బిజినెస్ ఫ్రెండ్లీ: టాప్-2లో తెలంగాణ, పడిపోయిన ఏపీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఐటీ, పారిశ్రామిక రంగంలో దూసుకుపోతోంది. తెలంగాణ ప్రభుత్వం నూతన తీసుకొచ్చిన టీఎస్ ఐపాస్, టీహబ్ లాంటి ఆవిష్కరణలు రాష్ట్రాన్ని పారిశ్రామికంగా ముందు వరుసలో నిలబెడుతున్నాయి. పారిశ్రామిక రంగంలో నూతన ఆవిష్కరణలతో దూసుకుపోతున్న రాష్ట్రాల ప్రాథమిక జాబితాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.
ఈ జాబితాలో తెలంగాణ 11 స్థానాలు ఎగబాకి రెండో స్థానాన్ని ఆక్రమించుకుంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం 17 స్థానాలు కిందికి పడిపోయింది. అయితే, జూన్ 15 తర్వాత ఈ జాబితా తుది వివరాలు వెల్లడవుతాయి. అప్పటి వరకు ఈ రాష్ట్రాల ర్యాంకుల్లో మార్పులు ఏర్పడే అవకాశం లేకపోలేదు.

ప్రపంచ బ్యాంక్ సహకారం తయారవుతున్నా ఈ జాబితా జులైలో వెలువడే అవకాశం ఉంది. గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉండగా, తెలంగాణ 13వ స్థానంలో ఉండింది.
కాగా, తాజాగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ ఆన్ బిజినెస్ రిఫార్మ్స్ అండ్ యాక్షన్ ప్లాన్స్ విడుదల చేసిన ప్రాథమిక నివేదిక ప్రకారం తెలంగాణ 2వ ర్యాంకుకు ఎగబాకగా, ఆంధ్రప్రదేశ్ 19వ ర్యాంకుకు పడిపోయింది. జూన్ 15లోగా పూర్తి సంస్కరణల వివరాలను తెలపాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కోరుతున్నాయి. ఈ క్రమంలో డిఐపిపి, ప్రపంచ బ్యాంక్ పైనల్ జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి.
ఈ ప్రాథమిక జాబితాలో బీహార్ ప్రథమ స్థానంలో ఉండటం విశేషం. ప్రస్తుత ర్యాంకులు మారుతుంటాయని, ఫైనల్ జాబితాను త్వరలోనే విడుదల చేస్తామని డిఐపిపి పేర్కొంది. గత సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది కేంద్రంలో, రాష్ట్రాల్లో పలు సంస్కరణలు ఆవిష్కృతమయ్యాయని తెలిపింది.
కాగా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, కర్ణాటకలు మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. ప్రపంచ బ్యాంక్ రూపొందించిన నివేదికలో గత సంవత్సరం గుజరాత్ ప్రథమ స్థానంలో ఉండగా, ఇప్పుడు 6వ స్థానంతో సరిపెట్టుకుంది. 16 రాష్ట్రాలతో పోటీ పడి 29 సంస్కరణలతో బీహార్ ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది.












Click it and Unblock the Notifications