కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా.. నిర్లక్ష్యంగానే ప్రజలు.. బ్యాంక్ ఆఫ్ బరోడా వద్ద గుంపులుగా జనం
తూర్పుగోదావరి: జిల్లాలో కరోనా కేసులు 2 లక్షల దిశగా సాగుతున్నాయి. అయినా ప్రజల్లో కరోనా పట్ల ఏ మాత్రం భయం లేదు. భయం లేకపోయినా సరైనా జాగ్రత్తలైనా తీసుకోవడం లేదు. ఓ వైపు కరోనా కేసులు.. మరణాలు పెరుగుతున్నా.. ప్రజలు నిర్లక్ష్యం మాత్రం వీడటం లేదు. దీంతో రాష్ట్రంలోనే తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్నాయి.
తాజాగా, జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం కొత్తపల్లి గ్రామంలో బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గర జనం నగదు కోసం ఎగబడుతున్నారు. కరోనా సోకుతుందన్న భయం లేకుండా గుంపులు గుంపులుగా గూమిగూడారు. కొందరు మాస్కులు కూడా సరిగా పెట్టుకోలేదు. భౌతిక దూరం అన్న మాటకు ఇక్కడ స్థానమే లేదు.

ఈ దృశ్యం చూసిన కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా నిబంధనలు పాటించకుండా ఇలా గుంపులుగా గుంపులుగా చేరితే.. కరోనా మరింతగా వ్యాపించే అవకాశం ఉందని అంటున్నారు. బ్యాంకు అధికారులైనా.. కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.
మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం లాంటి నిబంధనలను బ్యాంకు అధికారులు ఖచ్చితంగా అమలు చేయాల్సి ఉందని అంటున్నారు. లేదంటే కరోనా మరింతగా విజృంభించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగానూ కరోనా కేసులు పెరుగుతున్నాయి.

గత 24 గంటల్లో ఏపీలో 91,253 నమూనాలను పరీక్షించగా.. 21,320 మందికి కరోనా సోకిందని తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 14,75,372కు చేరింది. తాజాగా, 99 మంది కరోనాతో మరణించారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా మరణాల సంఖ్య 9580కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,11,501 యాక్టివ్ కేసులున్నాయి.












Click it and Unblock the Notifications