జగన్ సర్కార్ కు మరో వైసీపీ ఎమ్మెల్యే ఝలక్ ? గుంటూరు ఘటనపై ఇరుకునపెట్టేలా.. !
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ వైసీపీ ప్రభుత్వానికి సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఝలక్ లు ఇస్తున్నారు. ఓవైపు ధర్మాన, మరోవైపు ఆనం వంటి సీనియర్లు రోజుకో కామెంట్ తో ప్రభుత్వాన్ని, పార్టీని ఇరుకునపెడుతుండగా.. ఇదే క్రమంలో జగన్ కు సన్నిహితుడైన మరో ఎమ్మెల్యే ఈసారి గుుంటూరు ఘటనపై ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనలో ప్రభుత్వం నిందితుడిగా భావిస్తున్న వ్యక్తికి మద్దతుగా ఆయన చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు ప్రభుత్వం ఇరుకునపడింది.

గుంటూరు ఘటన
ఏపీలో తాజాగా గుంటూరులో ఓ ఎన్నారై ఫౌండేషన్ నిర్వహించిన సంక్రాంతి కానుక పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారి తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ కార్యక్రమానికి వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు నిర్వాహకుడైన ఎన్నారై ఉయ్యూరు శ్రీనివాస్ పైనా తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం తొక్కిసలాటకు బాధ్యుడిని చేస్తూ నిర్వాహకుడైన ఎన్నారై ఉయ్యూరు శ్రీనివాస్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచింది. అయితే ప్రభుత్వ వాదనతో ఏకీభవించని న్యాయస్ధానం ఆయన్ను వదిలేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ప్రభుత్వం రోడ్లపై ర్యాలీలు, రోడ్ షోలు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

వైసీపీ ఎమ్మెల్యే వసంత కామెంట్స్
అయితే గుంటూరు తొక్కిసలాట ఘటనకు బాధ్యుడిని చేస్తూ ప్రభుత్వం అరెస్టు చేసిన ఎన్నారై ఉయ్యూరు శ్రీనివాస్ కు మద్దతుగా వైసీపీ మైలవరం ఎమ్మెల్యే, జగన్ కు సన్నిహితుడైన వసంత కృష్ణప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఈ ఘటనలో ఉయ్యూరు శ్రీనివాస్ పాత్రపై వసంత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీలో కలకలం రేపుతున్నాయి. గుంటూరు ఘటనలో చంద్రబాబుతో పాటు ఉయ్యూరు శ్రీనివాస్ తప్పు ఉందంటూ ప్రభుత్వ పెద్దలు, వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో సొంత పార్టీ ఎమ్మెల్యే వసంత చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఎన్నారైలను భయపెడితే ఎలా ?
గుంటూరు ఘటనకు బాధ్యుడిగా ప్రభుత్వం అరెస్టు చేసి, అనంతరం కోర్టు ఆదేశాలతో విడిచిపెట్టిన ఉయ్యూరు శ్రీనివాస్ తనకు సన్నిహితుడని, ఆయన చాలా కాలంగా తనకు తెలుసని వసంత తెలిపారు. సేవను రాజకీయ కారణాలతో విమర్శిస్తే ఎలా అని, ఎన్నారైలను ఇలా భయపెడతారా అంటూ వసంత ప్రశ్నించారు. కొంతమంది వ్యక్తులు ఎన్నారైలను వారి పనులు వారు చూసుకోవాలని సలహా ఇస్తున్నారని ఆక్షేపించారు. ఇలాగైతే వారు సేవా కార్యక్రమాలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. గుంటూరులో రాజకీయ వేదికపైకి వచ్చారనే కారణంతో కావాలని శ్రీనివాస్ పై ఉన్నవి, లేనివి కలిపి ప్రచారం చేస్తున్నారని వసంత మండిపడ్డారు. శ్రీనివాస్ వంటి వ్యక్తులు పేదల పట్ల అభిమానంతో ఇలాంటి కార్యక్రమం చేపట్టి అవస్ధల పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేసారు.
వరుస వివాదాల్లో వసంత ?
ఇప్పటికే మైలవరం నియోజకవర్గంలో ఉన్న గ్రూపు తగాదాలతో వసంత నిత్యం వార్తల్లోకి వస్తున్నారు. ఇప్పటికే వైసీపీకి చెందిన మంత్రి జోగి రమేష్ మైలవరంతో చేయి పెడుతున్నా జగన్ జోక్యం చేసుకోకపోవడంపై వసంత అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో వసంత చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించి జగన్ ఆయన్ను తాజాగా ఓసారి పిలిపించి మాట్లాడారు. ఇప్పుడు మరోసారి వసంత గుంటూరు ఘటనపై ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై చేసిన వ్యాఖ్యలు వైసీపీలో కలకలం రేపాయి. దీంతో వసంత విషయంలో సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications