శ్రీరామనవమికి రామయ్యకు నైవేద్యంగా పానకం, వడపప్పు ఎందుకు పెడతారో తెలుసా!!
నేడు శ్రీరామనవమి. జగదభి రాముడు, రవికుల తిలకుడు ఆయన శ్రీరామచంద్రమూర్తి పుట్టిన సుదినమే శ్రీరామనవమి. రామ భక్తులకు శ్రీరామనవమి ఒక పండుగలాంటి పర్వదినం. ప్రతి ఒక్కరు శ్రీరామనవమి పండుగ రోజు అత్యంత భక్తి భావంతో సీతారాముల కళ్యాణాన్ని తిలకించి, ఆ శ్రీరామచంద్రమూర్తిని ప్రార్థించి తరిస్తారు. ఇక శ్రీరామునికి ఇష్టమైన నైవేద్యాలను నివేదన చేసి పూజిస్తారు. శ్రీరామునికి ముఖ్యంగా నైవేద్యంగా పెట్టే వాటిలో పానకం, వడపప్పు ప్రత్యేకమైనవి. ఎందుకు శ్రీరామనవమి రోజు పానకం ఎందుకు ఇస్తారు? వడపప్పును నైవేద్యంగా నివేదిస్తారు? అంటే దానికి ఆధ్యాత్మిక, శాస్త్రీయ దృక్కోణాలు రెండూ ఉన్నాయని పలువురు పండితులు చెబుతున్నారు.
శ్రీరామచంద్రమూర్తికి బెల్లమన్నా, పానకం అన్నా ఇష్టమని, శ్రీరామచంద్రుడు స్వయంవరానికి వచ్చిన సమయంలో ఆయనకు బెల్లం పానకం ఇచ్చారని చెబుతారు . అప్పట్లో వేసవిలో బాటసారులకు వడదెబ్బ తగలకుండా బెల్లం పానకాన్ని ఇచ్చేవారట. ఇక ఈ క్రమంలోనే స్వయంవరానికి వెళ్లిన శ్రీరామచంద్రుడికి కూడా బెల్లం పానకాన్ని ఇచ్చినట్లు చెబుతారు. ఈ క్రమంలోనే పానకాన్ని శ్రీరాముడి వారసత్వంగా స్వీకరించి ఆయనకు పానకంతో నివేదన చేస్తారు. ఆపై ప్రసాదంగా అందరికీ పంచుతారు.

ఇక బెల్లానికి మన పూజలలో విశేషమైన స్థానం ఉంటుంది. అనేక క్రతువుల్లో కూడా బెల్లాన్ని ఉపయోగించటం ప్రధానంగా మనం చూస్తూ ఉంటాం. పెళ్లికి చిహ్నంగా, రెండు మనసులను ఏకం చేసే గుణం ఉన్న బెల్లాన్ని జీలకర్రతో కలిపి, జీలకర్ర బెల్లం పెట్టిస్తారు. ఇక వివాహ క్రతువులో అనేక సందర్భాలలో బెల్లం ప్రాధాన్యత కనిపిస్తుంది.
ఇక శాస్త్రీయ కోణంలో చూసినట్లయితే ఎండలు ముదిరే సమయంలో శ్రీరామనవమి వస్తుంది. కాబట్టి ఉష్ణోగ్రతను తగ్గించడానికి బెల్లం పానకం మంచి ఔషధంగా పనికి వస్తుంది. కాబట్టి బెల్లం పానకాన్ని స్వామి కళ్యాణానికి వచ్చిన వారందరికీ ప్రసాదంగా పంచి పెడతారు. అందులో మిరియాలు కలపడం వల్ల కఫాన్ని తగ్గించి ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. బెల్లం మనలో ఐరన్ లోపాన్ని నివారిస్తుంది. జీర్ణక్రియ సజావుగా సాగేలా చేస్తుంది. ఇక వడపప్పు మలబద్ధకాన్ని తొలగించి, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఏడాదికి ఒక్కసారైనా ఇటువంటి ఔషధయుక్తమైన ప్రసాదాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది.












Click it and Unblock the Notifications