
Health tips: దీపావళికి ఇష్టమైన స్వీట్లు తినాలనుకుంటున్నారా? అయితే ముందు ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి!!
దేశవ్యాప్తంగా హిందువులు అత్యంత ఇష్టంగా జరుపుకునే పండుగ దీపావళి పండుగ. వెలుగుల పండుగ అయిన దీపావళి పండుగను దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా జరుపుకుంటారు. దీపావళి సందర్భంగా ప్రజలు బంధుమిత్రుల ఇళ్లకు వెళ్లి దీపావళిని జరుపుకుంటారు. ఇక ఈ సందర్భంగా అందరూ సంతోషంగా స్వీట్లు తింటారు. ఇక ఇంట్లో తయారుచేసిన పిండివంటలను యథేచ్ఛగా లాగిస్తారు.
దీపావళి పండుగ సందర్భంగా ఇష్టమొచ్చినట్లు స్వీట్లు లాగించి, ఎప్పుడు పడితే అప్పుడు తింటే అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం పెరుగుతుంది. ఇక దీని నుండి బయట పడాలంటే ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అందుకే పండుగ సీజన్లో ఆరోగ్యంగా ఉండాలనుకునే వారికి కొన్ని ముఖ్యమైన హెల్త్ టిప్స్ ఇప్పుడు తెలుసుకుందాం.

దీపావళి పండుగకు ఆహరం విషయంలో జాగ్రత్త అవసరం
దీపావళి పండుగ సందర్భంగా ఇష్టమైనవి తినడం, బంధుమిత్రులతో సంతోషంగా గడపడం మంచిదే అయినప్పటికీ మితాహారం కాకుండా, అధికంగా ఆహారం తీసుకుంటే అనారోగ్యం పాలవుతారు. అందుకే తేలికపాటి భోజనం చేయాలనే విషయాన్ని పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఇంకా చెప్పాలంటే ఏదైనా లైట్ ఫుడ్ తీసుకున్న తర్వాత భోజనం చేయడానికి నాలుగు గంటల విరామం తీసుకోవాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. ఈ లోపు మళ్ళీ మీకు ఆకలిగా అనిపిస్తే తాజా పండ్లను, పండ్ల రసాలను తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. అలా కాకుండా స్వీట్లు, పిండి వంటలు యథేచ్ఛగా తింటే అనారోగ్యం బారిన పడటం పక్కా అని హెచ్చరిస్తున్నారు.

పండుగ స్పెషల్స్ బాగా తినాలని ఉందా .. అయితే ఈ అంశాలు దృష్టిలో పెట్టుకోండి
పండుగ సందర్భంగా స్పెషల్ భోజనం అని రకరకాల వంటలు చేసుకుని తినే వారంతా ప్రతిరోజు మనం తీసుకునే ఆహారానికి, పండుగ రోజు తీసుకునే ఆహారానికి మధ్య పెద్ద వ్యత్యాసం లేకుండా చూసుకోవాలని సలహా ఇస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. మనం తీసుకుంటున్న ఆహారంతో మన శరీరంలో షుగర్, ఫ్యాట్, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగకుండా చూసుకోవడం అన్నిటికంటే ముఖ్యమని సూచిస్తున్నారు. పండుగనాడు మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా ఉంటే మంచిదని, అది ఆరోగ్యాన్ని కాపాడుతుంది అని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు.

పండుగలకు స్వీట్స్ బదులు వీటిని తినండి
పండుగకు పది రకాల స్వీట్లు తయారు చేసుకొని తినే బదులు, 10 రకాల పండ్లు తెచ్చుకొని వాటిని మితంగా తింటే మంచిదని సూచిస్తున్నారు. ఇక బంధు మిత్రులకు బహుమతిగా ఇచ్చే స్వీట్ బాక్సులకు బదులు, వారికి కూడా పండ్లను ఇస్తే వారి ఆరోగ్యాన్ని కూడా కాపాడిన వారవుతారు అని చెబుతున్నారు. మనం స్వీట్ల తయారీలో వినియోగించే షుగర్ మన ఆరోగ్యాన్ని ఎక్కువగా పాడు చేస్తుందని చెబుతున్నారు. ఒకవేళ స్వీట్లు తయారు చేసుకోవాలి అనుకుంటే చక్కెరకు బదులు బెల్లం ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు. బెల్లంతో తయారు చేసిన స్వీట్స్ తో పెద్దగా ప్రమాదం ఉండదని చెప్తున్నారు.

పండుగ తర్వాత అనారోగ్యాలకు దూరంగా ఉండాలంటే ఈ పనులు చెయ్యండి
అన్నిటికంటే పండుగరోజు అయినప్పటికీ మనం నిత్యం మన శరీరానికి అలవాటు చేసిన ఆహార అలవాట్లకు భిన్నంగా ఉండకూడదు. మితాహారం తీసుకోవడం, మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా ద్రవపదార్థాలు ఉండేలా చూసుకోవడం, పండ్లు, తాజా కూరగాయలు తీసుకోవడం, శరీరం డీహైడ్రేట్ కాకుండా కాపాడుకోవడం ముఖ్యం. సమయానికి భోజనం చేయడం, 10 రకాల వంటలు చేసి ఉంటే, మితంగానే వాటిని తినడం, కడుపుని సగం ఖాళీగానే ఉంచుకోవడం, అనారోగ్యాన్ని కలిగించే ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం చేస్తే పండుగ తరువాత వచ్చే అనారోగ్యాలకు దూరంగా ఉండొచ్చని సలహా ఇస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ దీపావళి పండుగ సందర్భంగా నైనా ప్రతి ఒక్కరూ ఆహారం విషయంలో ఈ నియమాలు పాటించి పండుగను సంతోషంగా, ఆరోగ్యంగా జరుపుకోండి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.