్యారని, పైపెచ్చు సలహాలు, సూచనలు తెగ ఇస్తున్నారని ఎమ్మెల్యే రోజా విమర్శించారు.
పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తే తాట తీస్తా: టీడీపీ నేతలకు రోజా సీరియస్ వార్నింగ్

వైసీపీ నాయకులపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారన్న రోజా
ప్రజలు కష్టాల్లో ఉంటే అండగా ఉండకపోవడమే కాకుండా ప్రభుత్వం మీద అనవసరపు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు . సేవ చేసే ధృక్పథంతో నిరంతరం ప్రజల మధ్యలో ఉంటున్న తన లాంటి ఎమ్మెల్యేలపై దుష్ప్రచారం చేస్తున్నారని రోజా నిప్పులు చెరిగారు . కరోనా కట్టడి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలను టీడీపీ నేతలు హర్షించకున్నా, ప్రజలు హర్షిస్తున్నారని తెలిపారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో వాలంటరీ వ్యవస్థను సీఎం జగన్ ఏర్పాటు చేశారని ఇప్పుడు ఆ వాలంటీర్ లే ప్రజల ఆరోగ్య రక్షణ కోసం పని చేస్తున్నారని ప్రశంసించారు.

చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి
వైసీపీ ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తుంటే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు అక్కసు వెళ్ళగక్కుతున్నారని, కేవలం ఆయన పబ్లిసిటీ కోసమే ప్రతి దాన్ని రాద్దాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు . సీఎం జగన్ పాలనలో ప్రజలకు కష్టాలు రాకుండా చూసుకుంటున్నామని రోజా తెలిపారు. మంచి చేయాలనే ఉద్దేశ్యంతో సీఎం జగన్ పని చేస్తుంటే వారి మనుగడ ప్రశ్నార్ధకం అవుతుందని , అందుకే తమ మనుగడ కోసం ప్రతి పక్షాలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. చంద్రబాబులా పబ్లిసిటీ పిచ్చి సీఎం జగన్‌కు లేదన్నారు.

చంద్రబాబు అనుభవం దోచుకోవడానికే
పని మీద తప్ప పబ్లిసిటీ మీద జగన్ ఎప్పుడూ దృష్టి పెట్టరని రోజా పేర్కొన్నారు . చంద్రబాబు అనుభవం దోచుకోవడానికే తప్ప ప్రజలకు మేలు చేసేందుకు కాదని విమర్శించారు రోజా .లాక్‌డౌన్ సమయాన వైసీపీ నాయకులు ఎక్కడికక్కడ ప్రజలకు సేవలందిస్తూ ఉంటే ఇళ్లలో విశ్రాంతి తీసుకుంటున్న టీడీపీ నాయకులు అనవసరంగా తమపై బురదజల్లే కార్యక్రమం చేపట్టారని ఎమ్మెల్యే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.ముఖ్యమంత్రి జగన్ ముందుచూపు కారణంగా కరోనా కేసుల సంఖ్య పూర్తిగా తగ్గుముఖం పట్టిందని రోజా పేర్కొన్నారు . ప్రజలకు సేవలందించకపోయినా పరవాలేదు కానీ అనవసర రాద్దాంతం ఆపాలని హితవు పలికారు. టీడీపీ నేతలు ఇళ్లలో కూర్చుని ఉంటే మంచిదని రోజా సూచించారు .